జాకోబ్ జుమా రాజీనామా చేయాల్సిందే: ఏఎన్‌సీ

జాకోబ్ జుమా

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా రాజీనామా చేయాల్సిందేనని అధికార ఆఫ్రికన్ నేషన్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) కోరినట్లు మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి.

పార్టీ సీనియర్ ప్రతినిధులు అనేక గంటల పాటు చర్చించిన అనంతరం జుమాను రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జుమా రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తున్నారు.

పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆయన పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

2009 నుంచి దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా ఉన్న జుమా ఇటీవలి కాలంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత డిసెంబర్‌లో సిరిల్ రమఫోసా ఏఎన్‌సీ నేతగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జుమా పక్కకు తప్పుకోవాలన్న ఒత్తిడి పెరిగింది.

జాకోబ్ జుమా

ఫొటో సోర్స్, Brent Stirton

ఫొటో క్యాప్షన్, జుమా రాజీనామా కోరుతూ నిరసన ప్రదర్శన

జుమా చేసిన తప్పేంటి?

జుమా అధ్యక్ష పదవీకాలంమంతా అవినీతి ఆరోపణలతో నిండిపోయింది.

2016లో దక్షిణాఫ్రికాకు చెందిన అత్యున్నత న్యాయస్థానం జుమా తన సొంత నివాసంపై చేసిన ఖర్చు విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆక్షేపించింది.

గత ఏడాది సుప్రీంకోర్ట్ ఆఫ్ అప్పీలు, 1999 ఆయుధ ఒప్పందానికి సంబంధించి ఆయన 18 ఆరోపణలు ఎదుర్కోవాలని ఆదేశించింది.

అంతే కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు ఉన్న సంబంధాలు కూడా వివాదాస్పదంగా మారాయి.

జాకోబ్ జుమా

ఫొటో సోర్స్, Sean Gallup

ఇప్పుడేం జరగొచ్చు?

పార్టీ విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ సాంకేతికంగా మాత్రం జుమా తన పదవికి రాజీనామా చేయకుండా అధ్యక్షునిగా కొనసాగవచ్చు.

అయితే తనను రీకాల్ చేసే ప్రతిపాదనను తిరస్కరించడం జుమాకు చాలా కష్టం కావచ్చు. పార్లమెంటులో ఆయన ఫిబ్రవరి 22న విశ్వాస తీర్మానాన్ని నెగ్గాల్సి ఉంటుంది.

ఇంతకు ముందే జుమా పలుమార్లు అలాంటి విశ్వాస తీర్మానాలను నెగ్గినా, ఈసారి మాత్రం అది కష్టం కావచ్చు.

దక్షిణాఫ్రికా మీడియా ఈ మొత్తం పరిణామాలను 'జెగ్జిట్'గా పేర్కొంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)