డిజిటల్ మాధ్యమాల్లో దూసుకెళ్తున్న బీబీసీ న్యూస్ తెలుగు-197 శాతం వృద్ధి

బీబీసీ న్యూస్ తెలుగు

బీబీసీ న్యూస్ తెలుగు డిజిటల్ ఆడియెన్స్ పరంగా 197 శాతం వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019-20 సంవత్సరంలో ఈ వృద్ధి కనిపించింది. భాగస్వామ్య వేదికల మీద ప్రసారమయ్యే టీవీ బులెటిన్ కూడా కలుపుకుని చూస్తే మొత్తంగా బీబీసీ న్యూస్ తెలుగు వృద్ధి 11 శాతంగా ఉంది.

బీబీసీ తెలుగు వార్తా కథనాలు ప్రతి వారం 88 లక్షల మందికి చేరుతున్నాయి.

మిగిలిన భాషలతో కలుపుకుని స్థూలంగా భారత్ లో బీబీసీ కంటెంట్ ప్రతి వారం దాదాపు ఆరు కోట్ల మందికి చేరుతోంది.

బీబీసీ వివిధ మాధ్యమాల ద్వారా అందిస్తున్న కంటెంట్‌ను వారంలో కనీసం ఒక్కసారైనా వీరు చదువుతున్నారు, చూస్తున్నారు, వింటున్నారు.

అంతర్జాతీయంగా బీబీసీకి అత్యధిక ఆడియన్స్ ఉన్న దేశంగా భారత్ మరోసారి నిలిచింది.

భారత్‌లో బీబీసీ ఆడియన్స్ పెరగడానికి డిజిటల్ మీడియాలో నమోదైన వృద్ధి ప్రధాన కారణం. డిజిటల్ మీడియాలో బీబీసీ ఆడియన్స్ దాదాపు 186 శాతం పెరిగారు.

బీబీసీ ప్రసారాలు భారత్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, గుజరాతి, పంజాబీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ, భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా ఇంగ్లిష్.

మొత్తంగా బీబీసీ ప్రపంచవ్యాప్త ఆడియన్స్ రికార్డు స్థాయిలో 46.8 కోట్లకు పెరిగారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య 11 శాతం పెరిగింది.

డిజిటల్ వేదికల్లో బీబీసీ న్యూస్ ఆడియన్స్ 53 శాతం పెరిగారు. 15.1 కోట్ల మంది బీబీసీ న్యూస్‌ను డిజిటల్ వేదికల్లో చూస్తున్నారు. పాఠకుల సంఖ్యను లెక్కించడంలో జీఏఎం నిర్దుష్టమైన నిక్కచ్చి ప్రమాణాలు పాటిస్తుంది. వ్యూస్ కాకుండా కేవలం యూనిక్ రీడర్స్ సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి పలుమార్లు వెబ్‌సైట్ వీక్షించినా, సైట్‌తో పాటు యూట్యూబ్, ఫే‌స్‌బుక్ చూసినా అది ఒక యూనిక్ వ్యూ కిందకే వస్తుంది. ఇది బీబీసీ వేదికలను సందర్శించిన అడియెన్స్ సంఖ్యను మాత్రమే గణిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 42 భాషల్లో బీబీసీ ప్రసారాలు అందిస్తోంది.

బీబీసీ భారతీయ భాషల్లో అందిస్తున్న సర్వీసుల్లో అత్యధిక మంది పాఠకులు ఉన్నది హిందీకే.

బీబీసీ హిందీ ప్రసారాలు ప్రతి వారం 2.49 కోట్ల మందికి చేరుతున్నాయి.

ఇందులో డిజిటల్ వేదికల్లో ప్రసారాలను చూస్తున్నవారే 1.33 కోట్ల మంది. బీబీసీ హిందీ డిజిటల్ పాఠకులు 175 శాతం పెరిగారు.

బీబీసీ గ్లోబల్ న్యూస్ (ఇంగ్లిష్) వార్తలు కూడా ఇప్పుడు ప్రతి వారం 1.11 కోట్ల భారతీయులకు చేరుతున్నాయి. బీబీసీ గ్లోబల్ న్యూస్‌లో ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ‘బీబీసీ వరల్డ్ న్యూస్’, బీబీసీ.కామ్ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 42 భాషల్లో బీబీసీ ప్రసారాలు అందిస్తోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా 42 భాషల్లో బీబీసీ ప్రసారాలు అందిస్తోంది

ఈ దశాబ్దంలో బ్రిటన్ ప్రపంచంతో కొత్త బంధం ఏర్పరుచుకుంటుందని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ అన్నారు.

ఇది విజయవంతమయ్యేందుకు బీబీసీకి ఉన్న అన్ని అంతర్జాతీయ వనరులను ఉపయోగించుకోవాలని, బీబీసీ పూర్తి సామర్థ్యాలను వెలికితీయాలని వ్యాఖ్యానించారు.

‘‘నేడు బ్రిటన్‌కు చెందిన అత్యంత శక్తిమంతమైన, సుపరిచితమైన బ్రాండ్లలో బీబీసీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు, పారదర్శకతకు పెట్టింది పేరు’’ అని ఆయన అన్నారు.

‘‘డిజిటల్ మార్కెట్‌లో కేవలం వార్తలే కాకుండా, స్పష్టమైన, నిష్పక్షపాతమైన ప్రసారాల ఆవశ్యకత ఉంది. అలాంటి చోట బీబీసీ న్యూస్ భారతీయ భాషల్లో ప్రభావం చూపించడం, అద్భుతమైన వృద్ధి నమోదు చేయడం ఉత్సాహకరంగా అనిపిస్తోంది’’ అని బీబీసీ ఇండియన్ లాగ్వేజెస్ హెడ్ రూపా ఝా అన్నారు.

భారతీయ ఆడియన్స్‌లో సంపాదించుకున్న నమ్మకం, విశ్వసనీయత పట్ల తాము గర్వపడుతున్నామని, దాని వల్లే వరుసగా రెండేళ్లు బీబీసీ అద్భుతమైన వృద్ధి సాధించిందని చెప్పిన రూప, ‘‘అసత్య సమాచారం వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో బీబీసీ విశ్వసనీయ, నిష్పక్షపాత జర్నలిజంపై ప్రజలు నమ్మకం ఉంచడం గొప్పగా అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

మీడియా రంగంలో డిజిటలే భవిష్యత్తు అని ఈ ఫలితాలు మరోసారి తెలియజేస్తున్నాయని బీబీసీ తెలుగు ఎడిటర్ జి.ఎస్. రామ్మోహన్ అన్నారు. రంగులద్దని వార్తలు, రాజీలేని రిపోర్టింగ్‌తో వార్తామాధ్యమాల్లో విశ్వసనీయమైన నేస్తంగా బీబీసీ తెలుగు నిలుస్తుందని ఆయన చెప్పారు.

తెలుగులాంటి క్రౌడెడ్ మార్కెట్ లో నిస్పాక్షికత, విశ్వసనీయతల వల్లే బీబీసీ తెలుగు తనదంటూ ఒకముద్ర వేయగలుగుతున్నదని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ హడావుడికి పరిమితం కాకుండా హెడ్ లైన్స్ వెనుక ఉండే అన్ని కోణాలను వెలికిదీస్తూ, లోతూ-విస్తృతి రెంటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రజలకు అవసరమైన మీడియా సాధనంగా బీబీసీ తెలుగు నిలుస్తుందని రామ్మోహన్ ఆశ్వాసం వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ ఆడియన్స్ అత్యధికంగా ఉన్న దేశాలివే

భారత్ - 6,04,00,000

అమెరికా - 4,95,00,000

నైజీరియా - 3,72,00,000

కెన్యా - 1,46,00,000

టాంజానియా - 1,40,00,000

బంగ్లాదేశ్ - 1,19,00,000

అఫ్గానిస్తాన్ - 1,14,00,000

ఇరాన్ - 1,13,00,000

కెనడా- 97,00,000

పాకిస్తాన్ - 97,00,000

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)