లోహాల దిగుమతులపై ట్రంప్ సుంకాలు - మిత్రదేశాల మండిపాటు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ట్రేడ్ వార్'లో మరో అధ్యాయానికి తెరలేపారు.
స్టీలు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. దీని ఫలితంగా అమెరికన్ కంపెనీలకు ఇకపై ఉక్కు విదేశాల నుంచి చౌకగా లభించదు.
ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం దిగుమతి సుంకాల్ని ట్రంప్ విధించారు.
ట్రంప్ చేపట్టిన ఈ చర్యలను రిపబ్లికన్ పార్టీ పార్లమెంటు సభ్యులు సహా యూరోపియన్ యూనియన్, కెనడా, మెక్సికోలు దుయ్యపట్టాయి.

ఫొటో సోర్స్, Getty Images
సుంకాల పెంపుదలతో ప్రభావితమయ్యే దేశాలు ట్రంప్‌కు 'తగిన గుణపాఠం' నేర్పించాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉక్కు నుంచి స్లీపింగ్ బ్యాగ్స్, బాల్ పెన్నుల దాకా ప్రతి వస్తువుపైనా సుంకాలు పెంచే యోచన చేస్తున్నాయి.
ఫ్రాన్స్ రాష్ట్రపతి ఎమ్మానుయేల్ మేక్రాన్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ చర్యలు 'అక్రమం' అని ఆయన అభివర్ణించారు.
యూరోపియన్ యూనియన్ దీనికి దీటైన జవాబు చెబుతుందని మేక్రాన్ ప్రకటించారు.
మరోవైపు, తన చర్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా జాతీయ భద్రతలో స్టీలు, అల్యూమినియంలకు చాలా ప్రాముఖ్యం ఉంది. విదేశాల నుంచి సరఫరా అయ్యే స్టీలుతో అమెరికాకు ముప్పుంది అని ఆయన వాదించారు.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌పై ప్రభావం
స్టీల్, అల్యూమినియంలపై అమెరికా పెంచిన సుంకాలతో భారతీయ కంపెనీలకు నష్టం జరుగుతుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే చైనా, బ్రెజిల్‌లతో పోలిస్తే ఈ నష్టం తక్కువే. అమెరికా చేసుకునే అల్యూమినియం, స్టీలు దిగుమతుల్లో భారత్ వాటా దాదాపు 3 శాతం ఉంటుంది.
అమెరికాకు భారత్ చేసే స్టీలు ఎగుమతుల ప్రక్రియలో అనేక ఎగుడుదిగుళ్లున్నాయి. అయితే అల్యూమినియం రంగంపై మాత్రం దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అల్యూమినియం ఎగుమతులు నిలకడగా పెరుగుతూ వచ్చాయి.
2013-14లో అల్యూమినియం ఎగుమతులు 201 మిలియన్ డాలర్లుండగా, 2014-15 నాటికి 306 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే 2015-16లో ఇవి స్వల్పంగా తగ్గి 296 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మళ్లీ 2016-17లో పుంజుకొని 350 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అల్యూమినియంపై అమెరికా 10 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఈ ఎగుమతులు తగ్గుతాయి.

వ్యతిరేకిస్తున్న కెనడా, బ్రిటన్‌లు
అయితే ట్రంప్ చేస్తున్న వాదనలో ఏ మాత్రం పస లేదని కెనడా అభిప్రాయం. "అమెరికా జాతీయ భద్రతకు కెనడా వల్ల ముప్పు ఉండొచ్చనే వాదన ఏ రకంగా చూసినా మింగుడుపడనిదే" అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.
తమ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే 1300 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై జులై 1 నుంచి 25 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు ఆయన చెప్పారు.
ఈ ఉత్పత్తుల్లో అమెరికన్ స్టీలుతో సహా విస్కీ, కాఫీ, తదితర వినియోగ వస్తువులు కూడా ఉన్నాయి.
అమెరికాకు ఉక్కు సరఫరా చేసే దేశాల జాబితాలో కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్‌లదే అగ్ర స్థానం. 2017లో అమెరికాకు మొత్తం 4800 కోట్ల డాలర్ల స్టీలు, అల్యూమినియంలు దిగుమతి కాగా, ఇందులో పై మూడింటి భాగస్వామ్యం దాదాపు 50 శాతం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ దీనిపై స్పందిస్తూ - "ట్రంప్ చేపట్టిన ఈ చర్యలతో బ్రిటన్ ఉక్కు రంగంపై ప్రభావం ఎలాగూ పడుతుంది, అయితే అమెరికా ఆర్థికవ్యవస్థ కూడా దీనికి మినహాయింపుగా ఏమీ ఉండబోదు" అని పేర్కొంది.
తమ దేశం నుంచి జరిగే స్టీలు ఎగుమతుల్లో 7 శాతం అమెరికాకు వెళ్తాయని బ్రిటన్‌లోని స్టీలు ఉత్పత్తిదారుల సంస్థ తెలిపింది. కానీ ట్రంప్ నిర్ణయంతో ఈ దిగుమతులు తగ్గిపోతాయనీ, దీని ప్రభావంతో కొందరు ఉద్యోగులపై కూడా వేటు పడుతుందని అది పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








