పోలవరంపై రివర్స్ టెండరింగ్ ఎందుకు, నివేదిక కోరిన కేంద్రం: ప్రెస్ రివ్యూ

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరుల శాఖ కోరిందని ఈనాడు తెలిపింది.
రివర్స్ టెండరింగ్ వల్ల జాప్యం పెరుగుతుందని, ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెప్పినా ఏపీ ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడానికి దారితీసిన కారణాలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
రీటెండరింగ్ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఈనెల 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజే కొత్త టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రానికి సమర్పించే నివేదికలో అభిప్రాయాలేమీ జోడించబోమని, ఇప్పటివరకూ చోటుచేసుకున్న పరిణామాలను మాత్రమే పొందుపరుస్తామని పీపీఏ అధికారులు తెలిపారు.
ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరు, రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న మార్పులు, టెండర్ల రద్దు వల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఈ నివేదికలో పొందుపరిచే అవకాశముందని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
డెబిట్ కార్డులు త్వరలో కనుమరుగు
డెబిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించే దిశగా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ కార్డుల వినియోగం తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాల వైపు కస్టమర్లను మరింతగా ప్రోత్సహించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని సాక్షి వెల్లడించింది.
కొద్ది రోజుల తర్వాత డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఎస్బీఐ యోచిస్తోంది. ఇది త్వరలోనే సాధ్యమవుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు.
డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ చర్యలు, అప్లికేషన్లు దోహదం చేస్తాయని ఆయనన్నారు. డబ్బులు తీసుకోవడానికి, చెల్లింపులకు.. ఇలా అన్నింటికీ డిజిటల్ విధానాలు సహాయం చేస్తాయని తెలిపారు.
ప్రస్తుతం దేశీయంగా 90 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/KTR
ఆయుష్మాన్ భారత్ నిరుపయోగ పథకం: కేటీఆర్
తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని నమస్తే తెలంగాణ ఓ వార్తలో రాసింది.
కర్ణాటక తరహా రాజకీయాలు, పన్నాగాలు, నాటకాలు తెలంగాణలో సాధ్యం కాదని కేటీఆర్ బీజేపీని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సహకరించకపోగా.. అది పూర్తవుతున్నందుకు బాధ పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రం బాగుపడి, అభివృద్ధి దిశగా వెళ్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నచ్చడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మతాలు, కులాల పేరుతో చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర పథకాలన్నింటినీ కేంద్రం కాపీ కొట్టి, పేర్లు మార్చి ప్రవేశపెడుతోందన్నారు. మిషన్ భగీరథను పేరు మార్చి జల్‌శక్తి అభియాన్ అని, రైతు బంధు పేరు మార్చి పీఎం కిసాన్ యోజన అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆయుష్మాన్ భారత్ ఓ నిరుపయోగ పథకమని, దానికన్నా తెలంగాణలో అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైన పథకమని కేటీఆర్ అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణపై జ్వరాల పంజా
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారు. రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గడం, జ్వరం కారణంగా చలికి రోగులు వణుకుతున్నారు.
కొందరిని కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు కూడా బాధిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ విభాగాల వద్ద పెద్దసంఖ్యలో రోగులు కనిపిస్తున్నారు.
మే నెల నుంచి ఆగస్టు 5 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 43.67 లక్షల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన గణాంకాలు. ప్రైవేటు ఆస్పత్రులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య భారీగా ఉంటుందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి దేశంలో విస్తృతంగా మద్దతు ఎందుకు లభిస్తోంది?
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే
- కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో 1992లో ఎగిరిన భారత జెండా.. అప్పడు మోదీ పాత్ర ఏంటి
- అలసిపోతున్నారా? పని చేయాలంటే విసుగొస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది? పరిష్కారాలేమిటి?
- 5జీ టెక్నాలజీతో విమానాల భద్రతకు, సైనిక చర్యలకు పొంచి ఉన్న ప్రమాదమేంటి..
- శాంసంగ్: స్మార్ట్ టీవీలపై వైరస్ దాడులను నివారించేందుకు ఇలా చేయండి
- తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ నగదు బదిలీలపై జూలై 1 నుంచి ఛార్జీలు ఉండవు - ఆర్బీఐ
- శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది...
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








