ఆస్కార్స్ అకాడమీ నుంచి బిల్ కోస్బీ, రోమన్ పొలాన్‌స్కీ బహిష్కరణ

ఫొటో సోర్స్, REUTERS/EPA
అమెరికా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి బిల్ కోస్బీ, రోమన్ పొలాన్‌స్కీలను బహిష్కరించారు.
టీవీ స్టార్ కోస్బీ గత నెలలో ఒక లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారితుడయ్యాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ పొలాన్‌స్కీ తాను 1977లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు అంగీకరించారు.
ఆస్కార్ అవార్డులను నిర్వహించే అకాడమీ.. తమ ప్రవర్తనా ప్రమాణాలకు అనుగుణంగా వీరిద్దరినీ బహిష్కరించినట్లు చెప్పింది.
గత ఏడాది అనేక లైంగిక దాడుల ఆరోపణల నేపథ్యంలో నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌ను అకాడమీ నుంచి గెంటేశారు.
వైన్‌స్టీన్ పతనం తర్వాత #MeToo ఉద్యమం.. అధికారాన్ని దుర్వినియోగం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇతర పురుషులనూ చుట్టుముట్టటం మొదలైందని లాస్ ఏంజెలెస్‌లోని బీబీసీ ప్రతినిధి జేమ్స్ కుక్ పేర్కొన్నారు.
అకాడమీ నిర్ణయం విషయంలో కోస్బీ కానీ పొలాన్‌స్కి కానీ బహిరంగంగా స్పందించలేదు.
కోస్బీని దోషిగా నిర్ధారించటం.. ‘‘మూక న్యాయమే కానీ.. నిజమైన న్యాయం కాద’’ని ఆయన భార్య కమీల్ అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
అకాడమీ ఏం చెప్పింది?
ఈ అంశంపై బోర్డు సభ్యులు ఓటింగ్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత అకాడమీ గురువారం ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించింది.
‘‘అకాడమీ సభ్యులు అకాడమీ విలువలను పాటించటం, మానవ ఆత్మగౌరవాన్ని గౌరవించటం అవసరం. ఈ నైతిక ప్రమాణాలను బోర్డు ప్రోత్సహిస్తూనే ఉంటుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
91 సంవత్సరాల అకాడమీ చరిత్రలో కేవలం ఐదుగురిని మాత్రమే బహిష్కరించారు.
కార్మైన్ కారిడి గోప్యంగా ఉంచాల్సిన సినిమా ప్రివ్యూను తన స్నేహితుడొకరికి పంపగా.. అది ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావటంతో 2004లో ఆయన సభ్యత్వాన్ని అకాడమీ రద్దు చేసింది.
అయితే.. పొలాన్‌స్కి తను అత్యాచారానికి పాల్పడ్డట్లు దశాబ్దాల కిందటే అంగీకరించినప్పటికీ.. ఆయనపై చర్యలు చేపట్టటానికి ఇంత కాలం ఎందుకు పట్టిందని.. సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పైగా అప్పటి నుంచీ అకాడమీ ఆయనను గౌరవిస్తూనే ఉందని తప్పుపట్టారు.

1977లో తన నేరాన్ని ఒప్పుకున్నప్పటి నుంచీ పొలాన్‌స్కి ఆస్కార్ నామినేషన్లు...
1981: ఉత్తమ దర్శకుడు (సినిమా: టెస్)
2003: ఉత్తమ చిత్రం (సినిమా: ద పియానిస్ట్)
2003: ఉత్తమ దర్శకుడు (సినిమా: ద పియానిస్ట్) - ఈ అవార్డు ఆయన గెలుచుకున్నారు


ఫొటో సోర్స్, Getty Images
పొలాన్‌స్కి ఏం చేశారు?
ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న పొలాన్‌స్కి మీద నమోదైన ఈ అత్యాచారం కేసు 40 ఏళ్లకు పైగా సాగుతోంది.
1977లో మైనర్ బాలిక అయిన సమంతా గీమర్‌తో చట్టవ్యతిరేకంగా సెక్స్ చేసినట్లు పొలాన్‌స్కి నేరాన్ని అంగీకరించారు. 42 రోజులు జైలులో కూడా గడిపారు. అయితే.. నేరాన్ని అంగీకరించినందుకు శిక్షను తగ్గించే ఒప్పందం (ప్లీ బార్గైన్ డీల్) రద్దవుతుందన్న భయంతో ఆయన అమెరికా వదిలి పరారయ్యారు.
ఆయనకు ఫ్రాన్స్, పోలండ్ పౌరసత్వాలు కూడా ఉన్నాయి. ఆయనను తమకు అప్పగించేలా అమెరికా అధికారులు చేసిన పలు ప్రయత్నాలను తప్పించుకున్నారు.
పొలాన్‌స్కి ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు. తన పౌరులను ఫ్రాన్స్ ఇతర దేశాల అధికారులకు అప్పగించదు. 2015లో ఆయన పోలండ్‌లోని క్రాకోలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆయనను తమకు అప్పగించాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని పోలండ్ కోర్టు కూడా తిరస్కరించింది.
స్విట్జర్లాండ్ 2010లో పొలాన్‌స్కిని తొమ్మిది నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచినప్పటికీ.. ఆయనను అమెరికాకు అప్పగించాలన్న వారంట్‌ను తిరస్కరించింది.
ఆస్కార్ అవార్డుల స్థాయిలో ఫ్రాన్స్ అవార్డుల జ్యూరీ అయిన సీజర్స్ సారథిగా పొలాన్‌స్కిని ఎంపిక చేశారు.
ఆ చర్యపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తటంతో ఆయన వైదొలగారు.
పొలాన్‌స్కిని తాను క్షమించానని.. ఇక తన జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని బాధితురాలైన గీమర్ గత ఏడాది అమెరికా కోర్టుకు నివేదించారు. కానీ కోర్టు ఆమె వినతిని తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఈ చర్యలు ఎందుకు?
జేమ్స్ కుక్, బీబీసీ న్యూస్, లాస్ ఏంజెలెస్
బిల్ కోస్బీ విషయంలో సమాధానం స్పష్టంగానే ఉంది. వారం రోజుల కిందట అమెరికా కోర్టు ఒకటి కోస్బీని నేరస్తుడిగా నిర్ధారించిన నేపథ్యంలో ఆయనను అకాడమీ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
రోమన్ పొలాన్‌స్కిపై వేటు మాత్రం.. తాను మైనర్ బాలికతో సెక్స్ చేశానని నేరాన్ని అంగీకరించి 2,0000 వారాలు మించిపోయింది.
హర్వే వైన్‌స్టీన్‌ను కూడా.. ఆయన లైంగిక దాడుల ఆరోపణలను ఎదుర్కొంటున్నా (ఆయన వాటిని తిరస్కరిస్తున్నారు) నేరస్తుడిగా నిర్ధారణ కాకుండానే అకాడమీ నుంచి బహిష్కరించారు.
పదమూడేళ్ల బాలికతో సెక్స్ (చట్టందృష్టిలో అత్యాచారం) చేయటం తన ‘‘విలువలు, మానవ ఆత్మగౌరవాన్ని గౌరవించ’’టానికి ఉల్లంఘనలేనని హాలీవుడ్ గుర్తించటానికి 40 ఏళ్లకు పైగా సమయం ఎందుకు పట్టింది?
అకాడమీ తన ప్రమాణాలను ఇటీవల సవరించి అమలులోకి తెచ్చింది. సంస్థ ‘‘నిబద్ధతతో రాజీ పడే’’ వారిని బహిష్కరించాలన్నది అందులో ఒకటి. సభ్యులుగా ఉన్న 8,400 మంది వీటికి అనుగుణంగా ప్రవర్తించాలని స్పష్టం చేసింది.
అయితే.. నిజమైన కారణం ఈ నిర్వహణా మార్పుల్లో లేదు.
ప్రక్షాళన కోసం ఆరంభమైన #MeToo, Time's Up ఉద్యమాలు ప్రసరించిన వెలుగు హాలీవుడ్ పరువును దెబ్బతీస్తున్న నేపథ్యంలో ఆ రంగం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అకాడమీ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే.. ఈ ఉద్యమాల వెలుతురు చాలా మంది ఇతర సభ్యుల మీద కూడా పడుతూ వారి చీకటి కోణాలను బయటపెడుతోంది. దీంతో ఒక్కొక్కిరిని బహిష్కరించే కొద్దీ.. అటువంటి చరిత్ర ఉన్న ఇతరులపై చర్యలు చేపట్టాలన్న ఒత్తిడీ పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కోస్బీ కేసు ఏమిటి?
ప్రస్తుతం 80 ఏళ్ల వయసున్న కోస్బీ లైంగిక దాడికి పాల్పడ్డారని కోర్టు ఏప్రిల్ చివర్లో నిర్ధారించింది. ఆయనకు పదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశముంది.
మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఆండ్రియా కాన్‌స్టాండ్ మీద ఆయన 2004లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ఆరో్పణ.
ఈ ఆరోపణలపై 2017లో తొలి జ్యూరీ ఆయనపై తీర్పు ఇవ్వటంలో విఫలమవటంతో రెండోసారి విచారణ జరిగింది.
1984-92 మధ్య ప్రపంచ హిట్‌గా మారిన అమెరికా టీవీ ప్రోగ్రామ్ ద కోస్బీ షోలో ఆయన నటించారు. అందులో ఆయన పోషించిన తండ్రి పాత్రకు గాను ‘‘అమెరికాస్ డాడ్’’ అని పేరు గడించారు.
ఒక సమయంలో అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతన్న నటుడిగా కూడా ఆయన పేరు పడ్డారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








