బొలీవియాలో ఆందోళనలు: మహిళా మేయర్ జుట్టు కత్తిరించిన నిరసనకారులు

ఫొటో సోర్స్, EPA
బొలీవియాలోని ఓ చిన్న పట్టణానికి చెందిన మహిళా మేయర్‌పై ప్రతిపక్షానికి చెందిన నిరసనకారులు దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా ఆమెను వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి, ఆమె ఒంటి నిండా ఎర్ర రంగు పూసి, బలవంతంగా జుట్టు కూడా కత్తిరించారు.
అధికార మాస్ పార్టీకి చెందిన పాట్రీసియా ఆర్స్‌ను దాడి తర్వాత స్థానిక వింటో పోలీసులకు అప్పగించారు.
వివాదాస్పదంగా మారిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రభుత్వ, ప్రతిపక్ష మద్దతుదారుల మధ్య జరిగిన వరుస ఘర్షణల్లో ఇదొకటి.
ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ ముగ్గురు పౌరులు మరణించారు.

ఫొటో సోర్స్, Reuters
అసలేం జరిగింది?
అక్టోబర్ 20న జరిగిన అధ్యక్ష ఎన్నికల అనంతరం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా వింటోలోని ఓ బ్రిడ్జిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల బృందం బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది.
అక్కడికి సమీపంలో ప్రస్తుత అధ్యక్షుడు ఇవో మొరేల్స్ మద్దతుదారులతో జరిగిన ఘర్షణల్లో ప్రతిపక్ష నిరసనకారుల్లో ఇద్దరిని చంపేశారనే వదంతులు వ్యాపించాయి. దీంతో వీరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మేయర్ ఆర్స్ ప్రభుత్వ మద్దతుదారులతో కలిసి తాము చేస్తున్న బ్రిడ్జి దిగ్బంధాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, తమలోని ఇద్దరు వ్యక్తుల మరణానికి ఆమే కారణమని నిరసనకారులు ఆరోపించారు. తర్వాత విచారణలో ఒక వ్యక్తి మరణించారని స్పష్టమైంది.

ఫొటో సోర్స్, Reuters
'హంతకురాలు, హంతకురాలు' అంటూ నినాదాలు చేస్తూ, ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు ఆమెను కనీసం చెప్పులు కూడా లేకుండా వీధుల్లో నుంచి ఈడ్చుకుంటూ బ్రిడ్జి దగ్గరకు తీసుకొచ్చారు. ఆమెను మోకాళ్లపై కూర్చోపెట్టి, బలవంతంగా జుట్టు కత్తిరించి, ఎర్రరంగు ఆమెపై చల్లేశారు. రాజీనామా చేయాలని కూడా బలవంతపెట్టారు.
ఆ తర్వాత ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టగా, పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమె కార్యాలయాన్ని దగ్ధం చేసి, టౌన్ హాల్ కిటికీలను ధ్వంసం చేశారు.

ఫొటో సోర్స్, EPA
నిరసనలకు కారణమేంటి?
ఎన్నికల ఓట్ల లెక్కింపు 24 గంటల పాటు నిలిపేయడంతో ఆరోజు రాత్రి నుంచి ఆందోళనలు చెలరేగాయి. ఈ నిలుపుదల ప్రతిపక్ష అభ్యర్థి కార్లోస్ మెసా వర్గంలో అనుమానాలకు కారణమైంది. 2006 నుంచి అధ్యక్షుడిగా ఉన్న మోరేల్స్‌కు అనుకూలంగా ఫలితాలను తారుమారు చేస్తున్నారని వారికి సందేహాలు రేకెత్తాయి.
తుది ఫలితాల్లో మోరేల్స్ అవసరమైన మెజారిటీ కన్నా కేవలం 10శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని వెల్లడైంది.
ఈ ఎన్నికలపై ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సందేహాలు వ్యక్తం చేయగా, దీనిపై ఆడిట్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల వెల్లడిలో తాను లేదా తన పార్టీ ప్రమేయం లేదంటూ మోరేల్స్ ఈ ఆడిట్‌ను వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళనలు, నిరసనలకు కారణాలు ఇవేనా...
- తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి: బీబీసీ గ్రౌండ్‌రిపోర్ట్
- ‘ప్రసాదం అని చెప్పి సైనేడ్ ఇచ్చేవాడు’.. ఏపీలో పది హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఎలా దొరికాడంటే..
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








