ట్రంప్-కిమ్ భేటీ: ఉత్తర కొరియా పాలకుడితో సీఐఏ చీఫ్ మంతనాలు!

అమెరికా గూఢచార సంస్థ డైరెక్టర్ మైక్ పాంపేయో ఉత్తర కొరియా వెళ్లి ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్‌తో రహస్యంగా భేటీ అయ్యారని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్-ఉన్‌ల మధ్య ముఖాముఖి చర్చల కోసం సన్నాహాల్లో భాగంగా పాంపేయో ఈస్టర్ వారాంతంలో ప్యాంగ్యాంగ్ వెళ్లి ఈ భేటీ జరిపారని అధికార వర్గాలు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఉత్తరకొరియాతో అమెరికా చాలా ఉన్నత స్థాయిల్లో చర్చలు జరిపిందని ట్రంప్ ఇంతకుముందు అంగీకరించారు.
ఫ్లోరిడాలో జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కిమ్ జోంగ్-ఉన్‌తో తన సమావేశానికి ఐదు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ట్రంప్ - కిమ్ సమావేశం ఎప్పుడు జరగొచ్చు?
ఉత్తర కొరియాతో నేరుగా చర్చలు జరపాలన్న ఆ దేశ ప్రతిపాదనకు ట్రంప్ గత నెలలో అంగీకరించిన విషయం తెలిసిందే.
పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా పాలకుడిని కలవటం ఇదే తొలిసారి అవుతుంది.
ఈ భేటీ జూన్ ఆరంభంలో కానీ దానికి కొంచెం ముందు కానీ జరగవచ్చునని ట్రంప్ చెప్పారు.
ఇదిలా వుంటే.. ఉత్తర కొరియాతో ద్వైపాక్షిక చర్చలకు ట్రంప్ సిద్ధమవటం.. అమెరికా సన్నిహిత దేశం, ఉత్తర కొరియా పొరుగు దేశం జపాన్‌ను దూరం పెట్టే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఉత్తర కొరియా విషయంలో పశ్చిమ దేశాల కఠిన వైఖరిని సడలించరాదని అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి చేయటానికి జపాన్ ప్రధాని షింజో ప్రయత్నిస్తారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








