ఒంగోలు హైవే హత్యల కేసులో 12 మందికి ఉరిశిక్ష.. ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

ఒంగోలు

ఒంగోలులోని 8వ సెషన్సు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

హైవే హత్యల కేసులో ప్రధాన నిందితుడు మున్నాతో పాటుగా 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

2008లో ప్రకాశం జిల్లాలో హైవేపై జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి.

తొలుత ఆధారాలు కూడా లభించకపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.

అప్పటికే నేర చరిత్ర కలిగిన అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా అనే నిందితుడు జాతీయ రహదారిపై వాహనాలను అధికారుల పేరుతో ఆపి, దోపిడీ చేసి, ఆపై లారీలను విడిభాగాలుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

అప్పట్లో దామోదర్ అనే పోలీస్ అధికారికి లభించిన చిన్న ఆధారంతో జరిపిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు మున్నా గ్యాంగ్ మద్దిపాడు సమీపంలో ఓ పాత గోడౌన్ అద్దెకు తీసుకుని లారీలోని సరుకుతో పాటుగా, లారీలను కూడా విడిభాగాలుగా చేసి అమ్మినట్లు దర్యాప్తులో తేలింది.

దానికి ముందే లారీలు ఆపిన వెంటనే అందులో ఉన్న వారి వద్ద నుంచి విలువైన సరుకులన్నీ దోచుకుని వారిని హత్య చేసి అటవీ ప్రాంతంలో ఎవరికీ కనిపించని ప్రాంతంలో పాతిపెట్టినట్టుగా గుర్తించారు.

మున్నా

ఫొటో సోర్స్, ugc

పోలీసులకు సమాచారం అందడంతో మున్నా అరెస్టు భయంతో కొన్నాళ్లు బెంగళూరు వెళ్లిపోయినట్టు గుర్తించారు. చివరకు కర్నూలు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

అప్పట్లో మున్నా అరెస్టును అడ్డుకునేందుకు కొందరు రాజకీయ నేతలు కూడా ప్రయత్నించడం కలకలం రేపింది. చివరకు మున్నాని అరెస్ట్ చేసిన పోలీసులు అతని గ్యాంగ్‌ని కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.

సుమారు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు దర్యాప్తు, కోర్టు విచారణ తర్వాత తుది తీర్పు వెలువడింది.

ఈ తీర్పులో మున్నాతో పాటుగా అతని అనుచరుల మీద ఆరోపణలకు ఆధారాలు లభించడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ భాస్కర్ బీబీసీకి తెలిపారు.

దీనికి సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 3 కేసుల్లో తీర్పు వచ్చింది.

వాటిలోనే ఉరిశిక్ష విధించడంతో మిగిలిన కేసుల విషయం కూడా ఉత్కంఠ రేపుతోంది.

విశాఖ జిల్లా: అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన జనం

అనన్య అమ్మోనియా కంపెనీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అనన్య అమ్మోనియా కంపెనీ

విశాఖ జిల్లాలోని ఒక అమ్మోనియా కంపెనీలో ఆదివారం(మే 23) రాత్రి గ్యాస్ లీక్ కావడంతో జనం భయపడిపోయారు.

విశాఖ జిల్లా పరవాడ మండలంలోని భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీకయ్యింది.

ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

గ్యాస్ లీకవడం వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెప్పారు.

కంపెనీ మూసేయాలని నినాదాలు చేస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కంపెనీ మూసేయాలని నినాదాలు చేస్తున్న స్థానికులు

గ్యాస్ లీకవడంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు అనన్య కంపెనీని మూసివేయాలని ధర్నా చేపట్టారు.

ఆ సమయానికి కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో, దీనిపై పోలీసులతో చర్చించిన గ్రామస్థులు తిరిగి వెళ్లిపోయారు.

రాత్రి చీకట్లో ఏం జరుగుతోందో అర్థం కాకపోవడంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు.

ఇది కూడా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలానే, మారుతుందేమోనని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)