'ఫేస్‌బుక్' జుకర్‌బర్గ్: 'ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను ప్రభుత్వాలు నియంత్రించాలి'

ఫొటో సోర్స్, AFP
ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను నియంత్రించడంలో ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) మార్క్ జుకర్‌బర్గ్ కోరారు.
ఇంటర్నెట్‌లో హానికర కంటెంట్‌ను సంబంధిత కంపెనీలు మాత్రమే పర్యవేక్షించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రికకు రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు.
హానికర కంటెంట్, ఎన్నికల ప్రతిష్ఠ, గోప్యత, డేటా పోర్టబిలిటీ - ఈ నాలుగు అంశాల్లో కొత్త చట్టాలను తీసుకురావాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
''భావ ప్రకటన విషయంలో మాకు చాలా శక్తి ఉందని శాసనకర్తలు నాతో తరచూ అంటుంటారు. అది నిజమే'' అని ఆయన చెప్పారు.
ఫేస్‌బుక్ ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తోందని జుకర్‌బర్గ్ వెల్లడించారు. ''మేం ఏదైనా పోస్టును తొలగించినా, లేదా పోస్టుపై మరేదైనా నిర్ణయం తీసుకున్నా, మా నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఈ సంస్థ వేదికగా నిలుస్తుంది'' అని వివరించారు.
టెక్ కంపెనీలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అన్ని వెబ్‌సైట్లకు ఈ నిబంధనలు వర్తించాలని, అప్పుడు హానికర సమాచారం వివిధ ప్లాట్‌ఫాంలపై వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడం తేలికవుతుందని ఆయన తెలిపారు.

జుకర్‌బర్గ్ ప్రతిపాదిస్తున్న నిబంధనలు ఇవీ...
- హానికర కంటెంట్ వ్యాప్తిని నియంత్రించడానికి అన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్లకు ఒకే నిబంధనలు పెట్టాలి. ఇవి ఈ నిబంధనలను పాటించేలా థర్డ్ పార్టీ సంస్థలు చర్యలు చేపట్టాలి.
- అన్ని ప్రధాన టెక్ కంపెనీలు మూడు నెలలకోసారి పారదర్శకతను చాటుతూ నివేదికలు విడుదల చేయాలి.
- ఎన్నికల ప్రతిష్ఠను కాపాడేలా ప్రపంచవ్యాప్తంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. రాజకీయ కార్యకలాపాలు సాగించేవారిని గుర్తించేందుకు అన్ని వెబ్‌సైట్లకు ఉమ్మడి ప్రమాణాలను నిర్దేశించాలి.
- అభ్యర్థులకు, ఎన్నికలకు మాత్రమే కాకుండా సమాజాన్ని విభజించే రాజకీయ అంశాలకు నిబంధనలను వర్తింపజేసేలా చట్టాలు ఉండాలి. అధికారిక ప్రచార కాలంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ అమలయ్యే చట్టాలు అవసరం.
- ఆన్‌లైన్‌లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయ పార్టీలు డేటాను వినియోగించుకొనే తీరును నియంత్రించేందుకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించాలి.
- గోప్యతకు సంబంధించి యూరోపియన్ యూనియన్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)' తరహా చట్టాలను ఎక్కువ దేశాలు తీసుకురావాలి.
- దేశానికీ దేశానికీ మధ్య ఎక్కువ అంతరం లేకుండా ఇలాంటి చట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉండాలి.
- ఒక సర్వీసు నుంచి మరో సర్వీసుకు యూజర్లు మారినప్పుడు వారి డేటా పరిరక్షణ బాధ్యత ఎవరిదనేదానిపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.

ద వాషింగ్టన్ పోస్ట్‌లో జుకర్‌బర్గ్ రాసిన వ్యాసం ఒక బహిరంగ లేఖ. ఇది కొన్ని యూరోపియన్ పత్రికల్లో కూడా వెలువడనుంది.
మార్చి 15న న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో ఒక దుండగుడు మసీదుపై తన దాడిని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం చర్చనీయమైంది. ఈ వీడియో ఫుటేజీ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో ఫేస్‌బుక్ విఫలమైందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
ఈ వీడియో 15 లక్షల సార్లు కాపీ అయ్యింది. క్రైస్ట్‌చర్చ్ నగరంలో రెండు మసీదులపై జరిగిన నాటి కాల్పుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ దాడుల నేపథ్యంలో, ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్)పై కొన్ని పరిమితులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇంతకుముందు ప్రకటించింది.
శ్వేతజాతీయుల జాతీయవాదం, వేర్పాటువాదంపై నిషేధం
శ్వేతజాతీయుల జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని తమ వెబ్‌సైట్‌పై నిషేధిస్తామని ఎఫ్‌బీ గురువారం స్పష్టం చేసింది.
యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో తమ వెబ్‌సైట్‌పై రాజకీయ ప్రకటనల విషయంలో పారదర్శకతను చాటుకొనేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. ప్రకటనను ఎవరు ఇచ్చారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఇది ఎవరిని ఉద్దేశించినది అనే వివరాలను శుక్రవారం నుంచి వెల్లడిస్తోంది.
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో డేటా దుర్వినియోగానికి సంబంధించిన కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో ఫేస్‌బుక్ పాత్రపై విమర్శలు ఉన్నాయి.
హానికర కంటెంట్, ఇతర సమస్యలకు పరిష్కారాలను గుర్తించడంలో తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఫేస్‌బుక్‌పై ఉందని, ఈ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా శాసనకర్తలతో చర్చిస్తానని జుకర్‌బర్గ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యాపిల్ అసాధారణ నిర్ణయం..
- ఫేస్‌బుక్: ప్రైవసీకి ప్రాధాన్యమిచ్చే వేదికగా మార్చేస్తామంటున్న మార్క్ జుకర్‌బర్గ్
- మొబైల్ డేటా రేట్లు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యంత తక్కువ
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్ర లీడర్
- రాహుల్ గాంధీ: వాయనాడ్నే దక్షిణాది నుంచి ఎందుకు ఎంచుకున్నారు?
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- మనం నిర్ణయించిన ముహుర్తానికి బిడ్డను పుట్టించి ఆ బిడ్డ జాతకాన్ని మార్చగలమా?
- ఇస్రో ఏర్పాటులో నెహ్రూ పాత్ర ఏమీ లేదనే ప్రచారం నిజమేనా...
- ప్రపంచాన్ని మార్చేయగల ఆవిష్కరణలు: మడతపెట్టగలిగే ఫోన్.. కర్టెన్లా చుట్టేయగలిగే టీవీ
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
- ఉత్తర భారతదేశ మహిళలను రాహుల్‌గాంధీ అవమానించారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









