పెద్ద పులుల ఆహారం కోసం కవ్వాల్ అడవిలో వదిలిన వందలాది జింకలు ఏమయ్యాయి? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
పెద్ద పులుల ఆహారం కోసం వదిలిన వందలాది జింకలు ఏమయ్యాయి? నిజంగానే పెద్దపులులకు ఆహారమయ్యాయా? వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాయా? అనే విషయమై అటవీశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అటవీ సమీప గ్రామాల్లోని పశువులు పులి వేటకు బలవుతుండటం, ఇద్దరు మృత్యువాత పడటం తదితర పరిణామాల నేపథ్యంలో జింకల వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో కవ్వాల్ అభయారణ్యం విస్తరించి ఉన్నది. ఇక్కడికి 2015 నుంచి పెద్దపులుల వలస పెరిగింది. వాటికి ఆహారం కోసం హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, వనస్థలిపురంలోని మహావీర్ హరిణవనస్థలి జాతీయ పార్కు, శామీర్‌పేట పార్కు నుంచి దాదాపు 400 జింకలను గత ఏడాది కాలంలో దశలవారీగా తరలించారు.
వాటిలో చుక్కల జింకలు, దుప్పులు ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే కవ్వాల్‌లో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న వేటగాళ్లు కుక్కల సహాయంతో జింకలు, దుప్పులను వేటాడుతున్నట్టు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు.
కవ్వాల్ అభయారణ్యంలోకి పెద్ద పులుల వలస పెరుగడంతో కొత్త సవాళ్లు మొదలయ్యాయి. వాటి ఆకలి తీర్చే వన్యప్రాణుల (ప్రే యానిమల్) సంతతి పెరగకపోవడం సమస్యగా మారింది. ఇక్కడికి వచ్చిన పెద్ద పులులు అటవీ ప్రాంతంలోని నీల్గాయ్, అడవి పందులు, జింకలతో సహా మేతకు వచ్చిన పశువులపైనా దాడి చేస్తున్నాయి.
దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మరో 200 దుప్పులను ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు.
పెద్ద పులి ఆహారం సంవత్సరానికి 50 జంతువులు
ఒక పెద్దపులి తన ఆకలి తీర్చుకునేందుకు ఏడాదికి 50 శాకాహార జంతువులను తీసుకుంటుంది. అయితే పులి సంచార ప్రాంతాల్లో 5-6 వందల శాకాహార జంతువులు ఉండాలి.
కవ్వాల్‌లో ప్రస్తుతం 12 పెద్దపులులున్నాయి. వాటి కోసం దాదాపు నాలుగు వేలకు పైగానే శాకాహార జంతువులు అవసరం. ఇక్కడ వదిలిన శాకాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉన్నది. అక్కడ అప్పటికే కొన్ని శాకాహార జంతువులు ఉన్నప్పటికీ పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఉండాలనే దాదాపు 400 జింకలు తరలించారు.
పెద్దపులుల సంఖ్య పరిమితికి మించి పెరగడం, వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతోనే అవి శివారు గ్రామాలకు వచ్చి పశువులు, మనుషులపై దాడి చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఒక పులి 40 చదరపు కిలోమీటర్ల ప్రాదేశిక ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఒక మగ పులి కేవలం కలయిక కోసం మాత్రమే తన సామ్రాజ్యంలోకి ఆడపులిని రానిస్తుంది.
మగపులి వేటకు వెళ్లి వన్యమృగాలు, పశువులను చంపి తెచ్చి ఆడపులికి ఆహారంగా పెడుతుంది.

ముందు మహానది.. ఆ తర్వాతే కావేరి: గోదావరి అనుసంధానంపై తెలంగాణ

గోదావరి - కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. గోదావరి బేసిన్‌లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ.. ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి- కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది.
గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. మొదట మహానది - గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది.
మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి - కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది.
ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి.
మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి) - నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి - పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది.
అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది.
తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది.
అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో మహానది-గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి-కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది.

వేగంగా మాయమవుతున్న యాంటీబాడీలు!

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు త్వరగా మాయమైపోతున్నట్టు తాజా అధ్యయనంలో తేలిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న 250 మందికిపైగా రోగులపై 5 నెలల పాటు నిర్వహించిన అధ్యయనం అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. 'సైన్స్ ఇమ్యునాలజీ' అనే అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
కరోనాతో ఆసుపత్రి పాలైన 79 మంది రోగులు, 175 మంది ఔట్ పేషెంట్లు, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించని వారి నుంచి సేకరించిన 983 బ్లడ్ ప్లాస్మా నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కథరినా రోల్ట్‌జెన్ మాట్లాడుతూ.. ఇమ్యునోగ్లోబ్లిన్ ప్రతిరోధకాలు దీర్ఘకాలం మనగలుగుతాయని, అయితే తీవ్ర అనారోగ్యం బారినపడిన వారిలో తొలుత రోగనిరోధకశక్తి ప్రతిస్పందనలు బాగా ఉన్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా క్షీణిస్తాయన్నారు.
కరోనావైరస్‌ను తటస్థం చేసే వివిధ రకాల యాంటీబాడీ స్థాయిలు కరోనా నుంచి కోలుకున్న తర్వాత దాదాపు మొదటి నెల నుంచే క్షీణించడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యం బారినపడిన రోగులతో పోలిస్తే తేలికపాటి అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో వైరల్ స్పైక్ ప్రోటీన్ కాంప్లెక్స్‌కు ప్రతిస్పందించే యాంటీబాడీలు అధిక నిష్పత్తిలో ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్-19 టీకాపై వచ్చే నెల నుంచి క్లినికల్ పరీక్షలు

ఫొటో సోర్స్, @BharatBiotech
ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్-19 టీకాపై వచ్చే నెల నుంచి 1వ/2వ దశల క్లినికల్ పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకా అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోంది.
'బెల్జియం- భారతదేశాల మధ్య భాగస్వామ్యాల నిర్మాణం' అనే అంశంపై సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించిన ఆన్‌లైన్ చర్చాగోష్ఠిలో డాక్టర్ కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. కేన్సర్ బాధితులు, పిల్లలు, గర్భిణిలకు ఇతర పద్ధతుల్లో ఇచ్చే టీకా కంటే, ముక్కు ద్వారా టీకా ఇవ్వటం మేలని ఆయన వివరించారు.
'కొవాగ్జిన్' టీకాను ఇన్-యాక్టివేటెడ్ లైవ్ వైరస్ టెక్నాలజీ (ఇది దాదాపు మూడు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం)తో అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. దీన్ని తమ బీఎస్‌ఎల్-3 ప్రొడక్షన్ యూనిట్లో తయారు చేస్తున్నామని అన్నారు. బీఎస్‌ఎల్-3 ల్యాబ్స్ పలు దేశాల్లో ఉన్నాయి కానీ, బీఎస్‌ఎల్-3 ప్రొడక్షన్ యూనిట్లు మాత్రం లేవని ఆయన వివరించారు.
ఈ రెండు టీకాలే కాకుండా యూఎస్‌లోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాతో కలిసి మరొక టీకా తయారీలోనూ భారత్ బయోటెక్ క్రియాశీలకంగా ఉంది. ఈ టీకా వృద్ధులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
కోల్డ్‌చైన్ పద్ధతిలో వర్ధమాన దేశాలకు భారతదేశం నుంచి టీకా పంపిణీ చేయటం ఎంతో కష్టమైన పనిగా పేర్కొంటూ, అందుకు సమర్థమైన సరకు రవాణా సదుపాయాలు ఉండాలని విశ్లేషించారు. ఇక్కడే బెల్జియం క్రియాశీలకమైన పాత్ర పోషించగలదని తెలిపారు. హైదరాబాద్ నుంచి ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు కొవిడ్-19 టీకా సరఫరా చేయటంలో బెల్జియం విమానాశ్రయాలు వారధిగా ఉపయోగపడాలని డాక్టర్ కృష్ణ ఎల్లా సూచించారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








