వైద్య రికార్డులు సేకరించిందంటూ ‘ఉబర్’పై అత్యాచార బాధితురాలి దావా; సెటిల్‌మెంట్‌కు వచ్చిన సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
తనపై అత్యాచారానికి సంబంధించిన వైద్య రికార్డులను 'ఉబర్' సంస్థ అధికారులు అనుచిత పద్ధతిలో సేకరించారంటూ భారతీయ మహిళ అమెరికాలో పరువు నష్టం దావా దాఖలు చేయగా, ఆమెతో అంగీకారం (సెటిల్‌మెంట్) చేసుకునేందుకు ఉబర్ సంసిద్ధత వ్యక్తంచేసింది.
2014లో భారత్‌లో ఆమె ప్రయాణం చేసిన ఉబర్ ట్యాక్సీ డ్రైవర్ శివ్ కుమార్ యాదవ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తనను శివ్ కుమార్ కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 2014 డిసెంబరులో దిల్లీకి చెందిన 26 ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యాక్సీని అతడు ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించారు.
శివ్ కుమార్‌కు 2015లో జీవిత ఖైదు శిక్ష పడింది. బాధిత మహిళ ఉబర్‌తో కోర్టు వెలుపల పరస్పర అంగీకారంతో సెటిల్‌మెంట్ చేసుకున్నారు.
అత్యాచారం జరిగిందన్న తన ఫిర్యాదును ఉబర్ అధికారులు అనుమానించారని, తన వైద్య రికార్డులను సేకరించారని, ఉబర్‌కు నష్టం కలిగించేందుకు కావాలనే తాను ఈ ఆరోపణలు చేశాననే ప్రచారం సాగించారని తర్వాత ఆమె దృష్టికి వచ్చింది. అప్పటికి ఆమె అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వచ్చారు.
ఈ అంశంపై వెలువడిన మీడియా కథనాలను ఉటంకిస్తూ ఆమె అమెరికాలో ఒక సివిల్ కేసు దాఖలు చేశారు. అనుచిత పద్ధతిలో ఉబర్ అధికారులు వైద్య రికార్డులు సేకరించారని అందులో పేర్కొన్నారు.
తన వ్యక్తిగత గోప్యతకు ఉబర్ భంగం కలిగించిందని, తనకు చెడ్డపేరు తీసుకొచ్చిందని ఆమె తెలిపారు.
బయటకు ఉబర్ అధికారులు తన పట్ల సానుభూతి ప్రకటించారని, తెర వెనుక మాత్రం తనకు వ్యతిరేకంగా ప్రచారం సాగించారని, ఉబర్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రత్యర్థి కంపెనీతో తాను కుమ్మక్కయ్యానని ఆరోపించారని ఆమె పరువు నష్టం దావాలో పేర్కొన్నారు.
వెల్లడికాని విధివిధానాలు
ఉబర్ ప్రధాన కార్యాలయం ఉండే శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో సెటిల్‌మెంట్ జరిగింది. దీని విధివిధానాలు వెల్లడికాలేదు.
కేసులు, ఇతరత్రా సమస్యలతో మసక బారిన ఉబర్ ప్రతిష్ఠను పూర్వస్థితికి తెచ్చేందుకు ఉబర్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) డారా ఖోస్రోషహీ ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ సెటిల్‌మెంట్‌కు ఉబర్ అంగీకరించింది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








