డెన్మార్క్‌లో బురఖాపై నిషేధం.. మిగతా యూరప్ దేశాల్లో పరిస్థితేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
ముఖాన్ని మొత్తం కప్పేసేలా ధరించే బురఖాలు, హిజాబ్‌లను డెన్మార్క్‌లో నిషేధించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు.
ఈ మేరకు రూపొందించిన చట్టాన్ని డెన్మార్క్ పార్లమెంటు గురువారం ఆమోదించింది.
అయితే.. ఒక్క డెన్మార్కే కాదు ఐరోపాలోని అనేక దేశాల్లో ముస్లింలు ధరించే బురఖా, హిజాబ్, నిఖాబ్ వంటివాటి విషయంలో చర్చ జరుగుతోంది. మత స్వేచ్ఛ, స్త్రీ స్వేచ్ఛ, లౌకికత, దేశ భద్రత వంటి ఎన్నో కోణాలున్న ఈ అంశంపై ఒక్కో దేశం ఒక్కోలా స్పందిస్తోంది. పలు చోట్ల పాక్షికంగా నిషేధాలున్నాయి.

ఫొటో సోర్స్, AFP
జర్మనీ
కొంచెం కూడా ముఖం కనిపించకుండా ధరించే బురఖా వంటివాటిని నిషేధించాల్సిన అవసరం ఉందని 2016 డిసెంబరులో జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు.
జర్మనీలోని సుమారు 8 రాష్ట్రాలు ఉపాధ్యాయినులు ఇలాంటి బురఖాలు ధరించడాన్ని నిషేధించాయి. హెస్సె రాష్ట్రంలో అయితే ప్రభుత్వ ఉద్యోగినులెవరూ ఇలాంటివి ధరించడానికి వీల్లేదు.
బవారియా రాష్ట్రంలో స్కూళ్లు, పోలింగ్ కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో బురఖాలు ధరించడంపై నిషేధం ఉంది.

ఆస్ట్రియా
2017లో అక్కడి పాలక పక్షం నిఖాబ్, బురఖాలను నిషేధించాలని నిర్ణయించింది. స్కూళ్లు, కోర్టులు వంటి బహిరంగ ప్రదేశాల్లో వీటిని ధరించరాదని నిర్ణయిస్తూ అదే ఏడాది అక్టోబరు నుంచి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
అయితే.. ఆస్ట్రియాలో ఇలా పూర్తిస్థాయిలో ముఖం కనిపించకుండా నిఖాబ్ ధరించేవారు కేవలం 150 మంది మాత్రమే ఉన్నారట.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్
బహిరంగ ప్రదేశాల్లో నిఖాబ్‌ను నిషేధించిన తొలి ఐరోపా దేశం ఫ్రాన్స్. 2011లోనే విధించిన ఈ నిషేధం ప్రకారం ఫ్రాన్స్ దేశీయులు కానీ, విదేశీయులు కానీ ఫ్రాన్స్‌లోని బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా నిఖాబ్ ధరించడానికి వీల్లేదు. అలా ధరిస్తే జరిమానా తప్పదు.
ఈ దేశంలో సుమారు 50 లక్షల ముస్లిం జనాభా ఉన్నప్పటికీ ఇలాంటివి ధరించే మహిళలు మాత్రం 2 వేల మందికి మించరు.
నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా ధరిస్తే 150 యూరోలు (సుమారు రూ.13 వేలు) జరిమానా చెల్లించాలి. 2015 నుంచి ఇప్పటివరకు 1546 జరిమానాలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
బెల్జియం: 2011 జులై నుంచి బెల్జియంలో బురఖాలు, నిఖాబ్‌లపై నిషేధం ఉంది. మనిషి ముఖం గుర్తించడానికి వీల్లేకుండా ఎలాంటి వస్త్రం కప్పుకోరాదన్నది అక్కడి నియమం. ఈ నిషేధాన్ని తొలగించాలంటూ వచ్చిన అభ్యర్థనలను బెల్జియం రాజ్యాంగ న్యాయస్థానం 2012లో తోసిపుచ్చింది.
నెదర్లాండ్స్: స్కై మాస్క్‌లు సహా నిఖాబ్, బురఖాలను 2016లో నిషేధించాలని ప్రతిపాదించారు. ఇది చట్టరూపం దాల్చలేదు. సుమారు 8 లక్షల మంది ముస్లింలు ఇక్కడున్నప్పటికీ ఇలాంటివి ధరించేవారి సంఖ్య 300కు మించదు.
ఇటలీ: ముఖాన్ని పూర్తిగా కప్పేసేలా ధరించే వస్త్రాలపై ఇటలీలోని పలు పట్టణాల్లో నిషేధం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్: బార్సిలోనా, మరికొన్ని పట్టణాల్లో 2010లో ఇలాంటి నిషేధం విధించారు. కానీ, 2013లో స్పెయిన్ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది.
టర్కీ: 2013కి ముందు ఇక్కడ పాక్షికంగా నిషేధం ఉండేది. ఆ తరువాత సడలించారు.
రష్యా: స్టారోపోల్ వంటి ప్రాంతాల్లో నిషేధం ఉంది.
బల్గేరియా: ముఖాన్ని కప్పుకొనే మహిళలకు జరిమానా విధించేలా, వారికి దక్కాల్సిన ప్రయోజనాల్లో కోత విధించేలా బల్గేరియా పార్లమెంటు 2016లో ఓ బిల్లు ఆమోదించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








