జలియన్‌వాలా బాగ్ మారణహోమం: ‘క్షమాపణ" నిరర్థకమన్న అలనాటి బాధితుడి వారసుడు

- రచయిత, రాజ్ కౌర్ బిఖూ
- హోదా, బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్
జలియన్‌వాలా బాగ్' నరమేధానికి 2019 ఏప్రిల్ 13తో వందేళ్ళు. ఆ మారణకాండకు బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు క్షమాపణ చెప్పడం "నిరర్థకం" అని అన్నారు డాక్టర్ రాజ్ సింగ్ కోహ్లీ. జలియన్‌వాలా బాగ్ నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తికి ఆయన వారసుడు.
వందేళ్ళ నాటి ఈ దుర్ఘటనలో వందలాది మంది భారతీయులు చనిపోయారు. ఆ మారణకాండకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.
ఈ సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే, "బ్రిటిష్ ఇండియా చరిత్రలో అదొక సిగ్గుపడాల్సిన మచ్చ" అని వ్యాఖ్యానించారు. క్షమాపణ మాత్రం కోరకుండా ఆమె ఆ మాటతో సరిపెట్టారు.
ఆమె స్పందనను ఆమోదించిన రాజ్ సింగ్, "ఇన్నేళ్ళు గడిచాక ఇక "క్షమాపణలు" అడగడం కూడా అనవసరం" అని అన్నారు. ఆయన ఇద్దరు తాతలు 1919 నాటి దుర్ఘటనలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
"బ్రిటిష్ సిక్కుగా ఉన్నందుకు వలసవాద పాలనకు సంబంధించిన అపరాధ భావన వెంటాడుతూనే ఉంటుంది. ఈ మాట విచిత్రంగా ధ్వనిస్తుందని నాకు తెలుసు. కానీ, ఒక బ్రిటిష్ పౌరుడిగా ఉండడానికి సంబంధించిన నా మనోభావాలు ఒకప్పుడు బ్రిటన్ ఏలా ఉంది, అది నేర్చుకున్న పాఠాలేంటి, అది ఇప్పుడెలా ఉందనే అంశాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి" అని డాక్టర్ రాజ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, KOHLI FAMILY
వార్‌విక్‌షైర్‌లోని రగ్బీ ప్రాంతానికి చెందిన రాజ్ సింగ్ బీబీసీ ఏసియా నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ, ''ఇప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజానికి అది అర్థరహితం కూడా" అని అన్నారు.
వందేళ్ల క్రితం అమృత్‌సర్‌లోని 'జలియన్‌వాలా బాగ్' అనే పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో వందలమంది చనిపోయారు.
ఆ మారణకాండలో రాజ్ సింగ్ తాత బల్వంత్ సింగ్ కొన్ని గంటల పాటు మృతదేహాల కింద చిక్కుకుపోయారు.
''కాల్పులు మొదలవగానే మా ఇద్దరు తాతయ్యలు ఎలాగోలా తప్పించుకోగలిగారు. గోడ ఎక్కి తప్పించుకున్నారా లేక మరే ఇతర మార్గం నుంచైనా తప్పించుకున్నారా అన్నది నాకు తెలియదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, KOHLI FAMILY
ఈ ఘటన తర్వాత రాజ్ సింగ్ పూర్వీకులు భారత్ వదిలి వెళ్లారు.
''మా ముత్తాత బర్మా మిలిటరీ పోలీస్ శాఖలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసేవారు. తన ఇద్దరు కుమారులను వేరే దేశానికి పంపించడం మంచిదని ఆయనకు కొందరు సూచించారు. దాంతో, ఆయన తన కొడుకులకు భారత్ నుంచి బయటకు పంపించారు'' అని రాజ్ సింగ్ చెప్పారు.
ఇంగ్లండ్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా మరికొందరు ఉన్నతాధికారులు వారు నివసిస్తున్న నగరానికి వచ్చినప్పుడు, జరిగిన దుర్ఘటనకు తామెంతో విచారిస్తున్నామని చెప్పారు.
కానీ, ఆ మాటలు రాజ్ సింగ్ తల్లి 78 ఏళ్ళ జగ్జీత్ కౌర్‌కు ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. ఈ విషయంలో ఆమె తన కుమారుడి అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తున్నారు.
"బ్రిటిష్ ప్రభుత్వం ఈ తప్పిదాన్ని గుర్తించాలి. ఆ తప్పు తాము నియమించిన వారి వల్లే జరిగిందని ఒప్పుకోవాలి. ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు" అని ఆమె అన్నారు.
"మా నానమ్మ ఆ రోజు నుంచీ తన జీవితమంతా ఏడుస్తూనే ఉంది. ఆ తరువాత ఆమె తన ఇద్దరు కొడుకుల్ని చూడనే లేదు" అని జగ్జీత్ కౌర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- తెలుగునాట కుల రాజకీయాలు: ఆ రెండు కులాల మధ్యే ప్రధాన పోటీ
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- జూలియన్ అసాంజ్: సాహస పోరాటమా.. ప్రచార ఆర్భాటమా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో పైచేయి ఎవరిది?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఈవీఎంలో ఉన్న మీ ఓటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే వరకు ఏం జరుగుతుంది?
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








