నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయట్లేదు: దిల్లీ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Delhi Police
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు జనవరి 22న ఉరి శిక్షను అమలు చేయట్లేదని బుధవారంనాడు దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురిలో ఒక దోషి క్షమా భిక్ష కోసం చేసుకున్న అర్జీ ఇంకా రాష్ట్రపతి దగ్గరే ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
నిబంధనల ప్రకారం డెత్ వారెంట్‌ను అమలు చేయడానికి ముందు క్షమా భిక్షపై తుది నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉందని దిల్లీ ప్రభుత్వం, జైలు యాజమాన్యం కలిసి కోర్టుకు వివరించాయి.
‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్భయ దోషులకు 22న ఉరిశిక్షను అమలు చేయడం కుదరదు. జనవరి 21 మధ్యాహ్నం మేం ట్రయల్ కోర్టుకు వెళ్తాం. ఒకవేళ రాష్ట్రపతి వారి క్షమాభిక్షను తిరస్కరించినా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారి ఉరి శిక్ష గడువు 14 రోజులపాటు పొడిగిస్తూ మరో కొత్త డెత్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది’’ అని దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాహుల్ మెహరా తెలిపారు.
రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించాక కూడా దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి 14 రోజుల గడువు ఇవ్వాలని 2014లో ఒక తీర్పులో భాగంగా సుప్రీం కోర్టు తెలిపింది.
మరోపక్క ఇలాంటి సమయంలో దోషి ముకేష్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై విచారణ జరపడం కూడా అనవసరం అని కోర్టులో ఏఎస్‌జీ మనీందర్ ఆచార్య వ్యాఖ్యానించారు.
ఉరి శిక్ష పడిన ఏడు రోజుల్లోగా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవాలని దిల్లీ జైలు మాన్యువల్ చెబుతోంది. కానీ, 2017లోనే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది కదా అని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
‘‘2018లోనే పునర్విచారణ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. మరి అప్పుడే క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష అర్జీ ఎందుకు పెట్టుకోలేదు?. అంటే దోషులు డెత్ వారెంట్ జారీ చేసేదాకా ఎదురుచూస్తూ కూర్చున్నారా? ఇలాంటి న్యాయపరమైన అవకాశాలన్నింటినీ దోషులు నిర్ణీత గడువులోనే ఉపయోగించుకోవాలి.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
అదే సమయంలో న్యాయవాది రెబెకా జాన్ స్పందిస్తూ, 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ దోషి తన ఆఖరి శ్వాస వరకు న్యాయపరమైన అవకాశాలు ఉపయోగించుకోవచ్చని, క్షమాభిక్ష తిరస్కరణకు గురయ్యాక కూడా అతడికి 14 రోజుల గడువు ఇవ్వాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మంగళవారం కోర్టులో ఏం జరిగింది?
నిర్భయ కేసులో దోషులైన వినయ్ కుమార్ శర్మ, ముకేష్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.
ఉరిశిక్ష అమలుపై స్టే కోరుతూ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ జడ్జి చాంబర్ లోపలే జరిగింది. తరువాత జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ముఖేష్ సింగ్, వినయ్ కుమార్ శర్మల పిటిషన్‌ను కొట్టేసినట్లు తెలిపింది.
ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ రమణతో పాటు, జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆర్ ఎఫ్ నారీమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ ఉన్నారు.
సుప్రీం కోర్టు నిర్ణయం అనంతరం నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడుతూ.. ''ఏడేళ్లుగా నేను న్యాయం కోసం ఎదురుచూస్తున్నా. అందుకే దోషులుకు ఉరిశిక్ష అమలయ్యే జనవరి 22 మాకు ఎంతో ముఖ్యమైన రోజు'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న నలుగురు దోషులకూ మరణశిక్షను అమలుచేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
ఆ ఆదేశాలు వెలువడిన అనంతరం దోషి వినయ్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
మొదట జనవరి 8న వినయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ కూడా ఆ పిటిషన్ వేశారు.
మరింత సమాచారం కోసం ఈ కథనం కూడా చదవండి: నిర్భయ కేసు దోషులను ఎలా ఉరి తీస్తారు... దేశంలో ఎన్ని జైళ్లలో ఉరి శిక్షకు ఏర్పాట్లున్నాయి
ఇవి కూడా చదవండి:
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?
- ఉల్లి ధర పెరిగిందని చెబుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారా...
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- మేగన్ మార్కెల్‌ను అందుకే డయానాతో పోల్చుతున్నారు
- ఆమె శరీరంలో ఇరవైకి పైగా తూటాలు... సిరియా శాంతిదూత హెవ్రిన్ ఖలాఫ్‌ను చంపింది ఎవరు?
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








