పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్ రాజధాని కఠ్మాండూలో విమానం కూలడానికి కారణాలేమిటో ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.
అయితే యూఎస్-బంగ్లా ఎయిర్ లైన్స్‌కు చెందిన బీఎస్211 విమానం కూలడానికి - పైలెట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మధ్య సమన్వయలోపమే కారణమని భావిస్తున్నారు.
పైలట్‌ను రాంగ్ డైరెక్షన్‌లో రన్ వేపైకి రమ్మనడమే ప్రమాదానికి కారణమని యూఎస్-బంగ్లా సీఈఓ అసిఫ్ ఇమ్రాన్ అంటున్నారు. అయితే బ్లాక్ బాక్స్‌లోని పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తే కానీ ప్రమాదానికి స్పష్టమైన కారణం వెల్లడి కాదు.
ఏటీసీ, పైలెట్‌ల మధ్య జరిగే సంభాషణల్లో ఒకరి మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు.

ఫొటో సోర్స్, AFP
‘నాలుగైదు ఇంగ్లీషు మాటలే వచ్చు’
ఇలాంటి ఒక ఘటనకు ప్రత్యక్ష సాక్షి ఎయిర్ ఇండియాకు చెందిన పైలెట్ మహేశ్ గుల్బానీ.
''ఒకసారి మేం చైనా గగనతలంపై 38-40 వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నాం. అయితే పైన వాతావరణం అనుకూలించని కారణంగా మేం కిందికి దిగాల్సి వచ్చింది. కొంచెం తక్కువ ఎత్తులో ప్రయాణించడానికి ఏటీసీ అనుమతి కోరాం.''
‘‘దీనికి సమాధానంగా చైనా కంట్రోలర్ 'ప్లీజ్ మెంటైన్ లెవల్' అన్నాడు. కొంచెం తక్కువ ఎత్తులో ప్రయాణించడానికి అతను మమ్మల్ని అనుమతించలేదు. కిందికి ఎందుకు అనుమతించడం లేదని మేం అతణ్ని ప్రశ్నించాం. అయితే అతను మాత్రం 'ప్లీజ్ మెంటైన్ లెవల్' అంటూనే ఉన్నాడు'' అని మహేశ్ తెలిపారు.
''అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రయాణించడం సురక్షితం కాదు కనుక మేం ఎమర్జెన్సీ కాల్ తీసుకుని, తక్కువ ఎత్తులో ప్రయాణించాం. కానీ తర్వాత తెలిసింది - ఆ కంట్రోలర్లకు 'ఎంత స్పీడులో ఉన్నారు', 'ఎంత ఎత్తులో ఉన్నారు' - ఇలాంటి నాలుగైదు ఇంగ్లిష్ మాటలు మాత్రమే తెలుసు. అవి కాకుండా వేరే ఏ ప్రశ్న అడిగినా వాళ్లకు అర్థం కాదు'' అని మహేశ్ వివరించారు.
''ఇంకో విషయం ఏంటంటే - కొన్ని దేశాలలో ఉచ్ఛరణ పైలెట్లకు అర్థం కాదు. ఉదాహరణకు బ్యాంకాక్‌లో R అక్షరాన్ని పలకరు. 'ఖతార్ ఎయిర్‌లైన్స్'ను వాళ్లు 'కతాల్ ఎయిర్‌లైన్స్' అంటారు.''

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ప్రమాదం
ఇలాంటి కారణంతోనే 1996లో దిల్లీలో సౌదీ అరేబియా విమానం, కజకిస్తాన్ విమానాలు గాలిలో ఢీకొనడంతో 312 మంది ప్రయాణికులు మరణించారు.
ఈ ప్రమాదంపై విచారణ జరిపిన కమిటీ - కంట్రోలర్ చెబుతున్న విషయాన్ని కజకిస్తాన్ పైలెట్ సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
అంతే కాకుండా ఇంగ్లిష్ మాట్లాడే, అర్థం చేసుకోగలిగే విమాన సిబ్బందికే ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
70 శాతం ప్రమాదాలు అందువల్లే..
ఇదే విషయంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1981లోనే ఒక నివేదిక వెలువరించింది.
సుమారు 28 వేల కేసులను విశ్లేషించిన నాసా - కంట్రోల్ సిబ్బంది సూచనలను అర్థం చేసుకోవడంలో గందరగోళమే 70 శాతం ప్రమాదాలకు కారణమని పేర్కొంది.
చాలాసార్లు పైలెట్ - కంట్రోలర్ మధ్య జరిగే సంభాషణల్లో ఎవరో ఒకరు తమ ప్రాంతీయ భాషలో మాట్లాడటంతో కొన్ని పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు 'Two' అన్న పదాన్ని 'To' గా అర్థం చేసుకుంటుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
దీనికి పరిష్కారం ఏంటి?
భాషా సమస్య పరిష్కారం కోసం కమర్షియల్ ఫ్లైట్ పైలెట్లు ఒక ఆంగ్ల భాషా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పైలెట్.. ''కమర్షియల్ ఫ్లయింగ్ లైసెన్స్ కొరకు ఒక రేడియో టెలిఫోనిక్ పరీక్ష ఉంటుంది. దీనిలో ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. మన దేశంలో అయితే డీజీసీఏ నిర్వహించే ఈ పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అసెంబ్లీల్లో ఆగమాగం.. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎందుకు?
- గుంటూరు ప్రజలు: ‘నీళ్లు తాగాలంటే భయమేస్తోంది’
- అధిక దిగుబడే వ్యవసాయ సంక్షోభానికి కారణమా!
- ‘బ్రిటన్‌లో రష్యా విష ప్రయోగం’
- స్టీఫెన్ హాకింగ్‌కు వచ్చిన వ్యాధి ఏంటి? దాన్ని ఎలా జయించారు?
- ఎడిటర్స్ కామెంట్: పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్‌ను అస్ర్తంగా మార్చుకోబోతున్నారా? జనసేన భవిష్యత్తు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








