అణుపరీక్షలు నిలిపివేయాలన్న ఉత్తరకొరియా నిర్ణయానికి ఇవేనా కారణాలు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంకిత్ పాండా
- హోదా, ‘ద డిప్లమాట్’ సీనియర్ ఎడిటర్
ఉత్తర కొరియా గత చరిత్రను, దాని అణు, క్షిపణి పరీక్షల నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ అణు, క్షిపణి పరీక్షలు నిలిపివేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని భావించొచ్చు.
అణు పరీక్షల విషయానికి వస్తే- 2006 నుంచి అణు పరీక్షలు నిర్వహిస్తున్న పంగ్‌యె-రి అణు పరీక్ష ప్రాంతాన్ని మూసేస్తున్నట్లు కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించారు.
దీనికి కారణం - తాము ఇప్పటికే అణ్వాయుధాల రూపకల్పనలో ప్రావీణ్యత సాధించామని కిమ్ భావిస్తుండడమే.
దీనిని నిర్ధారించుకోవడం కష్టమే అయినా, అదేమీ మరీ అసాధ్యం, అతిశయోక్తి కాదు.
1998 నాటికే ఆరు అణు పరీక్షలు నిర్వహించిన భారత, పాకిస్తాన్‌లు మళ్లీ పరీక్షలు నిర్వహించకుండానే అణ్వాయుధ దేశాల జాబితాలో చేరిపోయాయి.
అలాంటిది, అదనంగా మరో ఎనిమిదేళ్లు అదనంగా అణ్వాయుధాల రూపకల్పనలో ఉన్న ఉత్తర కొరియా, అలా భావించడం అతిశయోక్తి కాకపోవచ్చు.

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS
2016, 2017లో ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్షలు చాలా ముఖ్యమైనవి. 2016 సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో వివిధ రకాల ఖండాంతర క్షిపణులపై అణు పరికరాలను అమర్చే సదుపాయం ఉందని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది.
అంతే కాకుండా అవి రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని నాగసాకిపై అమెరికా ప్రయోగించిన బాంబులకన్నా రెండు, మూడు రెట్లు శక్తివంతమైనవి తెలిపింది.
ఉత్తర కొరియాకు నిజంగా థర్మోన్యూక్లియర్ బాంబును తయారు చేసే సామర్థ్యం ఉందా, లేదా అన్నదానిని స్వతంత్ర నిపుణులు, ఇంటలిజెన్స్ సంస్థలు నిర్ధారించలేకున్నా - 2017, సెప్టెంబర్ 3న భూప్రకంపన డేటాను పరిశీలిస్తే, ఉత్తర కొరియా వద్ద నగరాలను భస్మీపటలం చేసే శక్తి కలిగిన బాంబులు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తమ్మీద కిమ్ ఇప్పుడు అణ్వాయుధాల విషయంలో తాము చాలా బలోపేతమయ్యాం అని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇక తాము ఖండాంతర క్షిపణులను పరీక్షించబోమని కిమ్ చెప్పడం మాత్రం ఆశ్చర్యకరమే. ఉత్తర కొరియా నిర్వహించిన మొత్తం క్షిపణి పరీక్షల్లో కేవలం మూడు పరీక్షలు మాత్రమే అమెరికా వరకు అణ్వాయుధాలను మోసుకెళ్ల గల సామర్థ్యం కలిగినవి.
అయితే అమెరికాలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడానికి ఉత్తర కొరియా ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
కానీ ఉత్తర కొరియా ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఆ దేశం వద్ద అమెరికాను భయపెట్టడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఆ దేశం వద్ద క్షిపణి లాంఛ్ వెహికిల్స్ సంఖ్య మాత్రం పరిమితం.
ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద ఖండాంతర క్షిపణుల ప్రయోగం కోసం కేవలం ఆరు లాంఛ్ వెహికిల్స్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల వాటి సంఖ్యను పెంచుకోవాలని కిమ్ భావిస్తున్నట్లు విశ్వసించడానికి ఆస్కారముంది.

ఫొటో సోర్స్, Getty Images
నిషేధాలను ఉల్లంఘించడం చాలా సులువు
పుంగ్‌యె-రి అణుపరీక్షల ప్రాంతంలో పరీక్షలు నిర్వహించే టన్నెల్స్‌ను ధ్వంసం చేస్తేనే ఉత్తరకొరియాపై ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. అయితే కిమ్ తన ప్రకటనలో కేవలం ఆ ప్రాంతాన్ని మూసేస్తామని మాత్రమే చెప్పారు.
అందువల్ల ఉత్తరకొరియా క్షిపణులను అట్టి పెట్టుకున్నంత కాలం, తనపై తాను విధించుకున్న నిషేధాన్ని ఉల్లంఘించడం చాలా సులభం. ఉదాహరణకు 1999లో ఆ దేశం క్షిపణి పరీక్షలకు విరామం ప్రకటించింది. కానీ 2006లో దానిని ఉల్లంఘించింది.
కిమ్ తన ప్రకటనలో, అణు పరీక్షల విరామంతో తాను సోషలిస్టు ఆర్థికవ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. అందువల్ల ఉత్తరకొరియా రాబోయే రోజుల్లో దక్షిణకొరియా, అమెరికాలతో పాల్గొనే సదస్సులలో ఈ లక్ష్యం దిశగా పని చేసే అవకాశముంది.
చివరగా - కిమ్, ట్రంప్‌తో సమావేశం వల్ల పొందబోయే లాభాలతో పోలిస్తే, ఉత్తర కొరియా తన అణు పరీక్షలను నిలిపివేయడం వల్ల కలిగే నష్టాలు తక్కువే.
మొత్తమ్మీద కిమ్ ప్రకటన, ఉత్తర కొరియా తన భద్రతకు అత్యవసరమని భావిస్తున్న అణ్వాయుధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదని స్పష్టం చేస్తున్నాయి.
కిమ్ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'పెద్ద ముందడుగు' అని అభివర్ణించినా, కిమ్ అంతిమ లక్ష్యాలు ఏమిటనేది ఆయన ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








