రాజ్‌మోహన్ గాంధీ: ‘ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే నేను చెప్పేది ఒకటే...'

రాజ్‌మోహన్ గాంధీ
    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే ఆయన మౌనం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెబుతానని మహాత్మాగాంధీ మనుమడు, రచయిత, చరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ అన్నారు.

రాజ్‌మోహన్ గాంధీ రాసిన 'ఇండియా ఆఫ్టర్ 1947: రిఫ్లెక్షన్స్ అండ్ రీకలెక్షన్స్' కొద్దిరోజుల కిందట ప్రచురితమైంది.

తాజాగా 'బీబీసీ'తో మాట్లాడిన రాజ్‌మోహన్ గాంధీ తన కొత్త పుస్తకంతో పాటు దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వంటి అనేక విషయాలను చర్చించారు.

ప్రధాన మంత్రి మిమ్మల్ని తేనీటి విందుకు పిలిస్తే ఆయనతో ఏం మాట్లాడుతారు? అని అడిగినప్పుడు ప్రధాని తనను పిలవడం అసాధ్యమని, ఒకవేళ తనను కనుక పిలిస్తే తప్పకుండా కలుస్తానని రాజ్‌మోహన్ గాంధీ చెప్పారు.

''మీరు మౌనంగా ఉండడం నన్ను బాధిస్తోంది. దేశంలో చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. పాపాలు జరుగుతున్నాయి. అయినా, మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది'' అని చెబుతానన్నారు.

'ఈ దేశం అందరిది. ఏ మతానికి చెందినవారికైనా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. వారి హక్కులను కాపాడాలి' అని చెబుతానన్నారు.

మోదీ కూడా తన ప్రతి ప్రసంగంలో ఇదే చెబుతారని నేను అన్నాను.. కానీ, రాజ్‌మోహన్ అందుకు అంగీకరించలేదు. మోదీ అందరికీ అండగా ఉంటానని ఎన్నడూ చెప్పలేదు.. తనకు అందరి అండదండలు కావాలని మాత్రమే ప్రసంగాలలో చెబుతారన్నారాయన.

modi

ఫొటో సోర్స్, Ani

స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరవాత ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్య మూలాలు బలహీనమయ్యాయని రాజ్‌మోహన్ గాంధీ అన్నారు.

'ప్రజాస్వామ్య సంస్థలు ఇబ్బందులలో ఉన్నాయి. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా రాసే పరిస్థితులు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ తగ్గిపోయింది'' అన్నారు.

అయితే, దేశ ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడేవారు ఆశ వదులుకోరాదని అన్నారాయన.

ప్రస్తుత మీడియా పరిస్థితీ అర్థం కావడం లేదని.. ఏం జరుగుతోందో తెలియడం లేదని అన్నారు.

రాజ్‌మోహన్ గాంధీకి మీడియాతో అనుబంధం ఉంది. ఆయన ముంబై కేంద్రంగా 1964లో హిమ్మత్ అనే పత్రికను 1981 వరకు నడిపించారు. ఎమర్జెన్సీ సమయంలో తన పత్రికలో ఆయన ఇందిరాగాంధీ తీరును తీవ్రంగా వ్యతిరేకించేవారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బలహీనపడిందని అంగీకిరిస్తూనే ప్రస్తుత నాయకత్వాన్ని ఆయన సమర్థించారు.

ప్రపంచవ్యాప్తంగా ఒకే వర్గపు ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోందన్నారు.

అమెరికా శ్వేత జాతీయులకే చెందుతుందని అక్కడ అంటుంటారన్నారు.

ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం గత శతాబ్దం చివరి వరకే పోరాటాలు జరిగాయని.. ఇప్పుడన్నీ ఒక వర్గం ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటాలని రాజ్‌మోహన్ చెప్పారు.

భారత్‌లో హిందూశక్తుల విజయానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. 'హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్నవారి వద్ద భారీగా డబ్బుంది. కాబట్టి వారితో తలపడడం ఏ రాజకీయ పార్టీకైనా కష్టమే' అన్నారాయన.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, TWITTER/@RAHULGANDHI

రాహుల్ గాంధీ కూడా సాధారణ మనిషేనని, ఆయన కూడా ఎలాంటి మేజిక్కులూ చేయలేరని అన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ భావజాలానికి.. గాంధీ, నెహ్రూ, పటేల్, ఆజాద్‌ల కాలంనాటి భావజాలానికి మార్పేమీ రాలేదని.. కానీ, భావజాలం మారిందంటూ కాంగ్రెస్ నేతలే మాట్లాడుతుంటే ప్రజలు కూడా అలాగే అనుకునే ప్రమాదం ఉందన్నారు రాజ్‌మోహన్.

దేశంలోని లక్షలాది మంది సెక్యులర్ హిందువులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు విశ్వసించడం లేదని ప్రశ్నించగా రాహుల్ గాంధీకి అలాంటి భయాలేవీ లేవన్నారాయన. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సమర్థిస్తూ మాట్లాడారు రాజ్‌మోహన్ గాంధీ.

రాహుల్ భావజాలం చాలా స్పష్టంగా ఉందని.. ఆయన ఎక్కడికక్కడ ఆగుతూ ప్రజలతో మాట్లాడుతున్నారని చెప్పారు. అయితే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం తీరుపై ఆయన పెదవి విరిచారు. మరోవైపు రాహుల్ యాత్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎన్నికలపరమైన ప్రభావాన్ని చెప్పలేమని, కానీ, దేశ ప్రజల ఆలోచనలపై ప్రభావం చూపనుందన్నారు.

kejriwal

ఫొటో సోర్స్, Aap

‘ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రెండు లోపాలు’

ఆమ్ ఆద్మీ పార్టీ గురించి రాజ్‌మోహన్ గాంధీ మాట్లాడుతూ... దిల్లీలో ఆప్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసిందని, అయితే, ప్రధానంగా ఆ పార్టీలో రెండు లోపాలున్నాయన్నారు. రాజ్యాంగ హక్కులు, హిందూముస్లిం సమానత్వం గురించి ఆప్ నాయకులు మాట్లాడరని చెప్పారు. దీంతోపాటు ఆప్ కూడా ఒకే వ్యక్తి నడిపే పార్టీ అని ఆయన అన్నారు.

బీజేపీకి ఆప్ బీ టీం అనే విమర్శలపైనా ఆయన మాట్లాడారు. ఆప్‌లో కొందరు ఆర్ఎస్ఎస్ భావజాలం గలవారు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య కాంక్ష ఉన్నవారూ ఉన్నారన్నారు. అయితే, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించకపోవడం ఆ పార్టీ బలహీనత అన్నారాయన.

ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినప్పుడు రాజ్‌మోహన్ గాంధీ ఆ పార్టీతో బంధాన్ని సాగించారు. అంతేకాదు.. 2014లో ఆయన తూర్పు దిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం జరిగారు.

రాజ్‌మోహన్ గాంధీ కొత్త పుస్తకం

'అఖండ భారత్'ను వారు నిజంగా కోరుకోవడం లేదు'

అఖండ భారత్ గురించి మాట్లాడేవారు.. భారత్ ముక్కలైందంటూ అందుకు గాంధీ, నెహ్రూలను బాధ్యులుగా చేస్తూ ఆరోపణలు చేసేవారు వాస్తవంలో అఖండ భారత్‌ను కోరుకోవడం లేదని తన పుస్తకంలో రాశారు రాజ్‌మోహన్.

'దేశ విభజన తరువాత భారత్‌లో ఉన్నవారు కష్టాలుపడింది నిజమే. ప్రస్తుతం భారత్‌లో 14 శాతం ముస్లింలు ఉన్నారు. అఖండ భారత్ ఏర్పడితే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా కలిసి ముస్లిం జనాభా 35 శాతానికి చేరుతుంది. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడేవారికిఇది నచ్చదు. అందుకే వారు అఖండ భారత్ ఏర్పాటుకు బద్ధ శత్రువులు' అని రాశారాయన.

జిన్నా, గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

రాజ్‌మోహన్ తన పుస్తకం మొదటి అధ్యాయంలో రాముడి గురించి రాశారు. 'గాంధీకి రాముడి పేరు అంటే ఇష్టం. నా సోదరులలో ఒకరి పేరు రామచంద్ర. గాంధీకి నచ్చిన రాముడు జగద్గురువు. కానీ, గత 20-30 ఏళ్లలో ప్రచారంలో ఉంటున్న రాముడు వేరు. వాల్మీకి, కంబన్, తులసీదాస్, అల్లామా ఇక్బాల్, మహాత్మా గాంధీ చెప్పిన రాముడికి ప్రస్తుతం కొందరు సృష్టిస్తున్న రాముడి ఇమేజ్‌కు చాలా తేడా ఉంది' అన్నారాయన.

'ఒక శత్రువును(ముస్లిం) వారు సృష్టించాలనుకుంటారు. ఆ శత్రువుకి వ్యతిరేకంగా రాముడిని నిలపాలనుకుంటారు' అన్నారాయన.

అయితే, దేశంలోని హిందువులకు నిజమైన రాముడేంటో తెలుసని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)