విజయ్ మాల్యా: భారత్‌కు రావడానికి అభ్యంతరం, యూకే హైకోర్టులో మళ్లీ విచారణ

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావీద్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా పేర్కొన్న 5 అభ్యంతరాల్లో ఒక దానిపై విచారణకు రోయల్ కోర్టు అంగీకరించింది. దీంతో ఈ కేసుపై యూకే హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరగనుంది.

యూకే హోం సెక్రటరీ సాజిద్ జావీద్ జారీ చేసిన అప్పగింత ఉత్తర్వులపై భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, రోయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ఎదుట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. భారత్‌కు అప్పగింతకు వ్యతిరేకంగా ఆయన రాతపూర్వకంగా చేసిన అప్పీలును ఏప్రిల్‌లో తిరస్కరించడంతో మంగళవారం మౌఖిక అప్పీలుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

దాదాపు 9,000 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రోయల్ కోర్టులోని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్‌ విభాగానికి చెందిన ద్విసభ్య బెంచ్ ముందు మాల్యా మౌఖిక అప్పీలును న్యాయమూర్తులు విన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30కు జస్టిస్ లెగాట్, జస్టిస్ పాపుల్‌వెల్‌.. మాల్యా విజ్ఞప్తులను విన్నారు.

సాధారణంగా ఇలాంటి కేసులకు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. కానీ, ఇదో అసాధారణ కేసుగా భావించి దాదాపు నాలుగు గంటల సమయం కేటాయించారు.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం మాల్యా కేసుకు సంబంధించిన ఆధారాలను సరైనరీతిలో సమర్పించలేదని మాల్యా తరపు న్యాయవాది క్లార్ మాంట్‌గోమెరీ వాదించారు.

మాల్యాను భారత్‌కు అప్పగింతపై ఉత్తర్వులు ఇవ్వాలంటూ హోం సెక్రటరీ సాజిద్ జావీద్‌ను వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఆదేశించడాన్ని తప్పుబడుతూ దీనిపై జోక్యం చేసుకోవాలని క్లార్ కోరారు.

"భారత ప్రభుత్వం అవసరమైన పత్రాలను ఆలస్యంగా అందించింది. కానీ, అప్పటికే మేజిస్ట్రేట్ తన నిర్ణయం వెల్లడించారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారత ప్రభుత్వం ఓ కేసుతో విచారణను ప్రారంభించి మరో కేసులో విచారణ కోరుతోంది. ఓ వ్యక్తిని ఓ నేరంపైన అప్పగించాలని కోరుతూ మరో నేరంపై విచారణ జరుపుతామని చెప్పడం సాధ్యం కాదు" అని క్లార్ వాదించారు.

సీబీఐ అధికారి అస్థానా సాక్షులను బెదిరిస్తున్నారని, మాల్యాకు వ్యతిరేకంగా వ్యవహరించకపోతే వారికి వ్యతిరేకంగా తాము వ్యవహరించాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారని క్లార్ హైకోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతోనే ఈ విచారణ జరుగుతోందని అన్నారు.

దీనిపై స్పందించిన ఓ జడ్జి... భారత్‌కు అప్పగించాలనే విజ్ఞప్తి అప్రస్తుతం, కానీ నేరాలు మాత్రం కాదు అని వ్యాఖ్యానించారు.

విజయ్ మాల్యా

ఫొటో సోర్స్, Getty Images

యూకే, భారత ప్రభుత్వాల తరపు నుంచి ఎవరూ విచారణకు హాజరుకాలేదు. కేవలం భారత హైకమిషన్ నుంచి కొందరు అధికారులు మాత్రం కోర్టుకు వచ్చారు.

రాజకీయ ఒత్తిడులు ప్రభావం చూపే అవకాశముందని, నిష్పక్షపాత విచారణను ఇవి ప్రభావితం చేస్తాయని విచారణ సందర్భంగా మాల్యా వ్యాఖ్యానించారు.

"భారత ఆర్థిక వ్యవస్థలో లోపాలపై ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు నన్ను భారత్‌కు తీసుకెళ్లడమనే అంశాన్ని ఉపయోగించుకోవాలని అక్కడి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నన్ను భారత్‌కు పంపిస్తే, ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లోని 12వ నంబర్ బారక్‌లో ఉంచుతారు. ఆరుగురు ఉండాల్సిన సెల్‌లో ఏడెనిమిది మంది ఉంటారని ఆ జైలును చూసి వచ్చిన భారతీయ లాయర్ ఒకరు చెప్పారు. ఆ గది వేసవికాలంలో భరించలేనంత వేడిగా ఉంటుంది. చదువుకోవడానికి తగినంత వెలుతురు కూడా ఉండదు. దగ్గరలోని మురికివాడల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, శబ్దాలు భరించలేము. ఎలుకలు, ఇతర కీటకాలు కూడా ఆ జైలు గదుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి" అని మాల్యా కోర్టుకు తెలిపారు.

మాల్యా తన కుమారుడు సిద్ధార్ధ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఎయిర్ హోస్టెస్ పింకీ లాల్వానీలతో కలసి కోర్టుకు వచ్చారు. 2016 నుంచి మాల్యా యూకేలోనే ఉంటున్నారు.

వాదనలు విన్న రోయల్ కోర్టు అప్పగింత ఉత్తర్వులపై వ్యక్తం చేసిన 5 అభ్యంతరాల్లో ఒకదానిపై విచారణకు అంగీకరించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)