భూగర్భంలో గంటకు 240 కి.మీ. వేగంతో ఎలక్ట్రిక్ కారు ప్రయాణం.. సొరంగం నమూనాను ఆవిష్కరించిన ఎలాన్ మస్క్

సొరంగంలో వస్తున్న ఎలక్ట్రిక్ కారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూగర్భ సొరంగంలో వస్తున్న ఎలక్ట్రిక్ కారు

కార్లు అత్యధిక వేగంతో దూసుకెళ్లేందుకు వీలుగా నిర్మించతలపెట్టిన భూగర్భ సొరంగ వ్యవస్థ నమూనాను అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ‌లాస్‌ ఏంజెలిస్ నగరంలో ఆవిష్కరించారు.

లాస్‌ ఏంజెలిస్‌లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా ఆయన ఈ వినూత్న ప్రతిపాదనను ఈ ఏడాది ఇంతకుముందు తెర పైకి తెచ్చారు.

నమూనా భూగర్భ సొరంగం కేవలం 1.6 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిని ఎలాన్ మస్క్‌కు చెందిన బోరింగ్ కంపెనీ నిర్మించింది. దీని నిర్మాణంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ టెక్నిక్‌లను ఉపయోగించినట్లు సంస్థ చెప్పింది.

తమ ప్రణాళిక ప్రకారం మార్పులు చేసిన ఎలక్ట్రిక్ కార్లను సొరంగంలో ప్రత్యేకంగా నిర్మించిన ట్రాక్‌లపై ప్రవేశపెడతామని, ఇవి గంటకు గరిష్ఠంగా 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఎలాన్ మస్క్ తెలిపారు.

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ, వాణిజ్యపరమైన అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టే స్పేస్‌ఎక్స్ సంస్థల అధిపతిగా ఆయన పేరుగాంచారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నమూనా సొరంగం నిర్మాణానికి కోటి డాలర్ల వ్యయమైందని ఎలాన్ మస్క్ చెప్పారు

ఈ కాంక్రీట్ సొరంగంలో వెళ్లేందుకు వీలుగా మార్పులు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కారులో మంగళవారం (18.12.2018) ఎలాన్ మస్క్ స్వయంగా ప్రయాణం చేశారు. సొరంగం ఒక చివర్న ఆయన ఈ కారులోంచి బయటకు వచ్చారు.

నమూనా సొరంగం నిర్మాణానికి కోటి డాలర్ల వ్యయమైందని ఆయన చెప్పారు. ఇప్పుడున్న టెక్నాలజీతో సొరంగాన్ని నిర్మించి ఉంటే వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చయ్యేదన్నారు.

బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్ కంపెనీలు ఉండే హాతోర్న్ మున్సిపాలిటీ భూగర్భంలో ఈ సొరంగాన్ని నిర్మించారు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, SpaceX

ఫొటో క్యాప్షన్, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ, వాణిజ్యపరమైన అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టే స్పేస్‌ఎక్స్ సంస్థలకు ఎలాన్ మస్క్ అధిపతి

స్థిరత్వమే కీలకం: ఎలాన్ మస్క్

సొరంగ వ్యవస్థలోకి మార్పులు చేసిన ఎలక్ట్రిక్ కార్లను లిఫ్టుల సాయంతో ప్రవేశపెడతారు. కార్లను అందులోని ట్రాక్‌లపైకి మారుస్తారు.

''ఒక సాధారణ కారును అత్యధిక వేగంలోనూ స్థిరంగా ఉండే వాహనంగా మార్చగల సామర్థ్యమే ఈ విధానంలో కీలకం. ఇలా ఉండేందుకుగాను కదిలే చక్రాలతో పాటు స్థిరత్వాన్ని ఇచ్చే చక్రాలను వాహనానికి అమరుస్తాం. వీటి సాయంతో చిన్న సొరంగం గుండా వాహనం అత్యధిక వేగంతో వెళ్లగలదు'' అని ఎలాన్ మస్క్ వివరించారు.

సొరంగ వ్యవస్థలోని ప్రధాన మార్గాల్లో కారు గంటకు 240 కి.మీ. గరిష్ఠ వేగంతో వెళ్తుందని, వెళ్తున్న మార్గంలోంచి మరో మార్గంలోకి మారాల్చి వచ్చినప్పుడు మాత్రమే కారు వేగం తగ్గుతుందని, అప్పుడు ఆటోమేటిగ్గా ఒక సొరంగంలోంచి మరో సొరంగంలోకి కారు మారుతుందని ఆయన తెలిపారు. ''ఇదంతా భూగర్భంలో 3డీ రహదారి వ్యవస్థలాగా ఉంటుంది'' అని చెప్పారు.

సొరంగ వ్యవస్థలో ప్రయాణానికి మార్పులు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కారును వాడారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సొరంగ వ్యవస్థలో ప్రయాణానికి మార్పులు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కారును వాడారు

నమూనా సొరంగాన్ని ఎలాన్ మస్క్ ఆవిష్కరించాక ఈ వ్యవస్థలో బీబీసీ ప్రతినిధి పీటర్ బోవెస్ రెండు నిమిషాలపాటు మార్పులు చేసిన మోడల్ ఎక్స్ కారులో ప్రయాణించి చూశారు. అందులో కారు 78.85 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని, గరిష్ఠంగా ఇది 240 కి.మీ. వేగంతో వెళ్తుందని బీబీసీ ప్రతినిధి తెలిపారు. ప్రయాణంలో కుదుపులు ఉన్నాయని చెప్పారు.

కుదుపులపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ- ఒక యంత్రానికి సంబంధించిన సమస్యల వల్ల ఇవి తలెత్తాయన్నారు. దీన్ని సరిచేస్తామని, అప్పుడు కారు సాఫీగా వెళ్తుందని తెలిపారు.

కారు అత్యధిక వేగంతో వెళ్లేటప్పుడు సొరంగం గోడలను తగలకుండా స్థిరంగా ఉండేందుకు కారుకు రెండు 'అలైన్‌మెంట్' చక్రాలను అమర్చారు.

సొరంగ వ్యవస్థలో వాడేందుకు పూర్తిస్థాయి స్వీయనియంత్రిత ఎలక్ట్రిక్ కారుకు 200 డాలర్ల నుంచి 300 డాలర్ల విలువైన సామగ్రిని అదనంగా బిగించాల్సి ఉంటుందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ఏర్పాటు వల్ల కారు పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదని స్పష్టం చేశారు.

టెస్లా కారు తమ కారు అని, అందుకే సొరంగ వ్యవస్థలో టెస్లా కారునే వాడామని నవ్వుతూ చెప్పారు.

'ఆయనకైనా తెలుసో, లేదో'

అమెరికాలోని ప్రముఖ పత్రిక 'ది అట్లాంటిక్'‌కు చెందిన అలానా సెమ్యూల్స్ బీబీసీతో మాట్లాడుతూ- ఈ సొరంగ వ్యవస్థలో ఎలాన్ మస్క్ చెబుతున్నంత గరిష్ఠ వేగంతో వాహనాలు ప్రయాణిచేందుకు వీలు కల్పించే టెక్నాలజీని ఆయన ఇంకా ఆవిష్కరించాల్సి ఉందన్నారు.

''ఈ సొరంగ వ్యవస్థలో ప్రయాణికులను పాడ్లలో ఉంచి రవాణా చేస్తామని ఎలాన్ మస్క్ ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు కార్లలో తరలిస్తామని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఆయనకైనా తెలుసో లేదో నాకైతే తెలియదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)