మాల్యాను భారత్‌కి అప్పగిస్తే ఏ జైల్లో పెడతారు.. వీడియో తీసి పంపించండి : లండన్ కోర్టు

విజయ్ మాల్యా

బ్రిటన్‌లో విజయ మాల్యా కేసు విచారణ సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. ఒక వేళ మాల్యాను భారత్‌కు అప్పగిస్తే, విచారణ సమయంలో ఆయన్ను ఏ జైల్లో పెడతారో, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో తెలిపేలా ఒక వీడియోను తీసి పంపాలని కేసు విచారణ సందర్భంగా అక్కడి చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.

లండన్‌లోని వెస్ట్ మిన్‌స్టర్స్ మెజిస్ట్రేట్స్ కోర్టులో జరిగిన కేసు విచారణలో భాగంగా చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయిలోని జైళ్లలో సహజ వెలుతురు ఉండదని, శుద్ధమైని గాలి కూడా లభించదని మాల్యా ఫిర్యాదు చేయడంతో అక్కడి మెజిస్ట్రేట్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

బ్యాంకులకు అప్పులు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాపై మోసం, మనీ లాండరింగ్‌లకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కానీ మాల్యా మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతున్నారు.

మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల కేసు విచారణ కోసం ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు బ్యాంకులకు దాదాపు రూ.6700 కోట్ల రుణ బకాయిలను ఎగ్గొట్టినట్లు ఆయనపైన కేసు నమోదైంది.

కింగ్ ఫిషర్ బీర్‌తో ప్రారంభమైన మాల్యా ప్రస్థానం కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది. అప్పులు పేరుకుపోవడంతో 2012 తరవాత ఆయన ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతబడింది.

2016 మార్చిలో మాల్యా యూకే వెళ్లారు. నాటి నుంచి ఆయనపైన నమోదైన అభియోగాలపై భారత్‌లో విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఆయన్ను భారత్‌కు రప్పించేందుకూ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)