బ్రిటన్‌లోకి ఓలా క్యాబ్స్.. ఉబర్‌కు సవాల్

తలుపులు తెరిచిన ఓలా కార్లు

ఫొటో సోర్స్, OLA

భారత ట్యాక్సీ సేవల సంస్థ ఓలా బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. తద్వారా మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ సంస్థ 'ఉబర్'కు ఇది సవాలు విసురుతోంది.

మొదటి దశలో సౌత్ వేల్స్, గ్రేటర్ మాంచెస్టర్‌లో సెప్టెంబరు నుంచి సేవలు అందించేందుకు ఓలా సన్నాహాలు చేస్తోంది.

2018 చివరి నాటికి యూకే అంతటికీ సేవలను విస్తరించేందుకు స్థానిక అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నామని సంస్థ చెప్పింది.

2011లో ప్రారంభమైన ఓలా ప్రస్తుతం 110 నగరాల్లో సేవలు అందిస్తోంది. 12.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

2009లో ప్రారంభమైన ఉబర్‌ ఇప్పుడు 65 దేశాల్లోని 600 నగరాల్లో సేవలు అందిస్తోంది. ఉబర్‌ ఆధ్వర్యంలో 30 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు.

యాప్

ఫొటో సోర్స్, Reuters

ఓలా ప్రస్తుతం భారత్‌తోపాటు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవలు ప్రారంభించింది. అక్కడ ఏడు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

బ్రిటన్- ఓలా సేవలందించే మూడో దేశం కానుంది.

ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భావిశ్ అగర్వాల్ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు. తర్వాత మైక్రోసాఫ్ట్‌ సంస్థలో పనిచేశారు. ఓలాను ప్రారంభించినప్పుడు ఆయన వయసు 26 ఏళ్లే.

ఉబర్, ఓలా రెండు సంస్థల్లోనూ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా టాక్సీ సేవలు అందించే అగ్రశ్రేణి యాప్‌లలో చాలా వాటిలో సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులు ఉన్నాయి. అమెరికాలో ఉబర్‌కు ప్రధాన పోటీదారైన లిఫ్ట్‌లో మాత్రం సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి పెట్టలేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: మనకు తెలియని దారుల్లో వెళ్లాలంటే ఇప్పుడైతే జీపీఎస్ ఉంది.. అప్పట్లో ఆడియో క్యాసెట్లు కూడా వాడేవారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)