చైనా: కాక్‌పిట్‌లో ప్రయాణికురాలి ఫొటో తీసిన పైలట్‌... విమానం నడపకుండా జీవితకాల నిషేధం

కాక్‌పీట్‌లో చైనా ప్రయాణికురాలు

ఫొటో సోర్స్, WEIBO/SCREENSHOT

కాక్‌పిట్‌లో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలి ఫొటో తీసిన చైనా పైలట్‌పై వేటు పడింది. అతను జీవితకాలం విమానం నడపకుండా నిషేధం విధించారు.

చైనాలోని గుయిలిన్ సిటీ నుంచి యాంగ్జౌకు వెళుతున్న ఎయిర్ గుయిలిన్ విమానంలో ఈ ఫొటో తీసినట్లు చైనా మీడియా తెలిపింది. ఈ ఘటన జనవరిలో జరిగింది.

ఈ ఫొటోలో, కాక్‌పిట్‌లో ఉన్న ఒక మహిళ తన పక్కన ఉంచిన ఆహారపదార్థాలతో పోజులివ్వడం కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో పైలట్ 'వాయు భద్రతా నిబంధనల'ను ఉల్లంఘించినట్లు ఎయిర్ గుయిలిన్ ఒక ప్రకటనలో తెలిపింది

ఎయిర్ గులియన్ విమాన సంస్థ

ఫొటో సోర్స్, Airguilin

ఫొటో క్యాప్షన్, ఎయిర్ గుయిలిన్ విమానాలు

'కెప్టెన్‌కు కృతజ్ఞతలు'

యాంగ్జౌకు వెళుతున్న ఎయిర్ గుయిలిన్ విమానంలో జనవరి 4న ఈ ఘటన జరిగిందని ది గ్లోబల్ టైమ్స్ మీడియా తెలిపింది.

చైనా సోషల్ మీడియా సైట్ Weiboలో సదరు మహిళ కాక్‌పీట్ ఫొటో స్క్రీన్‌షాట్‌లు గత ఆదివారం పోస్ట్ చేయడంతో అవికాస్త వైరల్ అయ్యాయి. ఈ ఘటన విమానయాన సంస్థ దృష్టికి కూడా వచ్చింది.

ఈ ఫొటోలో ఆ మహిళ విక్టరీ గుర్తు చూపించడం కూడా కనిపిస్తుంది. ఫొటో కింద 'కెప్టెన్‌కు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది' అని పోస్ట్ చేసింది.

ఈ మహిళ గుయిలిన్ విశ్వవిద్యాలయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా శిక్షణ పొందుతున్నట్లు పుకారు ఉంది అని చైనీస్ న్యూస్ సర్వీస్ అనే వెబ్ సైట్ పేర్కొంది.

ఈ ఫొటో విమానం టేకాఫ్ అయిన తర్వాత తీసిందా? లేదా ల్యాండింగ్‌లో తీసిందా ? అనే విషయాన్ని ఎయిర్ గుయిలిన్ పేర్కొనలేదు.

పేరు బయటకురాని ఆ పైలట్‌పై విమానం నడపకుండా జీవితకాల నిషేధం విధించారు. కానీ, అతడిని అన్ని రకాల విధుల నుంచి పూర్తిగా తొలగించారా అనేది తెలియరాలేదు.

'పైలట్ తన కాక్‌పిట్‌లోకి ఇతరులను అనుమతించి నిబంధనలను ఉల్లంఘించారు' అని ఎయిర్ గుయిలిన్ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రత్యేక అనుమతి లేకుండా ప్రయాణికులను కాక్‌పిట్‌లోకి అనుమతించకూడదు. భారత్‌తో సహా దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి నిబంధనలే ఉంటాయి.

ఈ సంఘటనలో భాగమున్న ఇతర సిబ్బందిని కూడా నిరవధికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్ గుయిలిన్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)