బర్డ్ ఫ్లూ: లక్షల సంఖ్యలో చనిపోతున్న కోళ్లు, కాకులు.. ఈ వైరస్ మనుషులకూ సోకుతుందా?

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ప్రవీణ్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్‌కు కళ్లెం పడకముందే మరో వైరస్ వ్యాపిస్తోంది. భార‌త్‌లోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలో పెద్ద సంఖ్యలో పక్షులు అకస్మాత్తుగా చనిపోయాయి. దీంతో బర్డ్‌ ఫ్లూ వ్యాపిస్తోందనే అనుమానాలు తలెత్తాయి.

బర్డ్ ఫ్లూ వల్లే పెద్ద సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయని కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సోమవారం ధ్రువీకరించాయి.

మధ్యప్రదేశ్‌లో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్థారించారు. ఇవే కాకుండా మహరాష్ట్ర, గుజరాత్‌నుంచి కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

పాంగ్‌డామ్ చుట్టుపక్కల వలస పక్షుల్లో

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్‌డామ్ ప్రాంతం బర్డ్ ఫ్లూకు కేంద్రంగా ఉందని, సోమవారంనాటికి సుమారు 2,400 వలస పక్షులు చనిపోయాయని రాష్ట్ర పశు సంవర్థక విభాగంలో సీనియర్ వెటర్నరీ పాథాలజిస్ట్, బర్డ్ ఫ్లూ నేషనల్ కన్సల్టెంట్ డాక్టర్ విక్రం సింగ్ తెలిపారు.

"ఈ ఆనకట్టకు చుట్టుపక్కల 10 కి.మీ. వరకూ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ లేనందువల్ల ఇప్పటికి ఇంకా పౌల్ట్రీ పక్షుల్లో బర్డ్ ఫ్లూ కనిపించడం లేదు" అని ఆయన అన్నారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేరళలో చనిపోయిన పక్షుల్ని బాతుల్ని చూపిస్తున్న స్థానికులు

చేపల అమ్మకంపై నిషేధం

పాంగ్‌డామ్ సమీపంలో చేపల అమ్మకం, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఇక్కడి వలస పక్షుల ద్వారా నీటిలో చేపలకు కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని అంటున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా పౌల్ట్రీ అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. మాంసం కోసం పౌల్ట్రీ పక్షుల వినియోగాన్ని నిరోధించారు.

చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిషేధించారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

ఇండోర్‌లోని కాకుల్లోనూ..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో కాకులు చనిపోతున్నాయి. వాటిల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు.

"ఇండోర్‌లో ఉన్న డాలీ కాలేజ్ క్యాంపస్‌లో రాత్రిపూట కాకులు నివాసముంటాయి. వారం రోజులుగా ఇక్కడ రోజూ పొద్దున్నే 20-30 కాకులు చనిపోయి ఉండడం గమనించాం. వాటిని పరీక్షకోసం భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ పంపించాం. చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలింది. ఆదివారంనాటికి 114 కాకులు చనిపోయాయి" అని ఇండోర్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ (వెటర్నరీ సర్వీసెస్) డాక్టర్ జీఎస్ డాబర్ తెలిపారు.

ఇండోర్ డివిజన్‌లో ఇంకెక్కడైనా ఇలాంటి సంఘటనలు సంభవిస్తే, వెంటనే తెలియజేయాల్సిందిగా ఒక ప్రకటన జారీ చేశామని డా. డాబర్ తెలిపారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

మధ్యప్రదేశ్‌లో హై అలర్ట్..

మధ్యప్రదేశ్‌లో కాకులు ఎక్కువగా ఉండే చోట డిసిన్ఫెక్షన్ మందులు జల్లుతూ, చెట్ల కింద మనుషులు కూర్చోవడం, నిల్చోవడం చెయ్యొద్దని చెప్తున్నారు. అలాగే చనిపోయిన పక్షులను జాగ్రత్తగా పాలథీన్ కవర్లలో ఉంచి, భూస్థాపితం చేసే చర్యలు చేపడుతున్నారు.

ఇండోర్‌లో మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్‌లో ఖండ్వా, బార్వానీ, మాండ్సౌర్, నీముచ్, సిహోర్, రైసన్, ఉజ్జయినితో సహా అనేక చోట్ల పక్షులు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ రాష్ట్రంలో కాకులే కాకుండా కొంగలు కూడా చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బార్వానీలో పావురాలు చనిపోతున్నట్లు వార్తలు వచ్చాయి.

"రాత్రిపూట కాకులు పెద్ద సంఖ్యలో నివాసముండేచోట, భూమి కింద దుంపల ద్వారా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అందుకే ఆయా ప్రాంతాల్లో సున్నం జల్లి శుభ్రం చేసి తరువాత హైపోక్లోరైడ్ క్రిమి సంహారక మందులు జల్లాలని ఆరోగ్య, అటవీ, మునిసిపల్ కార్పొరేషన్, పశువైద్య విభాగానికి సూచనలు జారీ చేశాం"అని డా. డాబర్ తెలిపారు.

బర్డ్ ఫ్లూ కారణంగా మధ్యప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు. దీనికోసం ఒక కంట్రోల్ రూమును కూడా కేటాయించారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేరళలోని అళప్పుజలో మరణించిన బాతులు

హరియాణాలో కోళ్లల్లో బర్డ్ ఫ్లూ గుర్తించారు

హరియాణాలోని బార్వాలాలో గత కొద్ది రోజుల్లో సుమారు లక్ష కోళ్లు చనిపోయాయి. దీనికి కారణం బర్డ్ ఫ్లూ అని అనుమానిస్తున్నారు.

రాజస్థాన్‌లో పెద్ద సంఖ్యలో కాకులు మరణిస్తున్నాయి. దీనికి కూడా బర్డ్ ఫ్లూ కారణమని అంటున్నారు.

కేరళలోని కొన్ని బాతుల్లో బర్డ్ ఫ్లూ బయటపడింది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో

బర్డ్ ఫ్లూ ఎందుకు వ్యాపిస్తోంది? కారణాలేంటి?

"హెచ్5ఎన్1 లేదా హెచ్7లాంటి అన్నిరకాల బర్డ్ ఇంఫ్లుయెంజాలు సహజంగా, ప్రకృతిసిద్ధంగా పుడతాయి. జీవావరణ, పర్యావరణ సమస్యల వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పక్షుల్లో ఇది వృద్ధి చెందుతుంది”అని డా. విక్రం సింగ్ తెలిపారు.

అయితే ప్రస్తుతం వివిధ జిల్లాల్లోని పక్షుల్లో ఈ వైరస్ వ్యాప్తికి కారణాలేమిటో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియలేదని ఆయన అన్నారు.

శీతాకాలంలో ఇండోర్‌కు బయటనుంచీ పెద్ద సంఖ్యలో కాకులు వలస వస్తాయని, దాని కారణంగా వైరస్ వ్యాపించి ఉండొచ్చని డా. సింగ్ అన్నారు.

అయితే ఈ వైరస్ పరివర్తనం (మ్యుటేట్) చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో పౌల్ట్రీలో కనిపించేది బర్డ్ ఫ్లూ హెచ్5ఎన్1 వైరస్. కానీ ఇప్పుడు కాకుల్లో గుర్తించినది మ్యుటేట్ అయిన హెచ్5ఎన్8 వైరస్.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, ANI

ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరం?

బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇంఫ్లుయెంజా అనేది పక్షులనుంచీ పక్షులకు సులువుగా వ్యాపిస్తుంది. వాటికి ఇది ప్రాణాంతకమైన వ్యాధి.

అలాగే, పక్షులనుంచీ మానవులకు లేదా జంతువులకు సోకితే కూడా ప్రాణాంతకమవుతుందని రుజువైంది.

ఈ బర్డ్ ఫ్లూ మొట్టమొదట 1997లో బయటపడింది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారినపడినవారిలో 60 శాతం మంది మరణించారు.

అయితే, ఇది మిగతా హ్యూమన్ వైరస్‌లలా ఒక మనిషినుంచీ మరో మనిషికి అంత సులువుగా వ్యాపించదు. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది మనిషినుంచీ మనిషికి వ్యాపించిన దాఖలాలు ఉన్నాయి. అది కూడా బాగా సన్నిహితంగా ఉన్నవారిలోనే ఇది ఒకరినుంచీ ఒకరికి వ్యాపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)