ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పంద రద్దుకు మూడు కారణాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంథోని జర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఉత్తర అమెరికా నుంచి
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చాలా కాలంగా రచిస్తున్న ప్రణాళిక ప్రకారమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మిత్ర దేశాలు వద్దంటున్నా, తమ దేశానికే చెందిన ప్రముఖులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ట్రంప్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు.
2015లో చేసుకున్న ఒప్పందంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మరోసారి చర్చలకు తాను సిద్ధమని కూడా ప్రకటించారు.
నిజానికి ఒప్పందాన్ని కొనసాగిస్తూనే తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ట్రంప్‌కి ఉంది. అయినా సరే ఆయన ఆ పని చేయలేదు.
ఆఖరికి ఎక్కువశాతం అమెరికా పౌరులు కూడా ఒప్పందానికి అనుకూలంగానే ఉన్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. వీటన్నింటిని పక్కనబెట్టి మరీ ట్రంప్ ఈ నిర్ణయానికి రావడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఒబామా ముద్రను చెరిపేలా..
ట్రంప్ మొదట్నుంచీ వ్యక్తిగతంగా ఈ ఒప్పందానికి వ్యతిరేకమని తెలుస్తోంది. అణు ఒప్పందం అమల్లోకి రావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీని ట్రంప్ చాలాసార్లు తప్పుబట్టారు.
కొన్ని రిపోర్టుల ప్రకారం, ఇటీవల కెర్రీ ఇరాన్ అధికారులను కలిసి మంతనాలు జరిపే ప్రయత్నం చేయడం కూడా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిందని తెలుస్తోంది. కెర్రీ చర్యల గురించి ట్రంప్ ఇటీవల ఓ ట్వీట్ చేయడంతో, ఈ అంశం కచ్చితంగా ఆయన మనసులో ఉందని అర్థమవుతోంది.
‘తనకు అవకాశం వచ్చినప్పుడు కెర్రీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ‘మంతనాలకు దూరంగా ఉండు కెర్రీ, నువ్వు నీ దేశాన్ని బాధపెడతున్నావు’ అని కూడా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తనదైన ముద్ర వేసే క్రమంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలనే ఆయన లక్ష్యంగా చేసుకున్నారు.
అధ్యక్ష పదవి చేపట్టిన వారంలోపే ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్‌షిప్ ట్రేడ్ చర్చల నుంచి అమెరికాను వెనక్కులాగారు.
గత జూన్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలనుకుంటున్న తన ఆలోచనను ప్రకటించారు.
ఒబామా కాలంలో సరైన పత్రాలు లేని వలసదారులకు ఉన్న కొన్ని మినహాయింపులను కూడా ఆయన తొలగించారు.
క్యూబాపైన ఆంక్షలు, రవాణా పరిమితులను మళ్లీ అమల్లోకి తెచ్చారు. కొత్త కార్ల ఇంధన సామర్థ్య ప్రమాణాలు, విద్యుత్ కేంద్రాల ఉద్గారాల లాంటి కొన్ని పర్యవారణ పరమైన అంశాలపై ప్రతిపాదిత నియంత్రణలను రద్దు చేశారు.
‘ప్యారిస్ ఒప్పందం రద్దయింది, అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది, ఒబామా కేర్ కూడా అవసాన దశలో ఉంది. ఈ సమయంలో ఒబామాకు మిగిలిన వారసత్వం.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి మాత్రమే’ అని ది ఫెడరలిస్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సియాన్ డేవిస్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నెతన్యాహుకు అనుకూలంగా..
ట్రంప్ అధ్యక్ష పదవి రేసులోకి వచ్చిన కొత్తలో ఇరాన్ అణు ఒప్పందంపై ఈ స్థాయిలో వ్యతిరేకత ప్రదర్శించలేదు. ఆ ఒప్పందం ఒక తప్పిదమని, పేలవమైన చర్చల ఫలితమని మాత్రమే పేర్కొన్నారు.
‘దాన్నుంచి మేం పూర్తిగా వైదొలగుతామో లేదో చెప్పలేం’ అని 2015లో ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ ఒప్పందం విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తాననీ అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తన పూర్తిస్థాయి మద్దతు తెలిపే చర్యల్లో భాగంగా కూడా ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కఠినంగా మారారన్న భావనా నెలకొంది.
అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ వార్షిక సమావేశంలో కూడా వినాశకరమైన ఇరాన్ అణు ఒప్పందాన్ని రద్దు చేయడమే తన తొలి ప్రాధాన్యమని ట్రంప్ చెప్పారు.
తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇజ్రాయెలీలను తక్కువ స్థాయి పౌరులుగా చూసే రోజులు కూడా పోతాయని ఆయన పేర్కొన్నారు.
అధ్యక్షుడిగా మారిననాటి నుంచే యూఎస్ ఎంబసీని జెరూసలెంకు మార్చే పనులు మొదలుపెట్టారు. పాలస్తీనియన్లపై కొత్త ఆంక్షలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూనే, ఇప్పుడు అణు ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీనియర్లు ఖాళీ
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఏడాదిలో ఇరాన్ ఒప్పందం నుంచి అధికారికంగా వైదొలగే చర్యలు మొదలుపెట్టి మళ్లీ వెనకడుగు వేశారు.
సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిలర్‌సన్, జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్, రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ లాంటి కొందరు సీనియర్లు మొదట్నుంచీ ఒప్పందం నుంచి బయటకు రావొద్దని ట్రంప్‌కు సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ ముగ్గురిలో మాటిస్ మాత్రమే పదవిలో ఉన్నారు. మిగతా ఇద్దరి స్థానంలో మైక్ పాంపియో, జాన్ బోల్టన్‌లు అధికార బాధ్యతలు చేపట్టారు. వాళ్లిద్దరూ ఇరాన్‌పై కఠినంగా ఉంటారనే పేరుంది. దాంతో తాను తీసుకున్న నిర్ణయంపై అంతర్గతంగా పెద్దగా వ్యతిరేకత ఎదురుకాలేదు.
15 నెలల తరవాత ట్రంప్ ఓ ఫారిన్ పాలసీ టీంను ఏర్పాటు చేశారు. ట్రంప్ మాటే.. వాళ్ల మాట కూడా.
ఇవి కూడా చదవండి
- Reality Check: మే 12 డెడ్‌లైన్: ట్రంప్ ‘నో’ అంటే ఇరాన్ పరిస్థితేంటి?
- అణు ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా: ఇప్పుడేం జరుగుతుంది?
- 'ఇదే చివరి రాత్రి అనుకున్నాం': కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు
- ‘కొందరు నన్ను దేవతంటారు.. ఇంకొందరు వేశ్య అంటారు’
- కర్ణాటక: రెడ్డి బ్రదర్స్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
- హిజాబ్ తొలగించిన మహిళకు రెండేళ్లు జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








