దేశంలో కరోనా మృతుల సంస్మరణ కోసం ఆన్‌లైన్ మెమోరియల్

భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి

కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంస్మరణ కోసం కొందరు వైద్యులు, సామాజిక కార్యకర్తలతో కూడిన బృందం ఒక ఆన్‌లైన్ మెమోరియల్‌ను ప్రారంభించింది.

మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వర్చువల్ మెమోరియల్‌లో తమ నివాళులు అర్పించటానికి వీలుంటుంది.

భారతదేశంలో ఇప్పటివరకూ 1,54,000 మందికి పైగా కోవిడ్ వల్ల చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇటీవలి నెలల్లో కొత్త కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.

ఈ ఆన్‌లైన్ మెమోరియల్‌ను నిర్వహించటానికి సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సాయం చేస్తారు.

నేషనల్ కోవిడ్ మెమోరియల్ డాట్ ఇన్ - nationalcovidmemorial.in – వర్చువల్ మెమోరియల్‌ను కొందరు వైద్యుల బృందం సారథ్యంలోని కోవిడ్ కేర్ నెట్‌వర్క్ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ గత వారాంతంలో కోల్‌కతాలో ఆవిష్కరించింది.

ఈ సైట్‌లో ఇప్పటికే నివాళులు పోస్ట్ చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మరణ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయటమో, లేదంటే ధృవీకరించుకోవటానికి వీలుగా తమ ఫోన్ నంబర్‌ను అందించటమో చేయాల్సి ఉంటుంది.

కరోనా మృతుల సంస్మరణ కోసం ఆన్‌లైన్ మెమోరియల్

ఫొటో సోర్స్, National Covid Memorial

‘‘మహమ్మారికి బలైన తమ ప్రియతముల జ్ఞాపకాలను సజీవంగా ఉంచటం కోసం ఈ నేషనల్ కోవిడ్ మెమోరియల్‌ను ప్రారంభించాం. ఇందులో భారతీయులందరూ చేరవచ్చు’’ అని సదరు నెట్‌వర్క్ ప్రతినిధి డాక్టర్ అభిజిత్ చౌదురి చెప్పారు.

‘‘కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో చనిపోయి, తమ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం లేకుండా అంత్యక్రియలు పూర్తైన వారికి కొంతైనా గౌరవాన్ని ఈ మెమోరియల్ పునరుద్ధరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి అంత్యక్రియలకు వారి కుటుంబ సభ్యులను చాలా వరకూ అనుమతించలేదు. ఆ సమయంలో వివక్ష, భయం ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ వైద్యుడు కోవిడ్ కారణంగా చనిపోయినపుడు ఆయన మృతదేహాన్ని సమాధి చేయటాన్ని ఒక బృందం హింసాత్మకంగా అడ్డుకుంది.

ఈ వైరస్ వల్ల చనిపోయిన ‘‘పేదలు, అభాగ్యుల’’కు నివాళులు సమీకరించటానికి వలంటీర్లు, ఎన్‌జీఓలు, పాత్రికేయులు అవసరమవుతారని ద హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎన్.రామ్ పేర్కొన్నారు.

‘‘ఈ మెమోరియల్ సమ్మిళతంగా ఉండాలి. మనం ఏ ఒక్కరినీ వదిలివేయకూడదు’’ అన్నారాయన.

మరణించిన వారి సంస్మరణ సంప్రదాయం భారతదేశంలో లేదని ఈ మెమోరియల్ వ్యవస్థాపకులకు సలహాదారుగా వ్యవహరిస్తున్న వైద్యుడు వి.మోహన్ పేర్కొన్నారు.

‘‘స్మారకాల సంప్రదాయం మనకు లేదు. చనిపోయినవారిని మేం గుర్తుచేసుకోం. కోవిడ్ కలిగించిన విషాదం, మానసిక వేదన ప్రభావిత కుటుంబాలలో దశాబ్దాల పాటు కొనసాగుతుంది. అలాంటి ప్రజలు సందర్శించటానికి, తమ జ్ఞాపకాలను మళ్లీ జీవించటానికి ఈ వర్చువల్ మెమోరియల్ ఒక కేంద్రం అవుతుంది. ఇది ఒక జాతీయ ఉద్యమం కావాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)