ఈ వార్తలో నిజమెంత?: మహిళలకు భారత్ సురక్షితం కాదని స్క్వాష్ చాంపియన్ షిప్‌కు దూరమైన స్విస్ క్రీడాకారిణి

ఫొటో సోర్స్, @INSTAGRAM
- రచయిత, సాయిరామ్ జయరామన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్విస్ స్క్వాష్ టోర్నమెంట్‌లో అగ్ర స్థానంలో ఉన్న జూనియర్ క్రీడాకారిణి ఎంబర్ ఎలింక్స్ చెన్నైలో జరుగుతున్న వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనకపోవడంపై మీడియాలో చాలా ప్రచారం జరిగింది. భారత్ మహిళలకు సురక్షితం కాదని తన తల్లిదండ్రులు చెప్పడం వల్లే ఎంబర్ ఈ టోర్నీకి రాలేదంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి.
చెన్నైలో జరుగుతున్న 13వ వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో స్విట్జర్లాండ్ క్రీడాకారిణి ఎంబర్ ఎలింక్స్ పాల్గొనడం లేదు. జులై 18న ప్రారంభమైన ఇవి 29వ తేదీ వరకూ జరుగుతున్నాయి.
రెండ్రోజుల క్రితం కొన్ని వార్తాపత్రికల్లో, ఆన్‌లైన్ మీడియాలో ఒక వార్త వచ్చింది. "మా దేశ నంబర్ వన్ క్రీడాకారిణి ఎంబర్ ఎలింక్స్ ఈ టోర్నమెంటులో పాల్గొనాలని అనుకున్నారు. కానీ రాలేకపోయారు. భారత్ మహిళలకు సురక్షితం కాదని భావించిన వాళ్ల అమ్మ, ఎంబర్‌ను ఈ టోర్నీకి పంపకూడదని భావించారు" అని స్విట్జర్లాండ్ స్క్వాష్ టీమ్ కోచ్ పాస్కల్ భురిన్ చెప్పినట్టు ఈ వార్తల్లో రాశారు.
ఈ వార్త వైరల్ కావడంతో చెన్నైలో జరుగుతున్న టోర్నమెంట్‌లో ఉన్న స్విట్జర్లాండ్ కోచ్ పాస్కల్‌తో బీబీసీ ప్రతినిధి మాట్లాడారు. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు తను అన్నట్టు ఆయన అంగీకరించారు. కానీ, అది ఇంత పెద్ద వార్త అవుతుందని తను అనుకోలేదన్నారు.
బీబీసీ ఈ అంశంపై తమిళనాడులోని తొలి అంతర్జాతీయ ఫుట్‌బాల్ రెఫరీ రూపాదేవితో మాట్లాడింది. ఆమె "ఇది మన దేశానికి చాలా సిగ్గుచేటు. క్రికెట్ లాంటి మిగతా ఆటలతో పోలిస్తే, భారత్‌లో స్క్వాష్ అంతర్జాతీయ టోర్నమెంట్ జరగడం చాలా కష్టం. అయినా, ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి అందులో పాల్గొనడానికి నిరాకరిస్తే, దానివల్ల ప్రపంచం దృష్టి కచ్చితంగా భారత్‌పైన పడుతుంది" అన్నారు.

అసలు నిజం ఏంటి?
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనకపోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునేందుకు ఎంబర్, ఆమె తండ్రి ఇగోర్‌తో బీబీసీ మాట్లాడింది. భారతీయ మీడియాలో వచ్చిన వార్తలను వారు పూర్తిగా ఖండించారు.
"భారతీయ మీడియా, సోషల్ మీడియాలో ఎంబర్ ఎలింక్స్ గురించి వచ్చిన వార్తలు, నా కూతురి భవిష్యత్తుకు చాలా నష్టం కలిగిస్తాయి. మాకు ఆ వార్తలు చాలా ఆందోళన కలిగించాయి" అని ఎంబర్ తండ్రి ఇగోర్ అన్నారు.
"ఎంబర్ భద్రతా కారణాలతో చెన్నైలో జరిగే ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదని కొన్ని మీడియాలో వదంతులు వచ్చాయి. అది నిజం కాదు. తల్లిదండ్రులుగా రెండు కారణాలతో మేం ఆమెను అక్కడకు పంపకూడదని గత ఏడాది సెప్టెంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన చెప్పారు.
"వీటిలో మొదటి కారణం, ఎంబర్‌కు మార్చికి 16 ఏళ్లు వచ్చాయి. తనది చాలా చిన్న వయసు, ఆమె ఈ ఏడాది యూరోపియన్ అండర్-17 టీమ్‌లో ఆడింది. వచ్చే ఏడాది ప్రపంచ జూనియర్ కోసం ఆడుతోంది. గత ఏడాది సీజన్ చివర్లో తను చాలా అలిసిపోయింది. అందుకే తను శారీరకంగా మరింత అలసటకు గురికాకూడదని మేం అనుకున్నాం" అని ఇగోర్ చెప్పారు.
"ఇక రెండో విషయం ఫామిలీ ట్రిప్ వెళ్లడానికి మాకు ఇది మంచి అవకాశం అనిపించింది. ఇప్పుడు మేం ఈజిఫ్టులో ఉన్నాం. ఇది స్క్వాష్ ఆడే ఒక మంచి దేశం. ఎంబర్ మాతోపాటూ ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది". అని ఆయన తెలిపారు.
"దయచేసి వదంతులు ప్రచారం చేయకండి. భారత్‌లో మహిళల భద్రత గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఏదైనా టోర్నమెంట్, లేదా వేరే కారణంతో భవిష్యత్తులో భారత్ రాగలిగితే, మేం చాలా సంతోషిస్తాం" అన్నారు ఇగోర్.

ఫొటో సోర్స్, @INSTAGRAM
స్విస్ స్క్వాష్ స్పందన
స్విస్ స్క్వాష్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో "వివిధ మీడియాల్లో, సోషల్ మీడియాలో స్విట్జర్లాండ్ బాలికల నంబర్-1 క్రీడాకారిణి ఎంబర్ ఎలింక్స్ చెన్నై ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం లేదని తప్పుడు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు, వాటిని ఖండిస్తున్నాం" అని తెలిపింది.
ఈ వార్తలు ఎంబర్, ఆమె తల్లిదండ్రులు, స్విస్ స్క్వాష్‌కు చెడ్డపేరు తెచ్చాయి. ఆమె చాలా చిన్న వయసులో ఉందనే వాళ్లు ఆ టోర్నీకి పంపించలేదు, వారికి వ్యక్తిగత కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయానికి భారత్‌తో ఎలాంటి సంబంధం" లేదు అని తెలిపింది.
భారతీయ మీడియా వార్తలను పట్టించుకోవద్దని కూడా స్విస్ స్క్వాష్ తన ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎంబర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయద్దని కోరింది.
ఇవి కూడా చూడండి:
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
- చిన్నపిల్లలకు గ్రోత్ హార్మోన్లు.. బ్రోకర్ల దారుణాలు
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 'ఫేక్ న్యూస్' గుర్తించడం ఎలా?
- ఫేక్ న్యూస్‌ను తొలగించబోమన్న ఫేస్‌బుక్
- వాట్సాప్‌లో వదంతులను ఆపలేమా?
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









