బీబీసీ జర్నలిస్టు అహ్మద్ షా హత్య కేసులో ఒకరికి మరణ దండన, ఇద్దరికి జైలు శిక్ష

అహ్మద్ షా, అఫ్ఘానిస్తాన్

అఫ్గానిస్తాన్‌లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ బీబీసీ జర్నలిస్టు అహ్మద్ షా హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు శిక్ష విధించింది. అహ్మద్ షా బీబీసీ పష్తోలో పని చేసేవారు. గత ఏడాది ఏప్రిల్‌లో గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ కేసును విచారిస్తున్న యాంటీ టెర్రరిస్టు ట్రిబ్యునల్ ఈ తీర్పును వెలువరించింది.

అఫ్ఘానిస్తాన్ అటార్నీ జనరల్ కార్యాలయ ప్రతినిధి ఈ విషయాన్ని బీబీసీకి వెల్లడించారు.

దోషుల్లో ఒకరికి మరణశిక్ష విధించగా, మరొకరికి 30 ఏళ్ల జైలుశిక్ష, ఇంకొకరికి ఆరేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ శిక్షపై పై కోర్టుకు వెళ్లే అవకాశముంది.

అయితే అహ్మద్ షాను చంపిన వారి వివరాలను కానీ, వారు షాను ఎందుకు చంపారన్న వివరాలను కానీ వెల్లడించలేదు.

అఫ్ఘానిస్తాన్‌ అటార్నీ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, దోషులు ముగ్గురూ ప్రస్తుతం పర్వాన్ జైలులో ఉన్నారు.

అహ్మద్ షా 2017లో బీబీసీ పష్తో సర్వీసులో చేరారు. ఆయన బీబీసీ టీవీ, రేడియో, ఆన్‌లైన్ సర్వీలసు కోసం ఖోస్త్, పతికా, పక్తితా ప్రాంతాలలో పని చేసేవారు.

అహ్మద్ షా, అఫ్ఘానిస్తాన్

బీబీసీలో చేరడానికి ముందు షా బీబీసీ కోసం ఫ్రీ లాన్సర్‌గా పని చేసారు. ఆయన స్వగ్రామం ఖోస్త్‌కు దగ్గరలోనే ఉండేది. తన గ్రామానికి వెళ్లినపుడు బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు.

హత్యకు ముందు తన కుమారునికి ఎలాంటి బెదిరింపులూ రాలేదని, అతనికి ఎవరితోనూ విరోధం లేదని ఆయన తండ్రి తెలిపారు.

అహ్మద్ షా హత్యతో తమకెలాంటి సంబంధమూ లేదని తాలిబన్లు కూడా ప్రకటించారు.

1990 నుంచి అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటివరకు ఐదుగురు బీబీసీ ఉద్యోగులు హత్యకు గురయ్యారు.

వారి వివరాలు:

మిర్వాయిజ్ జలీల్: 25 ఏళ్ల మిర్వాయిజ్‌ను 1994లో నలుగురు గన్‌మెన్లు దాడి చేసి హత్య చేశారు.

అబ్దుల్ సమద్ రౌహానీ: రౌహానీని 2008లో కాల్చి చంపారు.

అహ్మద్ ఉమేద్ ఖపుల్వక్: 2011లో నాటో బలగాలు పొరపాటున ఉమేద్‌ను కాల్చి చంపాయి.

మొహమ్మద్ నజీర్: నజీర్ బీబీసీలో డ్రైవర్‌గా పని చేసేవారు. 2017లో ఒక బాంబు పేలుడులో మరణించారు.

గత కొన్నేళ్లలో అఫ్ఘానిస్తాన్‌లో డజనుకు పైగా టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలు, రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ అఫ్గానిస్తాన్‌ను జర్నలిస్టులు పని చేయడానికి అత్యంత ప్రమాదకరమైన దేశంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)