వెనెజ్వేలా సంక్షోభం: కారకస్ ఘర్షణల్లో మహిళ మృతి... అనేకమందికి గాయాలు

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వేలా రాజధాని కారకస్ నగరంలో అధికార, ప్రతిపక్ష మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలు, కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.
నిరసనకారులను అదుపు చేసేందుకు, చెదరగొట్టేందుకు మిలిటరీ బాష్పవాయువు, వాటర్ కేనన్లు ప్రయోగించింది.
27 ఏళ్ల మహిళ మరణానికి కారకులెవరో గుర్తించాలని ప్రతిపక్ష నేత జువాన్ గ్వాయిడో డిమాండ్ చేశారు. అధ్యక్షుడు మడూరో పదవి నుంచి తప్పుకునేవరకూ నిరసనలు చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
తమ విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొనాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు.
జనవరిలో తనకు తానుగా వెనెజ్వేలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గ్వాయిడోను యూఎస్, యూకేలతో పాటు దాదాపు 50 దేశాలు అధ్యక్షుడిగా గుర్తించాయి.
కానీ రష్యా, చైనాలతో పాటు వెనెజ్వేలా మిలిటరీ మద్దతు ఉన్న మడూరో అధ్యక్ష పీఠం నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. దేశాన్ని వదిలి వెళ్లిపోవాలనే సూచనలను ఆయన తిరస్కరించడంతోపాటు ఇదంతా అమెరికా కుట్రలో భాగంగా జరుగుతోందని ఆరోపించారు. దీనికి బాధ్యులైనవారందరినీ శిక్షిస్తామని తెలిపారు.
హింస ఎలా మొదలైంది?
బుధవారం ప్రభుత్వ అనుకూల, వ్యతిరేకులంతా కారకస్ నగర వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. మొదట్లో ఇవి శాంతియుతంగానే జరిగాయి.
ప్రతిపక్షానికి గట్టి పట్టున్న అల్తామిరాలో ఓ ర్యాలీలో 27 ఏళ్ల మహిళ కాల్పుల్లో మరణించారని వెనెజ్వేలన్ అబ్జర్వేటరీ ఆఫ్ సోషల్ కాన్‌ఫ్లిక్ట్ అనే ఓ స్థానిక ఎన్జీఓ వెల్లడించింది.
ప్రతిపక్ష మద్దతుదారులు, భద్రతా దళామ మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 46 మంది గాయపడ్డారు.
మిలిటరీ దుస్తులు ధరించిన కొందరు తన చుట్టూ ఉండగా చిత్రించిన ఓ వీడియోను అంతకు ముందు గ్వాయిడో పోస్ట్ చేశారు. "ధైర్యవంతులైన సైనికుల మద్దతు నాకు ఉంది" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
గృహనిర్భంధంలో ఉన్న మరో ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌కు మద్దతుగా వెనెజ్వేలా ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలపాలని ఆయన కోరారు. 2014లో నిర్వహించిన నిరసనలు హింసకు దారితీయడానికి కారణమని నిరూపణ కావడంతో అప్పటి నుంచి లోపెజ్ గృహనిర్బంధంలో ఉన్నారు.
అధికార, ప్రతిపక్ష మద్దతుదారులు మంగళవారం నుంచి కారకస్ వీధుల్లో చేరి నిరసనలు నిర్వహించారు. దీంతో కొన్ని చోట్ల గ్వాయిడో మద్దతుదారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.

ఫొటో సోర్స్, AFP/Getty Images
బంద్‌కు గ్వాయిడో ఇచ్చిన పిలుపు ఎంతవరకు ప్రభావం చూపుతుంది?
"ఆపరేషన్ లిబర్టీలో చివరి దశ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేతులు కలపాల్సి ఉంది" అని గ్వాయిడో ట్వీట్ చేశారు.
మడూరో గద్దె దిగేవరకూ వీధుల్లోనే ప్రదర్శనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అయితే ప్రభుత్వోద్యోగుల నుంచి గ్వాయిడోకు మద్దతు లభించడం కష్టమే అని బీబీసీ అమెరికా ఎడిటర్ క్యాండేస్ పియెట్ అన్నారు.
ప్రభుత్వ ర్యాలీల్లో పాల్గొనకపోతే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులకు చెబుతూనే ఉన్నారు. ఒకవేళ వీరి మద్దతు గనక గ్వాయిడో సంపాదించగలిగితే, మడూరోపై ఇదో పెద్ద విజయమే అవుతుంది అని పియెట్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తత
ఈ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా సైనిక చర్యకు దిగవచ్చని అమెరికా మంత్రి మైక్ పాంపేయో అన్నారు. మడూరోకు మద్దతు పలుకుతూ రష్యా, క్యూబాలు దేశంలో అస్థిరతను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తమ మద్దతు గ్వాయిడోకేనని మరోసారి స్పష్టం చేశారు.
హింసను విడనాడాలని ఇరువర్గాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ విజ్ఞప్తి చేశారు.
ప్రాణ నష్టం జరగకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని ఈయూ కోరింది.
గ్వాయిడో చర్యలను మడూరోకు మద్దతు పలుకుతున్న బొలీవియా, క్యూబాలు ఖండించాయి. వెనెజ్వేలాలో తిరుగుబాటుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.
హింస ఇంకా పెరిగే ప్రమాదముందని మెక్సికో ఆందోళన వ్యక్తం చేసింది.
లాటిన్ అమెరికా దేశాలకు చెందిన లిమా గ్రూప్ అత్యవసర సమావేశం శుక్రవారం జరగనుంది.
ఇవి కూడా చదవండి.
- వెనెజ్వేలాలో అధికార సంక్షోభానికి కారణాలివే
- వెనెజ్వేలా సంక్షోభంపై రెండుగా చీలిన దేశాలు.. ఇది ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తుందా?
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం: మంచిదేనా? ప్రజలు ఏమనుకొంటున్నారు?
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూతో పిల్లలకు క్యాన్సర్ వస్తుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










