'అమెజాన్ బాస్ ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసింది...'

ఫొటో సోర్స్, Reuters
అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసి డేటా తస్కరించినట్లు గావిన్ డి బెకర్ అనే పరిశోధకుడు వెల్లడించారు.
నేషనల్ ఎంక్వైరర్ టాబ్లాయిడ్‌కు తన ప్రైవేట్ మెసేజ్‌లు ఎలా లీక్ అయ్యాయో ఆరా తీసేందుకు గావిన్ డి బెకర్‌ను బెజోస్ నియమించుకున్నారు.
ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్ట్ ఖషోగ్జీ హత్యకు సంబంధించి బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక రాసిన వార్తలకు ఈ హ్యాకింగ్‌కు సంబంధం ఉందని బెకర్ అంటున్నారు.
ఈ ఆరోపణల మీద సౌదీ అరేబియా ఇంకా స్పందించలేదు.
ఈ పరిశోధనలో తాను సేకరించిన వివరాలను అమెరికా ఫెడరల్ అధికారులకు సమర్పించానని బెకర్ చెప్పారు.
"బెజోస్ ఫోన్‌ను సౌదీలు యాక్సెస్ చేశారని, వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించారని మా పరిశోధకులు, మరికొందరు నిపుణులు ధ్రువీకరించారు" అని బెకర్ డెయిలీ బీస్ట్ వెబ్‌సైట్‌లో రాశారు.
నేషనల్ ఎంక్వైరర్ మాతృ సంస్థ అయిన అమెరికన్ మీడియా ఇన్‌కార్పొరేటెడ్ (ఎఎంఐ) తనను బ్లాక్ మెయిల్ చేసిందని బెజోస్ గత ఫిబ్రవరిలో ఆరోపించారు. తమ టాబ్లాయిడ్‌లో వచ్చిన వార్తల వెనుక రాజకీయ ఒత్తిళ్ళేమీ లేవని అంగీకరించని పక్షంలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను ప్రచురిస్తామని ఆ పత్రిక బెదరించిందని బెజోస్ చెప్పారు. ఆ తరువాత ఆయన ఈ విషయంలో పరిశోధన చేసేందుకు బెకర్‌ను నియమించుకున్నారు.


అమెజాన్ అధినేతకు అక్రమ సంబంధం ఉందని నేషనల్ ఎంక్వైరర్ ఒక కథనాన్ని ఫోటోలు, మెసేజ్‌లతో పాటు ప్రచురించింది.
ఈ వార్తల సేకరణలో ఎఎంఐ ఏ రకమైన హ్యాకింగ్ పాల్పడినట్లు మా పరిశోధనలో వెల్లడి కాలేదని చెప్పాలని కూడా ఆ సంస్థ డిమాండ్ చేసిందని బెకర్ అన్నారు.
ఖషోగ్జీ రాతలను ప్రచురిస్తున్నందుకు సౌదీ ప్రభుత్వం వాషింగ్టన్ పోస్ట్‌ను టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు.
"ఖషోగ్జీ హత్యకు సంబంధించి వాషింగ్టన్ పోస్ట్ వరస కథనాలను ప్రచురించడం ప్రారంభించిన అక్టోబర్ నెల నుంచే సౌదీ ప్రభుత్వం జెఫ్ బెజోస్‌కు హాని తలపెట్టిందని తెలిస్తే అమెరికన్లు కొందరు ఆశ్చర్యానికి గురవుతారు" అని బెకర్ చెప్పారు.
"మహమ్మద్ బిన్ సల్మాన్‌కు వాషింగ్టన్ పోస్ట్ ప్రధాన శత్రువన్నది స్పష్టమైపోయింది" అని ఆయన అన్నారు.
ఖషోగ్జీ హత్య సౌదీ ప్రిన్స్ మహమ్మద్ ఆమోదంతోనే జరిగి ఉంటుందని అమెరికా అధికారులు గతంలోనే చెప్పారు. కానీ, సౌదీ ఆరేబియా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.
బెకర్ ఆరోపణల మీద వ్యాఖ్యానించాలని వాషింగ్టన్‌లోని సౌదీ ఎంబసీని కోరితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
బెజోస్ అఫెయిర్ గురించి నేషనల్ ఎంక్వైరర్ రాసిన రాతలకు "తమకు ఎలాంటి సంబంధం లేదు" అని సౌదీ విదేశాంగ మంత్రి గత ఫిబ్రవరిలో ప్రకటించారు.
బెకర్ ఆరోపణల మీద ఎఎంఐ ఇంతవరకూ స్పందించలేదు. బెజోస్ వ్యక్తిగత జీవితం గురించి చట్టబద్ధంగానే వార్తలు రాసినట్లు ఈ సంస్థ గతంలో ఒక ప్రకటన చేసింది.
ఇవి కూడా చదవండి:
- జుకర్‌బర్గ్: 'ఇంటర్నెట్లో కంటెంట్‌ను ప్రభుత్వాలు నియంత్రించాలి'
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- మొబైల్ డేటా రేట్లు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యంత తక్కువ
- ఇస్రో ఏర్పాటులో నెహ్రూ పాత్ర ఏమీ లేదనే ప్రచారం నిజమేనా...
- యాపిల్ అసాధారణ నిర్ణయం..
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








