అమెరికా ఎన్నికలు 2020: డెమొక్రాటిక్ పార్టీ రేసు నుంచి వైదొలగిన సెనెటర్ జిలిబ్రాండ్

కిర్స్టెన్ జిలిబ్రాండ్

ఫొటో సోర్స్, SERGIO FLORES/GETTY IMAGES

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పొందే పోటీ నుంచి ఆ పార్టీ సెనెటర్ కిర్స్టెన్ జిలిబ్రాండ్ వైదొలగారు.

పార్టీ నామినేషన్ కోసం పోటీపడుతున్న అభ్యర్థుల మధ్య మూడో విడత చర్చకు అర్హత సాధించలేకపోవటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

''అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థిత్వం కోసం అద్భుతంగా సాగిన ఎనిమిది నెలల ప్రయాణం తర్వాత నేను నా ప్రచారాన్ని ముగిస్తున్నాను'' అని ఆన్‌లైన్‌లో వీడియో ద్వారా ప్రకటించారు.

మహిళల హక్కుల కోసం గళమెత్తే డెమొక్రాటిక్ సెనెటర్‌ కిర్స్టెన్ జిలిబ్రాండ్ (52) ఇటీవలి కాలంలో అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన #MeToo ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. కాలేజీ క్యాంపస్‌లలోను, సైన్యంలోను లైంగిక బాధితుల తరఫున గళమిప్పారు.

''ఇది మనం కోరుకున్న ఫలితం కాదని నాకు తెలుసు. ఈ పోటీలో గెలవాలని మనం కోరుకున్నాం. కానీ, ఇది మన సమయం కాదని తెలుసుకోవటం, మన సమాజానికి దేశానికి ఉత్తమ సేవలు ఎలా అందించటమో తెలుసుకోవటం ముఖ్యం'' అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో అమెరికా విదేశాంగ మంత్రి పదవి చేపట్టటానికి హిల్లరీ క్లింటన్ అంగీకరించినపుడు 2009లో కిర్స్టెన్ జిలిబ్రాండ్ అమెరికా సెనేట్‌కు ఎంపికయ్యారు.

అప్పటి నుంచీ చాలా సులభంగా మళ్లీ ఎన్నికవుతూ వచ్చారు. న్యూయార్క్‌లో ప్రజాదరణ కలిగిన నాయకురాలిగా కొనసాగుతున్నారు.

అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న నేతలందరిలోకీ ఆమె ఆర్థిక వనరులు అత్యధికంగా ఉన్న నాయకురాలు. గత ఏడాది మళ్లీ సెనెటర్‌గా ఎన్నికైన కిర్స్టెన్‌కు దాదాపు కోటి డాలర్ల ప్రచార నిధులు సమకూరాయి.

డెమొక్రాటిక్ పార్టీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీలో న్యూయార్క్ సెనెటర్ కిర్స్టెన్ ప్రచారం అగ్గిరాజేయనప్పటికీ.. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడగల నాయకురాలిగా ఆమెను చాలా కాలం నుంచే పరిగణించారని బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి ఆంథొనీ జుర్చర్ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

''కరిష్మాగల యువ నాయకురాలైన కిర్స్టెన్.. #MeToo ఉద్యమ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఆమె పతనానికి అదే కారణమై ఉండొచ్చు'' అని ఆయన విశ్లేషించారు.

బిల్ క్లింటన్ హయాంలో ఓవల్ ఆఫీస్ సెక్స్ స్కాండల్ వెలుగుచూసినపుడు ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని కిర్స్టెన్ పేర్కొన్నారు. ''ఇది క్లింటన్ అనుయాయులను ఆమెకు దూరం చేసింది'' అని ఆంథోని పేర్కొన్నారు.

అలాగే, మినెసొటా సెనెటర్ అల్ ఫ్రాంకెన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చినపుడు ఆయన రాజీనామా చేయాలంటూ కర్ట్సెన్ ముందుగానే డిమాండ్ చేయటం.. వామపక్షంలో చాలా ఇష్టుడైన రాజకీయ నాయకుడిని దగా చేసినట్లు కొందరు భావించారు.

కిర్ట్సెన్ వైదొలగటంతో, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో 20 మంది కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వైదొలగే అవకాశముంది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ పోటీచేయనున్న ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా తలపడటానికి జో బిడెన్, ఎలిజబెత్ వారెన్, బెర్నీ సాండర్స్, కమలా హారిస్, తులసి గబార్డ్ వంటి వారు పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)