#FIFA2018: రష్యాలో ఫుట్‌బాల్ అభిమానులకూ గూగుల్ ట్రాన్స్‌లేట్‌కి ఏంటీ సంబంధం?

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు జోరందుకున్నాయి. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అక్కడికి వెళుతున్నారు.
అయితే, రష్యాలో ప్రతీ 100 మందిలో ముగ్గురు మాత్రమే ఇంగ్లిష్ మాట్లాడగలరు. దీంతో అక్కడికి వచ్చిన వారు గూగుల్ ట్రాన్స్‌లేట్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. వరల్డ్‌కప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో ట్రాన్స్‌లేట్ సర్వీస్ వినియోగం 30 శాతం పెరిగిందని గూగుల్ పేర్కొంది.
2014 శీతాకాల ఒలంపిక్స్ కోసం అల్దెర్‌లోని సోచీ జిల్లాలో రష్యా ప్రభుత్వం ఓ భారీ స్టేడియాన్ని నిర్మించింది. 2018 వరల్డ్‌కప్ పోటీలను చూడటానికి వచ్చే విదేశీ ప్రేక్షకులకు ఇప్పుడు ఇదే ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ స్టేడియానికి బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు అత్యంత సమీపంలో ఉన్నాయి.
కానీ, ఇక్కడ సూచీ ఫలకాలన్నీ రష్యన్, సిరిల్లిక్ వర్ణమాలలోనే ఉండటం, స్థానికులకు ఇతర భాషలు రాకపోవడం విదేశీయులకు ఇబ్బందిగా మారింది. అయితే, వీటన్నింటికి ఒక యాప్‌తో చక్కని పరిష్కారం లభించింది.
ఇక్కడికి వచ్చిన విదేశీయులు చేతి మునివేళ్లతో భాష ఇబ్బందులను అధిగమిస్తున్నారు. గూగుల్ లాంటి ట్రాన్స్‌లేషన్ సర్వీసులపై ఆధారపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోజుకు 50 కోట్ల మంది
2006లో విడుదలైన గూగుల్ ట్రాన్సిలేట్ ఆ తర్వాత మొబైల్ వినియోగదారులకు అనుగుణంగా యాప్ రూపంలోనూ సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ 50 కోట్ల మంది గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను వినియోగించుకుంటున్నారు.
ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో రష్యాకు వచ్చే విదేశీయుల సంఖ్య 10 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
భాషా సమస్య అంత్యంత తీవ్రంగా ఉన్న ఇలాంటి చోట్ల ట్రాన్స్‌లేట్ సర్వీసుల ప్రభావం చాలా కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
అందరికీ ఇదే ఆధారం
రొమిర్ అనే రష్యన్ కంపెనీ పరిశోధన ప్రకారం 100 మంది రష్యన్లలో ముగ్గరు మాత్రమే పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడగలరు. ఇక 30 శాతం మందికి కాస్త ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉంది.
టాక్సీ రైడ్స్‌కు, బార్లో ఆర్డర్లు బుక్ చేసుకోడానికి ఇక్కడ చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఆధారిత ట్రాన్స్‌లేట్ సర్వీసులనే వాడుతున్నారు.
బీబీసీ అభ్యర్థనపై తమ యాప్ ట్రాన్స్‌లేట్ డాటాను గూగుల్ అందజేసింది. వారు అందించిన వివరాల ప్రకారం, వరల్డ్ కప్ మూలంగా ట్రాన్స్‌లేట్ సర్వీసుల మీద ఆధారపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
వరల్డ్‌కప్ అనే పదం ట్రాన్స్‌లేట్ చేసిన వారి సంఖ్య 200 శాతం పెరగగా, స్టేడియం పదం 135 శాతం, బీర్ పదం 65 శాతం పెరిగింది.
వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇతర భాషల నుంచి రష్యాకు ట్రాన్స్‌లేషన్ వినియోగం 30 శాతం పెరిగిందని, ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలోనూ ఇదే ధోరణి కనిపించిందని గూగుల్ అధికార ప్రతినిధి బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘రష్యన్ భాష నేర్చుకోవడం చాలా కష్టం’
వరల్డ్‌కప్ ప్రారంభమైనప్పటి నుంచి స్పానిష్-రష్యన్‌ల మధ్య ట్రాన్స్‌లేషన్ వినియోగం అత్యధికంగా ఉంది. స్పానిష్ మాట్లాడే చాలా దేశాలు ఈ టోర్నీలో పాల్గొనడమే ఇందుకు కారణం. దీని తర్వాత అరబిక్ రెండో స్థానంలో నిలిచింది. అరబిక్-రష్యన్‌ల మధ్య ట్రాన్సలేషన్ 40 శాతం పెరిగింది.
''చిన్నప్పుడు బడిలో ఇంగ్లిష్ నేర్చుకున్నాం. కానీ, వాళ్లు మాట్లాడినట్లు మాట్లాడటం కష్టం'' అని యూరీ ల్యూచిక్ పేర్కొన్నారు. సోచీ ఒలింపిక్స్ స్టేడియం సమీపంలోని ఒక హోటల్‌లో ఆయన మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌తో భాష తెలియకున్నా ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.
''కొత్త తరం అనేక భాషలను నేర్చుకుంటుంది. నా కుమారుడికి ఏడేళ్లు. అతను నాకంటే బాగా ఇంగ్లిష్ అర్థం చేసుకుంటున్నాడు'' అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో టాక్సీడ్రైవర్‌గా పనిచేస్తున్న అలెగ్జాండెర్ అన్నారు.
గతకొన్ని వారాలుగా ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వారిని కలుసుకుంటున్నాను. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఒకరినొకరం అర్థంచేసుకుంటున్నామని అన్నారు.
''మళ్లీ మేం వరల్డ్‌కప్ పోటీలకు ఆతిథ్యం ఇస్తామని అనుకోవడం లేదు. అలాగే, ఇక్కడికి వచ్చేవారు రష్యన్ భాషను నేర్చుకోవడం చాలా కష్టం'' అని తెలిపారు.
భాషా సమస్యలను తొలగించడమే కాదు, రష్యాలో విదేశీలకు భద్రత విషయంలో సూచనలు అందించడంలోనూ గూగుల్ ట్రాన్సిలేట్ యాప్ బాగా ఉపయోగపడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్లు, డ్యాన్సర్లకు ఇంగ్లిష్ పాఠాలు
2010లో ఫీఫా వరల్డ్‌కప్ పోటీల ఆతిథ్య హక్కులను దక్కించుకోగానే భాషా సమస్యను అధిగమించేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
టోర్నీ నిర్వహకులకు, సిబ్బందికి ప్రత్యేకంగా ఇంగ్లిష్ తరగతులు నిర్వహించింది. అలాగే, మాస్కోలోని ఆరోగ్య సిబ్బందికి, డ్యాన్సర్లకు కూడా ఇంగ్లిష్ అర్థం చేసుకోడానికి శిక్షణ ఇప్పించింది.
ఇక వరల్డ్‌కప్ నేపథ్యంలో రష్యాలోని డేటింగ్ యాప్‌లకు భారీగా ట్రాఫిక్ పెరిగింది. రష్యాలో నడిచే టిండర్ తరహా డేటింగ్ యాప్ వెడమోస్టీ ట్రాఫిక్ ఒక్కసారిగా 1000 శాతం పెరిగిందని మాస్కో టైమ్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో రోనాల్డో
వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి గూగుల్ ట్రాన్సిలేట్ డాటాను పరిశీలిస్తే అతి తక్కువగా ట్రాన్సిలేట్ అయిన పదంగా రోనాల్డోకు సంబంధించిన సమాచారం ఉంది. ఒక వ్యక్తి ''ఐ హేట్ క్రిస్టియానో రొనాల్డో'' అనే పదాన్ని రష్యాలో ఏమంటారు అని అడిగారు.
ఇవి కూడా చదవండి:
- ఈ తెలుగు చాయ్‌వాలాకు నరేంద్ర మోదీ ‘సెల్యూట్’ చేశారు.. ఇంతకూ ఎవరాయన?
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఇది.. భారత్‌లోనే ఉంది
- ప్రపంచంలో ఈ భాష ముగ్గురే మాట్లాడతారు!
- ప్రవాసులను అందరికన్నా ఎక్కువగా ఆదరించే దేశం ఇదే
- 780 భాషలను కనిపెట్టిన గణేశ్ దేవి
- ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు!
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








