ఇరాన్: డ్యాన్స్ చేయటానికి ఎన్నో కష్టాలు.. దాడులు, అరెస్టులు

ఫొటో సోర్స్, FERANAK AMIDI
డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రాం స్టార్‌ను అరెస్ట్ చేయటాన్ని, పాశ్చాత్త సంస్కృతిపై ఇస్లామిక్ దేశాల కఠిన నిబంధనలు చూసిన బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధి ఫెరనక్ అమిదీ, తను ఇరాన్‌లో డ్యాన్స్ చేసినపుడు ఏం జరిగిందో ఇలా చెప్పుకొచ్చారు.
1980ల్లో నేను ఇరాన్‌లోనే పెరిగాను, 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత సమయం, దేశంలోని చాలా మందికి కఠినమైన మార్పుగా అనిపించింది. అప్పట్లో వీధుల్లో మోరల్ పోలీస్ ఉండేవారు. సంగీతం, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ లాంటివే కాదు, రంగుల బట్టలు వేసుకోవడం కూడా నిషేధించారు
1980-88 ఇరాక్-ఇరాన్ యుద్ధం సమయంలో, ఆహార కొరత వచ్చింది, ఆహార పదార్థాలు అడ్డుకోవడం జరిగేది.
కానీ అలాంటి చీకటి రోజుల్లో కూడా అక్రమ వ్యాపారం చేసే మ్యూజిక్ "డీలర్ల" నుంచి తెచ్చుకున్న కాసెట్లలో సంగీతం వింటూ స్నేహితులతో డ్యాన్స్ చేయడం నాకు గుర్తుంది.
బయటి ప్రపంచం గురించి తెలుసుకోడానికి మాకు ఆ డీలర్లు కిటికీల్లా మారారు. విప్లవం తర్వాత దేశాన్ని వదిలి పెట్టి లాస్ ఏంజెల్స్ వెళ్లిపోయిన ఇరాన్ పాప్ స్టార్స్ సంగీతం క్యాసెట్లు తెచ్చిచ్చేవారు.
వాళ్లు మాకు మైకేల్ జాక్సన్ పాటలు, 'వామ్' బ్రేక్ డాన్స్ గ్రూపులు లాంటి అప్ డేట్ ట్రెండ్ పరిచయం చేసేవాళ్లు.
స్కూల్లో మాకు అవకాశం దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేసేవాళ్లం. డ్యాన్స్ చేయడంపై నిషేధం ఉన్నా, చుట్టుపక్కల టీచర్లు లేకపోతే చాలు పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేవాళ్లం.

ఫొటో సోర్స్, FERANAK AMIDI
రహస్యంగా డ్యాన్సులు
ఇరాన్ పీనల్ కోడ్‌లో డ్యాన్స్ చేయడం నేరంగా చెప్పలేదు. కానీ చట్టాలు చాలా అస్పష్టంగా ఉండేవి.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అనుచిత చర్యలను బహిరంగంగా చేయడం నేరం. అందుకే బహిరంగంగా డ్యాన్స్ చేయడాన్నికూడా అశ్లీల చర్యగా చెప్పి శిక్షలు విధించేవారు.
ఇరాన్‌లో వేదికపైన డ్యాన్స్ చేయవచ్చు. కానీ అది పురుషులకు మాత్రమే పరిమితం.
అనుచిత ఘటనను సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించడం కూడా ఇరాన్ పీనల్ కోడ్‌లో ఒక నేరం.
క్లబ్బులు, బార్లు, పార్టీలు లేకపోవడంతో ఇరాన్‌లో ఎక్కడో ఒక చోట జనం గుమిగూడడం, డ్యాన్సులు చేయడం చేసేవారు. అంటే, సాంకేతిక పరంగా అలాంటి పార్టీలు, చట్టాలను అతిక్రమించినట్టే భావిస్తారు.
విప్లవం తర్వాత వెంటనే ఇలాంటి పార్టీలు మొదలయ్యాయి. వాటిని ఎప్పుడూ, ఏ శక్తీ ఆపలేకపోయింది.
చాలా కుటుంబాల్లో విందులు, వివాహాలు జరుగుతుంటాయి. కానీ యువత కలిసి తాగడానికి, సంగీతం వింటూ, డ్యాన్స్ చేయడానికి వీలుగా అవి చాలావరకూ రకరకాల నగరాల్లో జరిగేవి.

ఫొటో సోర్స్, FERANAK AMIDI
జనం అరుస్తున్నారు
నా హైస్కూల్ పూర్తి అయిన తర్వాత, 1990ల్లో టెహ్రాన్‌లో రహస్యంగా పార్టీలు జరిగేవి. మేం సెలవులకు విదేశాలకు వెళ్లి వచ్చేటపుడు మ్యూజిక్ సీడీలు, ఆ టెక్నాలజీని అక్రమంగా తెచ్చేవాళ్లం.
వారాంతాల్లో ఎవరిదైనా బేస్‌మెంట్, లేదా విల్లాలో అందరం కలిసి సంగీతం పెట్టి డ్యాన్స్ చేసేవాళ్లం.
కానీ ఇలాంటి పార్టీలపైన ఎక్కువగా దాడులు జరుగుతుండేవి. రహస్యంగా జరిగిన పార్టీకి హాజరైనందుకు నేను, నా స్నేహితులు ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాం.
పార్టీపై దాడులు జరిగినప్పుడు అక్కడ ఆల్కహాల్ దొరికితే, దోషులకు కొరడా దెబ్బల శిక్ష వేసేవారు.
నాకు తెలిసిన చాలా మంది రాత్రి బయటి కెళ్లిన తర్వాత వందకు పైగా కొరడా దెబ్బలు తిన్నారు.
నేనొకసారి టెహ్రాన్‌కు దగ్గర్లో ఉన్న 'షెమ్‌షక్'లో ఒక పార్టీకి వెళ్లాను. అక్కడ ప్రపంచంలోనే ఫేమస్ అయిన లిబిజా రిసార్ట్ ఉండడం వల్ల మేం దాన్ని ముద్దుగా 'షిబిజా' అని పిలిచేవాళ్లం.

ఫొటో సోర్స్, FERANAK AMIDI
ఆ గది చీకటిగా ఉంది. స్ట్రోబ్ లైట్ వెలుగు వల్ల ప్రతి కొన్ని క్షణాలకూ అక్కడున్న మిగతా డ్యాన్సర్స్ మాకు కనిపిస్తున్నారు.
ఒకసారి ఫ్లాష్ లైట్ పడ్డప్పుడు డ్యాన్స్ ఫ్లోర్‌పై నాకు పరిచయం లేని గడ్డం ముఖం ఒకటి కనిపించింది. తర్వాత మరోసారి వెలుగు వచ్చినపుడు కోపంగా ఉన్న ఇంకో ముఖం కనిపించింది.
అంతలో హఠాత్తుగా లైట్లు వెలిగాయి. చుట్టూ జనాలు అరుస్తూ పరుగులు తీస్తున్నారు. మా పార్టీపై కరడుగట్టిన బాసిజీ సైన్యం దాడి చేసింది. అది ఒక స్వచ్ఛంద భద్రతా సంస్థ.
వాళ్లు తమ లాఠీలతో అన్నీ ధ్వంసం చేశారు. నా స్నేహితులు బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మాకు మహిళల అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. పురుషులు తమను వదిలేయమని వేడుకుంటున్నారు.
ఆ గందరగోళం గంటపాటు కొనసాగింది. తర్వాత అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది.
మేం తలుపు తెరిచి చూస్తే, మా స్నేహితులు మాట్లాడకుండా నేలపై కూచుని ఉన్నారు. వాళ్ల ముఖం కన్నీళ్లతో తడిచిపోయుంది.
పార్టీకి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిని సైన్యం తమతో తీసుకెళ్లింది. 30 నిమిషాల తర్వాత ఆయన తిరిగొచ్చాడు. విజయోత్సాహంతో అరిచాడు.
"ఈ రాత్రి మనకు కలిసొచ్చింది. వాళ్లు డబ్బు కోసమే వచ్చారు" అన్నాడు మ్యూజిక్ మళ్లీ మొదలైంది. తెల్లారేవరకూ మేం డ్యాన్స్ చేస్తూనే ఉన్నాం.

ఫొటో సోర్స్, FERANAK AMIDI
కొత్త మార్గాలు కనుగొన్నాం
దాడులు, అరెస్టులు జరుగుతుండడంతో తర్వాత మేం వేరే ఏ పార్టీకి వెళ్లలేదు. కానీ, అధికారులకు చిక్కకుండా ఎలా పార్టీ చేసుకోవాలి అనే విషయంలో మాలో సృజనాత్మకత పెరిగింది.
మేం పోలీసులకు డబ్బులు ఇచ్చే వాళ్లం. పార్టీ జరిగే చోట బయట కార్లు పార్క్ చేయకుండా, మా అతిథుల జాబితాలో కొంతమంది మాత్రమే ఉండేలా చూసుకునే వాళ్లం.
సంగీతం హోరు బయటికి వినబడకుండా కిటికీలకు అడ్డుగా పరుపులు పెట్టేవాళ్లం.
మేం చేస్తున్నది తప్పు కాదని మేం నమ్మాం కాబట్టే అలా చేయడం కొనసాగించాం.
ప్రస్తుతం, ఇరాన్ యువత సమాజంలో నియమాలను సవాలు చేస్తోంది, నిషేధాలను ఉల్లంఘిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ డ్యాన్సర్ మెదేహ్ హోజబ్రీ అరెస్టుకు మద్దతుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అలాంటి వాటిలో ఒకటి మాత్రమే.
ప్రతిసారీ కొంత కాలం అణచివేత అనేది జరుగుతుంది. కానీ అక్కడ యువత ప్రభావం కూడా కనిపిస్తూనే ఉంటుంది. కొత్త వాళ్లు ఇలా వస్తూనే ఉంటారు. ఇది నాకు అంతకు ముందు తరంలో మేం పార్టీ చేసుకుంటున్నప్పుడు జరిగిన ధిక్కారం లాగే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- డాటా బ్రీచ్: ఫేస్‌బుక్‌కు 46 కోట్ల జరిమానా విధించనున్న బ్రిటన్
- ఏడాదికి 81 లక్షలు సంపాదించినా 'అల్పాదాయ వర్గం' కిందే లెక్క
- స్థానిక పత్రికలు లేకుంటే సమాజం ఏమవుతుంది?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. కానీ ఎలా?
- థాయ్‌లాండ్: గుహలో బాలురు అందరూ సురక్షితం
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








