తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం - Newsreel

ఫొటో సోర్స్, fb/KCR
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు, రోజువారీ వేతనం అందుకునే సిబ్బంది, శాశ్వత కాంటింజెంట్ ఉద్యోగులు, తాత్కాలిక కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని ప్రకటించినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని అవసరమైతే ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.
ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా అధికారుల సంఘాన్ని నియమించారు.

ఫొటో సోర్స్, FB/JDSpartyofficial
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ 'ఆత్మహత్య': కారు దిగివెళ్లారు, ఇక తిరిగి రాలేదు
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ నాయకుడు ఎస్ఎల్ ధర్మేగౌడ చిక్కమగలూరులోని ఓ రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించారు. మంగళవారం ఉదయం ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామని, ఆయన జేబులో ఆత్మహత్య లేఖ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ధర్మేగౌడ వయసు 65 ఏళ్లు. కాడూరు తాలుకాలోని మంకెనహల్లి రైల్వే ట్రాక్ వద్ద ఆయన మృతదేహం కనిపించింది.
‘‘ప్రైవేటు కారులో ఆయన అటువైపు వెళ్లారు. సాయంత్రం 6.45 సమయంలో హోన్‌సాగర గ్రామంలో దిగిపోయారు. ఇక తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆయన జాడను వాళ్లు గుర్తించారు. రాత్రి రెండు గంటలకు మాకు ఈ విషయం తెలిసింది’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి బీబీసీతో చెప్పారు. రవిది కూడా చిక్కమగలూరే.
‘‘ఆయన ఆత్మహత్య లేఖను నేను చూశా. ఆస్తి పంపకాల గురించి అందులో రాశారు. కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కూడా కోరారు’’ అని ఆయన చెప్పారు.
రెండు వారాల క్రితం ధర్మేగౌడ వార్తల్లో అంశంగా ఉన్నారు. శాసనమండలిలో ఛైర్మన్ కుర్చీలో ఎవరు కూర్చోవాలన్న అంశమై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.
శాసన మండలి ఛైర్మన్ స్థానం నుంచి ప్రతాప్ చంద్ర శెట్టిని తొలగించేందుకు జేడీఎస్, బీజేపీ సభ్యులు చేతులు కలిపారు.
ధర్మేగౌడ ఛైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను లాగి, శెట్టిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. వరోవైపు బీజేపీ సభ్యులు మాత్రం ధర్మేగౌడను లేవకుండా ఆపుతూ కుర్చీలో కూర్చోబెట్టారు.
ధర్మేగౌడ పంచాయతీ స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు. ఆయన సోదరుడు ఎస్ఎల్ భోజేగౌడ ఎంఎల్ఏగా ఉన్నారు.
ధర్మేగౌడ మృతి పట్ల మాజీ ప్రధాని దేవే గౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమార్ స్వామి విచారం వ్యక్తం చేశారు.
‘‘శాసనమండలిలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోవద్దని ఆయనకు చెప్పాను. కానీ, ఆయన కలత చెందారు. నేటి విలువలు లేని, కలుషిత, స్వార్థపూరిత రాజకీయాలకు ఆయన బలయ్యారు. ఛైర్మన్ పదవి కోసం జేడీఎస్ లౌకికవాదాన్ని పరీక్షించాలనుకున్నవారికి సమాధానం దొరికిందనుకుంటా’’ అని కుమార స్వామి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రజినీకాంత్:'ఆరోగ్యం బాగులేదు.. నేను పార్టీ పెట్టను'
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ తాను ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ పార్టీని పెట్టబోవడంలేదని మంగళవారం ప్రకటన చేశారు.
అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
డిసెంబరు 31న పార్టీ ప్రకటనతో ముందుకు వస్తానని ఇటీవల రజినీకాంత్ ప్రకటించారు.
ఆ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రజినీ తాజా ప్రకటన చేశారు.
ఇటీవల ఆయన హైదరాబాద్‌లో సినిమా షూటింగులో ఉండగా స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు.
రక్తపోటులో హెచ్చుతగ్గుల వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఆయనకు విశ్రాంతి అవసరం అని సూచించాయి.
రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్న అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు.
రజినీ కాంత్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం ఇదీ
''నేను జనవరిలో పార్టీ పెడతానని ఇంతకుముందు ప్రకటించాను. ఆ తరువాత ఇటీవల డాక్టర్ల సలహా పక్కన పెట్టి సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాను.
అక్కడ షూటింగు స్పాట్‌లో మేం 120 మంది వరకు ఉన్నాం. కోవిడ్‌కు సంబంధించి నిబంధనలన్నీ పాటిస్తూనే ప్రతి రోజూ టెస్టులు చేసేవాళ్లం. అయినా నలుగురికి కరోనావైరస్ సోకింది.
దాంతో ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేయించడం కోసం మా డైరెక్టరు వెంటనే షూటింగు ఆపేశారు.
నాకు కూడా రక్తపోటు సంబంధిత సమస్యలు వచ్చాయి. నాకు ఇప్పటికే మూత్రపిండాల మార్పిడి జరగడంతో ఇది నాకు ఇబ్బందికరం. దాంతో డాక్టర్ల సలహా మేరకు మూడు రోజులు వారి అబ్జర్వేషన్‌లో ఉన్నాను.
నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినీ నిర్మాత కళానిధి మారన్ షూటింగ్ వాయిదా వేశారు.
అందువల్ల చాలామందికి ఉపాధి పోయింది.. నిర్మాతలకు కూడా కోట్ల నష్టం వచ్చింది. ఇదంతా నా ఆరోగ్యం కోసం చేశారు.
దేవుడు నుంచి వచ్చిన హెచ్చరికగా భావిస్తున్నాను దీనిని.
మీడియా, సోషల్ మీడియా గ్రూపులలో కనిపిస్తూ పార్టీని నడిపించి గెలవలేం.. ప్రజల్లోకి వెళ్లకుండా వారు కోరుకుంటున్నట్లుగా నా పాలన తేలేను.
రాజకీయ అనుభవం ఉన్నవారెవరైనా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారు.
నేను లక్షలు లక్షలుమంది ప్రజలను కలవాలనుకుంటున్నాను.
కానీ, 120 మంది ఉన్న చోటే నలుగురికి కరోనా వచ్చింది.. నేను కూడా ఆసుపత్రి పాలయ్యాను. పైగా ఇప్పుడు దేశంలో కరోనాలో కొత్త వేరియంట్, సెకండ్ వేవ్ ఉన్నాయి .
వ్యాక్సీన్ వచ్చినా కూడా నాలా అనారోగ్య సమస్యలున్నవారు కరోనా వేళ బయటకు వెళ్లరాదు.
ఇదంతా నాతో కలిసి నడిచే అనేక మందిని ఇబ్బందిపాలుచేయొచ్చు.
కాబట్టి ప్రస్తుతానికి నేను రాజకీయాల్లోకి రాలేను.
గత మూడేళ్లుగా నా 'మక్కల్ మాండ్రమ్'లో పనిచేస్తున్నవారంతా ఎంతో కష్టపడ్డారు.
వారి కష్టం ఊరికే పోదు.. భవిష్యత్తులో పనికొస్తుంది.
నవంబరు 30న నేను మిమ్మల్ని కలిసినప్పుడు నా ఆరోగ్యమే ముఖ్యమని.. అందుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని మీరంతా చెప్పారు. మీ మాటలు నేను ఎన్నటికీ మర్చిపోను. మీ అందరికీ ధన్యవాదాలు. రజినీ మక్కల్ మాండ్రమ్ ఎప్పటిలాగే పనిచేస్తుంది.
ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండా నేను ప్రజల కోసం పనిచేస్తాను.
నిజం మాట్లాడడానికి నేను ఎన్నడూ భయపడను. నన్ను అభిమానించేవారంతా నా నిర్ణయాన్ని అంగీకరించాలని కోరుతున్నాను''

ఫొటో సోర్స్, Ani
రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం
మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును 200 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్, విజయం కోసం కావల్సిన 70 పరుగులను 2 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో సాధించింది.
70 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, ఈ మ్యాచ్‌ను పది వికెట్ల తేడాతో గెలుస్తుందని అంతా భావించారు.
కానీ, టీమిండియా మయాంక్ అగర్వాల్(15) చతేశ్వర్ పుజారా(3) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. చివరకు ఓపెనర్ శుభ్‌మన్ గిల్(35 ), కెప్టెన్ అజింక్య రహానే(27) మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు.
నాలుగో రోజు 136/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 103.1 ఓవర్లు ఆడి 200 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీంతో ఆతిథ్య జట్టుకు 69 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. టెయిలెండర్ల పోరాటంతో ఆసీస్ ఆ స్కోరైనా చేయగలిగింది. చివరి నాలుగు వికెట్లతో జట్టు 101 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఉమేష్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
మొత్తం నాలుగు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్ట్ ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్ట్‌లో భారత్ గెలిచింది.

ఫొటో సోర్స్, Twitter/ramcharan
టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేశారు.
పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా హోం క్వారంటైన్ అయ్యానని రామ్‌చరణ్ చెప్పారు.
త్వరలో నయం అవుతుందని, దృఢంగా బయటకు వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని, తను కోలుకోగానే మరిన్ని అప్‌డేట్స్ చెబుతానని చరణ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈనెల 25న రామ్‌చరణ్ తన కుటుంబ సభ్యులందరూ హాజరైన క్రిస్‌మస్ పార్టీలో పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ పార్టీలో ఇటీవల పెళ్లి చేసుకున్న నీహారిక జంటతోపాటూ మెగా ఫ్యామిలీ హీరోలు, మిగతా బంధువులు ఉన్నారు.

ట్రంప్ వల్ల అమెరికా భద్రతా ఏజెన్సీలకు 'అపార నష్టం': జో బైడెన్
అమెరికా భద్రతలో అత్యంత కీలకమైన ఏజెన్సీలకు ట్రంప్ పాలనలో అపార నష్టం జరిగిందని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు.
అధికార మార్పిడి జరగబోతున్న సమయంలో తన బృందం రక్షణ శాఖతోపాటూ తమకు అవసరమైన ఏ సమాచారాన్నీ పొందలేకపోతోందని ఆయన చెప్పారు.
జాతీయ భద్రత, విదేశాంగ విధానాల సహాయకుల బ్రీఫింగ్ తర్వాత మాట్లాడిన ఆయన ఈ ఆరోపణలు చేశారు.
జో బైడెన్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించబోతున్నరు. కానీ, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి ట్రంప్ నిరాకరించారు.
నవంబర్ 3న ఎన్నికల తర్వాత కొన్ని వారాలకు, అధ్యక్షుల అధికార మార్పిడిలో భాగంగా కీలకమైన నిఘా సమాచారం తెలుసుకోకుండా బైడెన్‌ను అడ్డుకున్నారు.
"అధికార మార్పిడి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు అధికారులు అత్యంత ప్రొఫెషనలిజంతో పనిచేస్తున్నారని" బైడెన్ వ్యాఖ్యల తర్వాత మాట్లాడిన తాత్కాలిక రక్షణ మంత్రి క్రిస్టఫర్ మిల్లెర్ అన్నారు.
"రక్షణ శాఖ 400 మంది అధికారులతో 164 ఇంటర్వ్యూలు నిర్వహించింది. బైడెన్ బృందం కోరిన దానికంటే ఎక్కువగా 5 వేల పేజీలకు పైగా పత్రాలను వారికి అందించింది" అని చెప్పారు.
బైడెన్ బృందంతో పెంటగాన్ పూర్తిగా పారదర్శకతతో వ్యవహరిస్తున్నట్లు ఒక ప్రతినిధి చెప్పారు.
రక్షణ శాఖ, బడ్జెట్ నిర్వహణ కార్యాలయంలో తన బృందానికి అడ్డంకులు ఎదురవుతున్నట్లు తన సలహాదారులతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రసంగంలో బైడెన్ ఆరోపించారు.
"తప్పుకుంటున్న పాలకుల నుంచి కీలకమైన జాతీయ భద్రతకు సంబంధించి అవసరమైన మొత్తం సమాచారాన్ని మేం ప్రస్తుతం పొందలేకపోతున్నాం. ఇది నా దృష్టిలో బాధ్యతారాహిత్యం కంటే తక్కువేం కాదు" అని బైడెన్ అందులో అన్నారు.
"ప్రస్తుత పరిస్థితిని అమెరికా శత్రువులు ఏదైనా గందరగోళం సృష్టించేందుకు అనుకూలంగా మార్చుకోకుండా ఉండాలంటే, ప్రపంచవ్యాప్తంగా మోహరించిన దళాల గురించి మా బృందానికి స్పష్టమైన వివరాలు అవసరం" అని ఆయన చెప్పారు.
మన భద్రతకు కీలకమైన చాలా ఏజెన్సీలు అపార నష్టాన్ని ఎదుర్కున్నాయని ఆయన అన్నారు.
"వారిలో చాలామంది సైనికులు సామర్థ్యం, ధైర్యం కోల్పోయారు. విధాన ప్రక్రియలు తీవ్రంగా దెబ్బతిన్నాయి లేదంటే వాటిని నిర్లక్ష్యం చేశారు" అని ఆయన ఆరోపిచాంరు.
ఇవి కూడా చదవండి:
- కరోనాతో ప్రపంచం తలకిందులవుతున్న వేళ ఈ ఐదుగురు రూ. 22 వేల కోట్లు వెనకేసుకున్నారు
- కోవిడ్-19 లాక్డౌన్: ఫిలిప్పీన్స్‌లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








