ఇండియా స్కోర్ 502.. దక్షిణాఫ్రికా 39/3.. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో వైజాగ్ టెస్ట్‌లో పట్టుబిగించిన భారత్

మయాంక్ అగర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయాంక్ అగర్వాల్

విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. అతడు తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు.

మ్యాచ్ తొలి రోజు 84 పరుగులు సాధించిన మయాంక్ రెండో రోజైన గురువారం డబుల్ సెంచరీ చేశాడు. 358 బంతుల్లో అతడు డబుల్ సెంచరీ పూర్తిచేశాడు.

మయాంక్ 215 పరుగుల (371 బంతులు; 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద డీన్ ఎల్గర్ బౌలింగ్‌లో డేన్ పీట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ భారీ స్కోర్లతో దక్షిణాఫ్రికాపై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 136 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 502 పరుగులు సాధించాక భారత్ డిక్లేర్ చేసింది.

ఇప్పటివరకు విశాఖపట్నం మైదానంలో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 455 పరుగులు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, facebook/RohitSharma

మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకొంది. వర్షం కారణంగా బుధవారం 59.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది.

తొలి రోజు సెంచరీ (115 పరుగులు) సాధించిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ రెండో రోజు 176 పరుగులకు వెనుదిరిగాడు.

రోహిత్ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

317 పరుగుల భాగస్వామ్యం

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఏకంగా 317 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ ఔట్ అయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా ఆరు పరుగులకే నిష్క్రమించాడు.

తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో 53 పరుగుల, అజింక్య రహానేతో 54 పరుగుల భాగస్వామ్యాలను మయాంక్ నమోదు చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో మయాంక్ అగర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో మయాంక్ అగర్వాల్

కోహ్లీ 20, రహానే 15, హనుమ విహారి 10, వృద్ధిమాన్ సాహా 21 పరుగులు చేశారు.

రవీంద్ర జడేజా 30 పరుగులతో, రవిచంద్ర అశ్విన్ ఒక్క పరుగుతో నాటౌట్‌గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఫిలాండర్, సెనురాన్ ముత్తుసామి, ఎల్గర్, డేన్ పీట్ తలా ఒకటి తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)