ప్రెస్ రివ్యూ: సీఎంలలో 'కుబేరుడు' చంద్రబాబు.. నాలుగో స్థానంలో కేసీఆర్!

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
దేశంలోని 31 మంది సీఎంలలో అత్యంత సంపన్నుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు! చర, స్థిరాస్తులు రెండూ కలిపితే ఆయన వ్యక్తిగత సంపద రూ 177 కోట్లు. ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించిందని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
నివేదికలోని వివరాల ప్రకారం.. చంద్రబాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ. 42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ రెండూ కలిపితే చంద్రబాబు ఆస్తుల విలువ రూ.177,78,95,611 ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
చంద్రబాబు తర్వాత రెండో ధనిక సీఎం... అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఈయన ఆస్తుల విలువ రూ.129కోట్లకుపైగా ఉంది. మూడో స్థానం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌ది. ఈయన ఆస్తుల విలువ రూ.48 కోట్లకుపైగా ఉంది. ఇక 15 కోట్ల విలువైన ఆస్తులతో తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో ధనిక సీఎంగా ఉన్నారు.
మమతా బెనర్జీ దగ్గర ఒక్క రూపాయి కూడా విలువ చేసే స్థిరాస్తి లేకపోవడం విశేషం. ఏడీఆర్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం 11 మంది సీఎంలపై రకరకాల కేసుల నమోదయ్యాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Hydrabadtraficpolice/facebook
'జైళ్లలో మందుబాబుల సందడి'
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రధాన జైలులో ఇతరత్రా నేరగాళ్ల కంటే శిక్షపడిన మందుబాబుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వీరి బ్యారక్‌లన్నీ నిత్యం నిండిపోయి ఉంటున్నాయని 'ఈనాడు' తెలిపింది.
హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో నెలకు 1,100 మందికిపైగా మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారు. వీరిలో 500-800 మందికి ఒకరోజు నుంచి నెల వరకూ శిక్షలు పడుతున్నాయి.
ఇక సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జైలుశిక్ష పడుతున్నవారు ప్రతినెలా 350 మంది వరకూ ఉంటున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో జైలుశిక్ష పడినవారిని చంచల్‌గూడ జైలుకు... ఇతర కమిషనరేట్లలో చిక్కినవారిని చర్లపల్లి కారాగారానికి తరలిస్తున్నారు.
మందుబాబులను జైల్లోని ఇతర ఖైదీలతో కలిపి ఉంచట్లేదు. ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వీరితో మొక్కలకు నీరు పోయించడం, పారిశుద్ధ్య పనులు, గడ్డి తొలిగించే పనులను చేయిస్తున్నారు. అరెస్టుకు ముందు వారికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు.
జైలులోనూ... తప్పతాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై వీడియోలను చూపిస్తారు. మందు తాగకపోతే ఉండలేనివారికి జైలు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనవారిని ఎర్రగడ్డలోని ఐఎంహెచ్ సంస్థకు తరలిస్తున్నారని 'ఈనాడు' పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'గుండె'లు తీసిన బంట్లు
ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న గుండె ఆపరేషన్లలో కార్పొరేట్ ఆస్పత్రుల అక్రమాలకు లెక్కేలేదు. స్టెంట్‌లు, బైపాస్ సర్జరీల వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల నిర్వహణ అడ్డగోలుగా మారిందని 'సాక్షి' ఓ కథనాన్ని ప్రచురించింది.
గుండె ఆపరేషన్లపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కింది స్థాయి సిబ్బంది ఈ లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం ఉండడం లేదు.
లోపాలను సరిచేయకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే.. తమకు కాసులు వస్తే చాలన్నట్టు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి.
అవసరం లేకున్నా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అక్రమాలను నిరోధించాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు.
సాధారణంగా రోగులకు గుండె పనితీరు నిర్ధారణ పరీక్షలు (యాంజియోగ్రామ్) నిర్వహిస్తే వారిలో 60 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక స్టెంట్ అవసరం ఉంటుందని, ఇక రెండో స్టెంట్ అవసరం ఇంకా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆరోగ్యశ్రీ పరీక్షల్లో మాత్రం రెండో స్టెంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది రెండో స్టెంట్ వేసుకున్న వారి సంఖ్య ఏకంగా 50.80 శాతం వరకు నమోదైంది. అవసరం లేకున్నా రెండో స్టెంట్ అమర్చడంతో ఆరోగ్యశ్రీలో ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు వృథా అవుతున్నట్లు అంతర్గత విచారణలో నిర్ధారించారని 'సాక్షి' పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'రైలెక్కిన స్మగ్లింగ్ బంగారం'
స్మగ్లింగ్ బంగారం రూటు మార్చింది. అక్రమంగా రైలెక్కుతోంది. దేశాలు దాటి మన దేశంలోకి వస్తోంది. ఎన్ని కట్టుదిట్టాలు చేసినా ఏదో ఒక మార్గంలో చేరుతూనే ఉంది. విమానాల్లో తరలిస్తే దొరికిపోతుండటంతో లగేజీ తనిఖీలు జరగని రైలు మార్గంలో దేశం చేరుతోందని 'ఈనాడు'తెలిపింది.
ఇటీవల రైళ్లలో రవాణా చేస్తున్న బంగారం స్మగ్లర్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నప్పుడు ఈ అక్రమ దారులన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటిదాకా దుబాయ్ నుంచి స్మగ్లర్లు విమానాల్లో బంగారాన్ని భారత్‌కు తరలించేవారు. ఆ మార్గం కట్టుదిట్టం కావడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు వారి స్థావరాల్ని మయన్మార్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లకు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్ సరిహద్దుల్లోనే మయన్మార్ ఉంది. దీంతో స్మగ్లర్లు మయన్మార్ నుంచి బంగారాన్ని సులువుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి పంపుతున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన కొందరిని కొరియర్లుగా నియమించుకుని స్మగ్లింగ్ చేయిస్తున్నారు. తొలుత థాయ్‌లాండ్ స్థావరాల నుంచి మయన్మార్‌కు బంగారాన్ని తెస్తున్నారు.
అక్కడ పసిడిని బాగా వేడి చేసి కరిగించి వివిధ వస్తువుల అంతర్భాగాల్లో నింపేసి సీల్ చేసేస్తున్నారు. వాటిలో కొన్నింటిపై బర్మీస్ భాషలో అక్షరాలున్నాయి. దీంతో ఈ ప్రక్రియ మయన్మార్‌లోనే జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల భువనేశ్వర్, రాజమహేంద్రవరం, నెల్లూరు, కాలికట్, వారణాసి, కోల్‌కతాల్లో పట్టుబడ్డ బంగారం మొత్తం మయన్మార్ నుంచే భారత్‌లోకి ప్రవేశించినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలిందని 'ఈనాడు' పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?
- విదేశాంగ విధానం: భారత్ తోడు పెళ్లికూతురేనా?
- పెన్షన్‌కు భరోసా లేదు.. బతుక్కి భద్రత లేదు!
- అభిప్రాయం: మహిళలతో బాలీవుడ్ బంధం ఎలాంటిది?
- ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- పోర్న్ స్టార్ మియా మాల్కోవా సన్నీ లియోనిని మించి పోతారా!
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








