తెలంగాణలోని ఆరు జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, IWMP.TELANGANA.GOV.IN
తెలంగాణలో బంగారు గనులు
తెలంగాణలో బంగారు గనులున్నట్లు వెల్లడైందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో బంగారం, వజ్రాల నిల్వలు ఉన్నట్టు గనుల శాఖ గుర్తించింది.
వాటిని వెలికితీయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ ప్రయత్నాలు సఫలమైతే తెలంగాణ నిజంగానే బంగారంగా మారనుంది. తెలంగాణ గనుల శాఖ తాజాగా తన కార్యకలాపాలపై ఒక నివేదికను రూపొందించింది.
ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించారు. భవిష్యత్తు కార్యక్రమాలను కూడా పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు తేలింది.
వాటిని వెలికి తీయడానికి సర్వేను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఎన్‌ఎండీసీకి అప్పగించారు. మొదటి దశ కింద గద్వాల, వనపర్తి జిల్లాలోని బంగారం గనులపై సమగ్ర సర్వేను నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆత్మకూరు, ధారూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించారు. డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఆత్మకూరు బ్లాకులో 60 పీపీబీ(పార్ట్స్ పర్ బిలియన్) నుంచి 1000 పీపీబీ వరకు బంగారం ఉన్నట్టు గుర్తించారు.
గద్వాల జిల్లా చంద్రగడ్డ బ్లాకులో తవ్వకాలు నిర్వహించగా, బంగారు 25 పీపీబీ నుంచి 165 పీపీబీ వరకు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు బంగారు, వజ్రాల వాల్యూ ఉందనే విషయంపై ఎన్‌ఎండీసీ సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత తేలనుంది. అనంతరం ఈ గనుల నుంచి బంగారం వెలికి తీసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
నీటి కొరతతో గురుకుల విద్యార్థినుల జుట్టు కత్తిరింపు
గురుకులంలో నీటి ఎద్దడి ఉందనే కారణంతో ఓ ప్రిన్సిపల్ విద్యార్థినుల జుట్టు కత్తిరించిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిందని సాక్షి తెలిపింది.
మెదక్ పట్టణంలోని ఎస్టీ మినీ గురుకులంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు ఉన్నారు. వారి వసతి గృహానికి నీటిని సరఫరా చేసే బోరు బావి ఏప్రిల్‌లో ఎండిపోయింది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారింది.
మూడ్రోజులకోసారి రూ.600 వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థినుల తల వెంట్రుకలు పెద్దగా ఉండటంతో నీటి ఖర్చు అధికమవుతుందని భావించిన ప్రిన్సిపల్ అరుణారెడ్డి తల్లిదండ్రులకు, పాఠశాల కమిటీకి సమాచారం ఇవ్వకుండా ఈనెల 9న విద్యార్థినుల జుట్టు కత్తిరింపజేసి వాటిని విక్రయించారు.
ఈ విషయం తెలియడంతో కొంతమంది తల్లిదండ్రులు గురుకులం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రిన్సిపల్ తమ సిబ్బందిపై దాడి చేశారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని తెలిపారని సాక్షి వెల్లడించింది.

టెండర్ల రద్దుతో నష్టమే
పోలవరం ప్రాజెక్టు టెండర్‌ని రద్దు చేసి మళ్లీ పిలవడం (రీ టెండరింగ్) వల్ల నష్టమే తప్ప, లాభమేమీ ఉండబోదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పేర్కొందని ఈనాడు తెలిపింది.
రీ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిర్మాణ గడువు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
వేరే సంస్థకు పనులు అప్పగిస్తే... సాంకేతిక నైపుణయం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని, దానికి ఎవరు పూచీ వహిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ప్రశ్నించింది. వ్యయం పెరిగితే... ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించబోదని కుండబద్దలు కొట్టింది.
రీ టెండరింగ్ నిర్ణయం వల్ల ఒనగూరే లాభనష్టాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే... పోలవరం రీటెండరింగ్‌పై ఒక నిర్ణయానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ సూచించింది.
పోలవరం హెడ్‌వర్క్స్ పనులు చేస్తున్న నవయుగ సంస్థను ముందుగానే తప్పిస్తూ (ప్రీక్లోజర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపధ్యంలో పీపీఏ అత్యవసర సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది.
ప్రీక్లోజర్ నిర్ణయం వల్ల ప్రాజెక్టుపై పడే ప్రభావాన్ని చర్చించడానికే ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, chandrababu/fb
‘దాడులు ఆపకుంటే ఖబడ్దార్’
టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఎక్కడ దాడులు జరిగి నా సహించేది లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
'కొత్త ప్రభుత్వం వచ్చిందని ఇన్ని రోజులూ ఓపిక పట్టాం. ఆ సమయం గడిచిపోయింది. ఇంకా దాడులు కొనసాగి స్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మా తడాఖా చూపిస్తాం. ఏ రూపంలో అయినా ఎదుర్కొంటాం. ఈ దాడులకు ఫుల్‌స్టాప్ పడాల్సిందే. ఎక్కడ ఇటువంటివి జరిగినా మొత్తం పార్టీ రంగంలోకి దిగుతుంది' అని తేల్చిచెప్పారు.
మంగళవా రం విజయవాడలో నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ప్రసంగించారు. 'టీడీపీ నాయకులు, కార్యకర్త లు, టీడీపీకి ఓట్లు వేసిన వారిపై వైసీపీ దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరులో టీడీపీ వారి ఇళ్లను కూల్చివేశారు.
గుంటూరులోని పల్నాడులో గ్రామాలు వదిలి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ 73 రోజుల్లోనే మొత్తం 469 దాడులు చేశారు. అందులో 8 హత్యలున్నాయి. పోలీసులు కూడా నిస్సహాయ స్థి తికి చేరుకున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన వారు తామేం చేయలేమనే పరిస్థితికి వచ్చారంటే వ్యవస్థ ఎటు పోతోంది? వైసీపీ దాడులు ఇలాగే కొనసాగితే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. టీడీపీకి ఓట్లు వేసిన వారితో పలు చోట్ల వైసీపీ నేత లు క్షమాపణలు చెప్పిస్తున్నారు.
పులివెందుల తరహా పంచాయతీ చేయాలంటే కుదరదు. మీడియాను కూడా బెదిరిస్తున్నా రు. జమీన్‌రైతు ఎడిటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేసినా చర్య లు తీసుకోలేదు. అసెంబ్లీలో కూడా నీచంగా వ్యవహరిస్తున్నారు. 151 మంది ఉన్నామని బెదిరిస్తున్నారు. దాడులపై మాట్లా డే అవకాశం ఇవ్వడం లేదు. అయి నా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా పోరాడారు' అని చంద్రబాబు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








