అనుమానాస్పద ఉత్తరం తెరిచి ఆసుపత్రి పాలైన ట్రంప్ కోడలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడి కోడలు వెనెసా ట్రంప్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఒక అనుమానాస్పద ఉత్తరాన్ని (లిఫాఫా) తెరిచిన వెంటనే ముందు జాగ్రత్త కోసం ఇలా చేశారు.
ఆ అనుమానాస్పద ఉత్తరంపై తెల్లని పౌడర్ పూసి ఉందని పోలీసులు చెబుతున్నారు.
ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మ్యాన్‌హటన్ చిరునామాకు ఈ ఉత్తరం చేరింది.
ఆ సమయంలో అక్కడున్న వెనెసా ట్రంప్ సహా మరో ఇద్దరిని అగ్నిమాపక దళం ఆసపత్రికి చేర్చింది.
అయితే ఈ పౌడర్ ప్రమాదకరమైందేమీ కాదని పరీక్షలో తేలినట్టు న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది.
ఆ పౌడర్ వల్ల వెనెసా ట్రంప్‌పై శారీరకంగా ఏ రకమైన ప్రభావం పడలేదని కూడా పోలీసులు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరంపై సాగుతున్న దర్యాప్తు
ఈ ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులను వీల్ కార్నెల్ మెడికల్ కాలేజిలో చేర్చినట్టు అగ్నిమాపక దళం తెలిపింది.
సీబీఎస్ న్యూయార్క్ కథనం ప్రకారం, ఈ ఉత్తరాన్ని వెనెసా ట్రంప్ తల్లి స్వీకరించారు. ఆ తర్వాత వెనెసా దాన్ని తెరిచారు.
వెనెసా ట్రంప్, ట్రంప్ జూనియర్‌ల వివాహం 2005లో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. పెళ్లికి ముందు వెనెసా న్యూయార్క్‌లో మోడలింగ్ చేసేవారు.
ట్రంప్ జూనియర్ కుటుంబానికి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఉత్తరంపై దర్యాప్తు జరుపుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








