భారతదేశంలో ‘సాక్షి’గా ఉండడం ఎందుకంత ప్రమాదకరం? ఏమిటి పరిష్కారం?

ఫొటో సోర్స్, The India Today Group/Getty
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్‌లో ఒక బీజేపీ ప్రజాప్రతినిధి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ కేసులో సాక్షి దారుణ ప్రమాదంలో మరణించటంతో భారతదేశంలో సాక్షులకు రక్షణ కల్పించే చట్టం అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఈ ఉదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
ఒక అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారితుడైన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి మీద నమోదైన అత్యాచారం కేసులో మహేందర్ చావ్లా ఒక సాక్షి.
ఆశారాంకు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ జైలులో ఉన్నారు.
అయితే, హరియాణాలో నివసించే చావ్లా మీద నాలుగేళ్ల కిందట హత్యా ప్రయత్నం జరిగింది. ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆయన నిరంతరం భయం భయంగా గడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times/Getty
''ఆశారాం జైలులో ఉన్నారు కానీ, ఆయన అనుచరులు జైలులో లేరు'' అని ఆయన నాతో ఫోన్‌లో మాట్లాడుతూ అన్నారు.
అది 2015 మే 13వ తేదీ ఉదయం. మొదటి అంతస్తులో నివసించే మహేందర్ చావ్లా ఇంటి బయట ఏదో శబ్దం వినిపిస్తే చూడటానికి బయటకు అడుగుపెట్టారు.
ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఉండటం చూశాడు. ఒక వ్యక్తి మెట్లు ఎక్కుతూ ఉంటే మరో వ్యక్తి కాపలా కాస్తున్నాడు.
పైకి వస్తున్న వ్యక్తితో చావ్లా తలపడ్డాడు. ఆయన మీద రెండు సార్లు తుపాకీ కాల్పులు జరిగాయి. ఒక తూటా ఆయన భుజానికి తాకటంతో స్పృహ తప్పిపోయాడు.
ఆయన చనిపోయాడనుకుని దుండగులు పారిపోయారు. దాదాపు పక్షం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కానీ చావ్లా కోలుకోలేకపోయారు.
''నారాయణ్ సాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా?' అని నన్ను బెదిరిస్తూ దాడి చేశారు. అప్పటికే రాజీ పడాలని నాపై చాలా కాలంగా ఒత్తిడి వస్తోంది'' అని చెప్పారు మహేందర్.

ఫొటో సోర్స్, The India Today Group/Getty
అప్పటి నుంచీ ఆయన గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ వస్తే మాట్లాడరు. ఎవరైనా తెలిసివారు చెప్పిన నంబర్ల నుంచి వచ్చే కాల్స్ మాత్రమే స్వీకరిస్తారు.
ఆశారాం బాపు కేసుకు సంబంధించి పది మంది వ్యక్తుల మీద దాడులు జరిగాయని, వారిలో ముగ్గురు చనిపోయారని, రాహుల్ సచన్ అనే వ్యక్తి ఆచూకీ ఇంతవరకూ తెలియదని చావ్లా చెప్పారు.
ఈ ఆరోపణలన్నిటినీ ఆశారాం తరఫు న్యాయవాది చంద్రశేఖర్ గుప్తా తిరస్కరించారు. ఈ తన క్లయింటుకు ఆ దాడులు, మరణాలతో ఎటువంటి సంబంధం లేదని కొట్టివేశారు.
''2013లో ఆశారాం బాపు అరెస్టయినప్పటి నుంచీ.. ఎటువంటి దాడుల కేసుల్లోనూ ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు'' అని గుప్తా చెప్పారు.
భారతదేశంలో ఒక కేసులో సాక్షిగా ఉండటం సులభం కాదు.
కేసు విచారణలు సుదీర్ఘంగా సాగటం, బెదిరింపులు, హెచ్చరికలకు గురయ్యే ప్రమాదం, అవినీతి, వ్యక్తిగత జీవితం మీద ప్రభావం - వీటన్నిటి వల్ల.. సాక్షులుగా ఉండగలిగే వారు న్యాయవ్యవస్థ, ప్రక్రియలో భాగం పంచుకోవటానికి విముఖంగా ఉంటారు. ప్రత్యేకించి ఆయా కేసుల్లో నిందితులు శక్తివంతులు, ప్రభావం చూపగలిగేవారైతే ఈ విముఖత ఇంకా ఎక్కువగా ఉంటుంది.
దీనివల్ల నిందితులు దోషులుగా నిర్ధారితులయ్యే రేటు తగ్గిపోతుంది. ఫలితంగా వారు నిర్దోషులుగా విడుదలవుతుంటారు.
''సాక్షులకు చట్టపరమైన పరిష్కారం లేదు. వారిని తగిన విధంగా పట్టించుకోరు కూడా. ప్రస్తుత న్యాయవ్యవస్థ సాక్షులతో యథాలాపంగా వ్యవహరిస్తోంది'' అని 2018లో సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులో వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా సాక్షులకు రక్షణ కల్పించే మొట్టమొదటి కార్యక్రమం కోసం ఆ ఉత్తర్వు ద్వారా ఒక నిర్మాణాన్ని నిర్దేశించింది.
''తగిన చట్టం చేసేవరకూ'' ఈ ఉత్తర్వును చట్టంగా పరిగణించాలని పేర్కొంది.
ఒక న్యాయమూర్తి, పోలీసు ఉన్నతాధికారి, ప్రాసిక్యూషన్ అధిపతుల సారథ్యంలో జిల్లా వారీగా ''అధీకృత అధికార సంస్థ''లను నెలకొల్పాలని ఆ కార్యక్రమం చెప్తోంది.
ఆ అధికార సంస్థలకు దరఖాస్తు అందినపుడు, సాక్షులకు ముప్పు గురించి విశ్లేషిస్తూ ముప్పు తీవ్రతను బట్టి అవసరమైన రక్షణ చర్యలను సూచిస్తూ ఒక నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Hindustan Times/Getty
ఆ కార్యక్రమంలో నిర్దేశించిన చర్యల్లో కింది అంశాలు కూడా ఉన్నాయి:
1.దర్యాప్తు లేదా విచారణ సమయంలో సాక్షి, నిందితులు ఎదురుపడకండా జాగ్రత్తలు తీసుకోవటం.
2.మెయిల్, టెలిఫోన్ కాల్స్‌ను పర్యవేక్షించటం.
3.సాక్షి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన వ్యక్తులు
4.సాక్షి నివాసాన్ని తాత్కాలికంగా ఎవరైనా బంధువు లేదా సమీపంలోని పట్టణానికి మార్చటం
5.న్యాయమూర్తి సమక్షంలో గోప్యంగా విచారణలు నిర్వహించటం
ఈ చర్యలు చేపట్టటానికి అవసరమైన వ్యయం కోసం సాక్షి రక్షణ నిధిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ ఉత్తర్వు అనంతరం మహేందర్ చావ్లా, మరో ముగ్గురు ఒక పిటిషన్ వేశారు. ఆ ముగ్గురిలో ''హత్యకు గురైన ఒక సాక్షి తండ్రి, ఒక చిన్నారి అత్యాచార బాధితురాలి తండ్రి, హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డ ఒక జర్నలిస్టు'' ఉన్నారు.
దేశ రాజధాని దిల్లీలో హత్య కేసుల్లో సాక్షులు కోర్టు వాంగ్మూలాలను మార్చుతుండటం, ఎదురు తిరగటం... దానివల్ల కేసులు దెబ్బతినటం వంటి పరిణామాలతో స్థానిక కోర్టు ఒకటి నిస్పృహ వ్యక్తం చేయటంతో 2015 డిసెంబర్ నుంచి సాక్షి రక్షణ కార్యక్రమం అమలవుతోంది.
దిల్లీ సాక్షి రక్షణ కార్యక్రమం కింద 2013 నుంచి 2019 మధ్య 236 దరఖాస్తులు అందగా 160 దరఖాస్తులు ఆమోదం పొందాయని ఒక అధికారి తెలిపారు.
అయితే, దేశ వ్యాప్తంగా ఈ రక్షణ వ్యవస్థను నెలకొల్పటంలో ఎంత పురోగతి ఉందన్న విషయంలో స్పష్టత లేదు. కానీ, కృషి జరుగుతోందని సీనియర్ పోలీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/Getty
''భారతదేశంలో ఒక సాక్షిగా ఉండడం చాలా కష్టం'' అంటారు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్. ఆయన స్వయంగా, 2010 జూలై 20న ఒక కోర్టు వెలుపల తుపాకీ కాల్పుల్లో హత్యకు గురైన అమిత్ జేథ్వా అనే పర్యావరణ ఉద్యమకారుడి హత్య కేసులో సాక్షి కూడా.
''అమిత్ జేథ్వా హత్యకు గురవటానికి ఒక రోజు ముందు నా చాంబర్‌కు వచ్చి తనకు ప్రాణాపాయం ఉందని భయం వ్యక్తం చేశారు'' అని ఆనంద్ తెలిపారు.
ఆ కేసు విచారణ సందర్భంగా 195 మంది సాక్షుల్లో 105 మంది తమ వాంగ్మూలాలను మార్చారు.
యాజ్ఞిక్‌కు అతడి భార్య ఎక్కడ పనిచేస్తారో తమకు తెలుసునని, ఆమె మొబైల్ నంబర్, కారు నంబర్ కూడా తమకు తెలుసునని, అతడి కుమార్తె చదువుకునే స్కూలు ఎక్కడ ఉందో కూడా తెలుసునని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయి.
అమిత్ జేథ్వా హత్య కేసులో మాజీ ప్రజాప్రతినిధి దినూ సోలంకి, మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ ఏడాది జూలైలో కోర్టు తీర్పు ఇచ్చింది.
అత్యంత అభివృద్ధి చెందిన సాక్షి రక్షణ వ్యవస్థలు గల ఇతర దేశాల తరహాలో సదుపాయాలను నెలకొల్పటానికి భారతదేశం ఇంకా చాలా పురోగమించాల్సి ఉంది.
అమెరికా సాక్షి రక్షణ కార్యక్రమం కింద ''1971లో అది మొదలైనప్పటి నుంచి 8,600 మందికి పైగా సాక్షులకు, 9,900 మందికి పైగా వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించటంతో పాటు, వారిని వేరే చోటుకు మార్చి, కొత్త గుర్తింపునిచ్చింది.''

ఫొటో సోర్స్, Prashant Pandey
బ్రిటన్‌లో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ సాక్షి రక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ''ప్రొటెక్టెడ్ పర్సన్స్ యూనిట్ (రక్షిత వ్యక్తుల విభాగం) గత 20 ఏళ్లలో వేలాది కేసులను పర్యవేక్షించింది'' అని యూకే ప్రొటెక్టెడ్ పర్సన్స్ సర్వీస్ వెబ్‌సైట్ చెప్తోంది.
ఆస్ట్రేలియా నేషనల్ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, విదేశీ చట్ట అమలు సంస్థలు విదేశీ పౌరులు, నివాసులను కూడా చేర్చాలని కోరవచ్చునని ఆ సంస్థ వెబ్‌సైట్ పేర్కొంటోంది.
మధ్యప్రదేశ్‌లోని మెడికల్ స్కూల్ ఎగ్జామినేషన్ కుంభకోణం వ్యాపం కేసులో సాక్షి అయిన ప్రశాంత్ పాండే కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు.
ఆ కుంభకోణం 2015లో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి 50 మందికి పైగా వ్యక్తులు చనిపోయారని ప్రశాంత్, స్థానిక పాత్రికేయులు చెప్తున్నారు.
ఈ కేసులో ప్రశాంత్ సాక్షిగా మారిన ఐదు నెలలకు.. అతడి భార్య, రెండేళ్ల కుమారుడు, తండ్రి, నానమ్మ ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆ దారుణ ప్రమాదం నుంచి వారు ఏదో "అద్భతం" జరిగినట్లు ప్రాణాలతో బయటపడ్డారు.
''నేను 51వ మృతుడిని కావచ్చునని హెచ్చరిస్తూ నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి'' అని ఆయన నాతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానని మరోసారి ప్రతిపాదించిన డోనల్డ్ ట్రంప్
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- ఇది కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది
- నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
- సున్నా నుంచి 10కి చేరిన బీజేపీ బలం.. ఫిరాయింపు చట్టం వర్తించదంటున్న రాంమాధవ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








