CAA: కాన్పూర్ నిరసనల్లో ఇద్దరి మరణానికి ముందు ఏం జరిగింది.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదేంటి - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
కాన్పూర్‌లో శుక్రవారం నమాజు తర్వాత చెలరేగిన హింసలో ఇద్దరు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరికి మెడికల్ కాలేజీలోని హైలైట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు కాల్పులు జరిపారని మృతులు, గాయపడ్డవారి బంధువులు చెబుతుంటే, పోలీసులు మాత్రం గుంపును చెదరగొట్టడానికి, ప్రాణాలు కాపాడుకోడానికే లాఠీఛార్జి చేశామని, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించామని చెబుతున్నారు.
హింసతో కాన్పూర్‌లోని బాబూపూర్వా, యతీమ్‌ఖానా ప్రాంతాలు చాలా ప్రభావితం అయ్యాయి, ముఖ్యంగా బాబూపుర్వాలో నష్టం తీవ్రంగా ఉంది. కాన్పూర్ జోన్ ఏడీజీ ప్రేమ్ ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం మృతులు ఇద్దరూ బాబూపుర్వాకు చెందినవారే.
అంతేకాదు, గాయపడ్డవారంతా ఎక్కువగా బాబూపుర్వా, దాని చుట్టుపక్కల బేగపూర్వా, మున్షీపూర్వా, అజీత్‌పూర్ ప్రాంతాలవారు. మృతులను సైఫ్, అఫ్తాబ్ ఆలంగా గుర్తించారు. ఇద్దరి వయసు 30 నుంచి 32 మధ్య ఉంటుందని చెబుతున్నారు.
ఇద్దరినీ పోలీసులే కాల్చిచంపారని కాన్పూర్‌లో పోస్టుమార్టం హౌస్ బయట ఉన్న సైఫ్ సోదరుడు ఆరోపించారు.
"హింస మొదట గ్వాల్టోలీ ప్రాంతంలో మొదలైంది. అది మఛరియా ప్రాంతం గుండా హలీమ్ కాలేజ్, యతీమ్‌ఖానా వరకూ చేరింది. కానీ హింసకు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం మాత్రం బాబూపూర్వానే. యతీమ్‌ఖానాలో జరిగిన హింసలో చాలా మంది పోలీసులు కూడా గాయపడ్డారు" అని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MSIHRA / BBC
స్థానిక జర్నలిస్ట్ ప్రవీణ్ మెహతా ఈ మొత్తం ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నిలిచారు.
"సుమారు రెండు గంటలకు అక్కడక్కడా ఆందోళనలు మొదలయ్యాయి. సుమారు నాలుగున్నరకు యతీమ్‌ఖానా నుంచి పరేడ్ గ్రౌండ్, ఫూల్ బాగ్, మాల్ రోడ్ అన్ని ప్రాంతాలూ పూర్తిగా నిరసనకారుల పట్టులో ఉన్నాయి. పోలీసులు అక్కడ పూర్తిగా నిస్సహాయ స్థితిలో కనిపించారు. పోలీసు అధికారుల మధ్య ఎలాంటి సమన్వయం కనిపించలేదు. దాంతో సుమారు మూడు గంటల హంగామా తర్వాత జనం సాయంత్రం ఐదు గంటలకు బాబూపూర్వా చేరుకున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది. జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి ఫోర్స్ లేకుండానే అక్కడ నిలబడ్డారు" అని ఆయన చెప్పారు.
నిప్పుపెట్టారు
బాబూపూర్వా మసీదులో ప్రార్థనల తర్వాత సుమారు ఐదు వేల మంది నిరసన ప్రదర్శనలు చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. వీరందరూ సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న చౌరస్తా వరకూ ఆందోళనలు చేయాలనుకున్నారు.
"పోలీసులు వారిని అక్కడివరకూ వెళ్లనిచ్చుంటే, ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. అయితే మాలాంటి పెద్దవాళ్లంతా ఆందోళనలు చేయకపోవడమే మంచిదని వారికి చెప్పాం. కానీ యువకులు ఒప్పుకోలేదు. ముందుకెళ్లారు. వాళ్లలోనే ఎవరో రాళ్లు రువ్వుంటారు. కానీ పోలీసులు కాలనీలోకి చొరబడి అందరినీ చితకబాదారు. సుమారు 150 మందిని తీసుకెళ్లారు. వాళ్ల గురించి ఎలాంటి సమాచారం లేదు" అని మసీదుకు ఎదురుగా ఉన్న కాలనీ బేగంపూర్వాలోని వృద్ధుడు అజ్మల్ చెప్పారు.
ఈ ప్రాంతంలో ఆందోళనకారులు పోలీసుల నాలుగు మోటార్ సైకిళ్లకు కూడా నిప్పుపెట్టారు. చాలాసేపటి వరకూ రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. ఇళ్లలోంచి, ఇళ్ల పైనుంచి కూడా రాళ్లు విసిరారని పోలీసులు చెబుతున్నారు.
శనివారం రోడ్డంతా శుభ్రం చేసినా అక్కడక్కడా ఇటుకలు, రాళ్ల ముక్కలు, వాహనాల అద్దాల ముక్కలు కనిపించాయి. వాటిని చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MSIHRA / BBC
బాబూపూర్వాలో రాళ్లు రువ్వి, నిప్పుపెట్టిన సమయంలో స్థానిక పోలీస్ అధికారి మనోజ్ కుమార్ గుప్తా కూడా మెడ కింద రాయి తగిలి గాయపడ్డారు. శనివారం ఆయన మళ్లీ ఆ ప్రాంతంలో తనిఖీల కోసం వెళ్లారు.
"నమాజు చేశాక అందరినీ శాంతియుతంగా తిరిగి ఇళ్లకు పంపించడానికి మేం ప్రయత్నించాం. కానీ కాసేపట్లోనే పరిస్థితి హింసాత్మకంగా మారింది. కొంతమంది పోలీసులపై రాళ్లు రువ్వడం మొదలెట్టారు. దాంతో పరిస్థితిని అదుపుచేయడానికి, తమను తాము కాపాడుకోడానికి పోలీసులు కూడా బలప్రయోగం చేయాల్సి వచ్చింది" అని మనోజ్ కుమార్ గుప్తా బీబీసీతో చెప్పారు.
"ప్రదర్శనలు పూర్తైన తర్వాత పోలీసులు బాబూపూర్వా ప్రాంతంలోని కాలనీల్లోకి వెళ్లి జనాలను చితకబాదారు, వాహనాలను ధ్వంసం చేశారు, చాలా మందిని బలవంతంగా ఎత్తుకెళ్లారు" అని స్థానికులు ఆరోపించారు. కానీ, వారెవరూ తమ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. మీడియాలో తమ ఫొటో రావడం ఇష్టం లేదన్నారు.
సుమారు 22 ఏళ్ల యువకుడు చాలా కోపంగా "నా స్వీట్ షాపును పూర్తిగా ధ్వసం చేశారు, మొత్తం సామాన్లు విసిరేశారు. ఎదురుగా బ్యాటరీ రిక్షాలను ఎలా చేశారో మీరే చూడండి. దొరికిన వాళ్లను దొరికినట్టు దారుణంగా కొట్టారు. ఇక్కడనుంచి చాలా మందిని తీసుకెళ్లారు" అని చెప్పాడు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MSIHRA / BBC
మహిళలను కూడా చితకబాదారు
"మొత్తం 39 మందిని అదుపులోకి తీసుకున్నాం. అయితే శనివారం జిల్లా అధికారులు, స్థానికులు, మతపెద్దలు, నగర ఖ్వాజీతో జరిగిన సమావేశంలో వీరిలో 35 మందిని వదిలేయడానికి నిర్ణయించాం. ఎందుకంటే, వారు హింసకు పాల్పడినట్లు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు" అని బాబూపూర్వా సీఓ మనోజ్ కుమార్ గుప్తా చెప్పారు.
పోలీసులు మహిళలను కూడా తీవ్రంగా కొట్టారని, ఇళ్ల తలుపులు కూడా విరగ్గొట్టారని బేగంపూర్వాలో కొంతమంది మహిళలు చెప్పారు.
"బేగంపూర్వాలో ఉన్న మహిళలందరూ మసీదులో వెనక్కు వెళ్లి ఉండిపోయాం. ఎందుకంటే శనివారం రాత్రి జరిగింది చూసి వారంతా భయంతో వణికిపోయారు. చెప్పేది వినకుండా పోలీసులు మహిళలను చితకబాదారు. అప్పుడు వారిలో మహిళా పోలీసులు కూడా లేరు. ప్రాణాలు, పరువు కాపాడుకోడానికి మహిళలంతా ఇళ్లు వదిలి మసీదులోకి వెళ్లి ఉండాల్సొచ్చింది" అని బేగంపూర్వాలో ఉన్న ఒక మహిళ చెప్పారు.
నిజానికి, బాబూపూర్వాలోని మసీదులో శుక్రవారం నమాజు చేయడానికి బేగంపూర్వా, అజిత్‌నగర్, మున్షీపూర్వా ప్రాంతాలవారు కూడా వస్తుంటారు. ఈ మసీదు దగ్గర ఈద్గా కూడా ఉంది.
"శుక్రవారం నమాజు కోసం ఇక్కడికి చాలా మంది జనం వస్తుంటారు. కానీ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, తర్వాత సమావేశం ఉందని చెప్పడంతో ఆ జనం ఇంకాస్త ఎక్కువగా గుమిగూడారు" అని స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MSIHRA / BBC
అక్కడ ఉన్న యువకుల్లో కొందరిని తాము గుర్తుపట్టలేకపోయామని మున్షీపురాలోని వృద్ధులు చెప్పారు. కానీ ఈ నిరనస ప్రదర్శనల్లో బయటివారి ప్రమేయం ఉందనే విషయాన్ని బేగంపూర్వా కాలనీవారు తోసిపుచ్చారు.
కానీ హలీమ్ ముస్లిం డిగ్రీ కాలేజ్ బయట జరిగింది మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. "చూస్తుండగానే ముఖానికి నల్లగుడ్డ కట్టుకున్న వేలాది మంది యువకులు రోడ్లమీదకు వచ్చారు, నినాదాలు మొదలెట్టారు" అన్నారు.
కాలేజీ మూసేసి ఉన్నప్పటికీ ఈ యువకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వారంతా ఎవరు అనేదానిపై అక్కడ ఎవరి దగ్గరా సమాచారం లేదు. పోలీసులకు కూడా ఆ విషయం తెలీదు.
డిసెంబర్ 19న యూపీలో చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు హింస తలెత్తినా, ఆ తర్వాత రోజు అంటే శుక్రవారం కూడా హింసాత్మక ప్రదర్శనలు పునరావృతం కావడంతో పోలీసుల చర్యలు, వారి పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MSIHRA / BBC
కాన్పూర్‌లో శుక్రవారం నమాజు తర్వాత నిరసనకారుల అక్కడక్కడా గుమిగూడడం, హింస జరగడం అంతా పోలీసుల అసమర్థతను బయటపెడుతోంది.
నగరంలో 144 సెక్షన్ అమలు చేసినప్పటికీ, జరక్కూడనివి జరిగిపోయాయి. సాయంత్రానికి పోలీసులు, ఉన్నతాధికారులు అన్నింటినీ చెదురుమదురు ఘటనలుగా చెప్పారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. అంతే కాదు, శనివారం కూడా బేకన్‌గంజ్ ప్రాంతంలో జనం చాలా పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రదర్శనలు నిర్వహించారు.
"హింస తలెత్తిన సమయంలో నిరసనకారులు రాళ్లు రువ్వడమే కాదు, పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు కూడా విసిరారు. కాల్పులు కూడా జరిపారు. ఆ దాడిలో పోలీసులతోపాటు మీడియావారు కూడా గాయపడ్డారు. సుమారు ఐదు గంటలకు బాబూపూర్వాకు చేరుకున్న కలెక్టర్ విజయ్ విశ్వాస్ పంత్, ఎస్ఎస్పీ అనంత దేవ్ మీద కూడా కూడా రాళ్లు పడ్డాయి. కొంతమంది ఆందోళనకారులు డీఎంతో ఘర్షణకు కూడా దిగారు. దాంతో, వారంతా చాలా కష్టపడి తమ ప్రాణాలు కాపాడుకున్నారు" అని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వం సవరణ చట్టం: రాంపూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- Fake news: దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- ‘‘భారత్‌ను హిందుత్వ భావజాల దేశంగా మార్చాలని చూస్తున్నారు.. అలా జరగనివ్వం’’- గాయకుడు టీఎం కృష్ణ
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








