ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం 30వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు - రాజ్‌భవన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు జరుగుతుందని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని రాజ్‌భవన్ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Rajbhavan
కేసీఆర్‌తో జగన్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్‌కు ఆహ్వానం ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్ అక్కడ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా కలిశారు.
గవర్నర్‌తో భేటీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను జగన్ హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో కలిశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లాంఛనప్రాయంగా కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్
వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్షనేతగా జగన్‌ను ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైఎస్సార్‌సీఎల్‌పీ నేతగా వైఎస్ జగన్‌ను బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, పీడిక రాజన్న దొర, బుగ్గన రాజేంద్ర నాథ్, రోజా, నారాయణస్వామి, పినిసె విశ్వరూప్, కోన రఘుపతి, ఆళ్లనాని, ప్రసాదరాజు, ముస్తఫా, ఆదిమూలపు సురేశ్ బలపరిచారు.

ఫొటో సోర్స్, YSRCP
దేవుడి స్క్రిప్ట్ అలా ఉంది!
పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకుంటూ చేసిన తీర్మానం కాపీని జగన్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌కు అందించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నరను కోరుతారు. సాయత్రం 4.30 గంటలకు వీరిద్దరి భేటీ ఉంటుంది.
కాగా ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశంలో జగన్ మాట్లాడుతూ...
‘‘ప్రతి గ్రామంలోని అక్కచెల్లెళ్లు, అన్నతమ్ముళ్లు, ‘అన్నా మేము నీకు తోడున్నాం’ అన్నారు కాబట్టే నేను ముఖ్యమంత్రి, మీరు ఎమ్మెల్యేలు అయినారు. ఆ ప్రజలకు ఎప్పుడూ మనం అండగా ఉండాలి’’ అన్నారు.
‘‘మన పార్టీ నుంచి అన్యాయంగా, అధర్మంగా టీడీపీవారు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. సరిగ్గా 23వ తేదీన వాళ్లకు 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను మాత్రమే దేవుడు ఇచ్చాడు. బహుశా ఇంతకన్నా గొప్పగా ఏ స్క్రిప్టు ఉండదు’’ అని టీడీపీ గురించి జగన్ అన్నారు.
టార్గెట్ 2024
‘‘మన టార్గెట్ 2024. 2024సం.లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తాను.. మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా. ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలి. 6 నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తాను. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్. వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి. ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ. ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024సంవత్సరంలో ఇంతకంటే గొప్పగా గెలవాలి’’ అని సమావేశంలో జగన్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- ఆ పది కీలక నియోజకవర్గాల్లో గెలిచిందెవరు.. ఓడిందెవరు?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: పవన్ కల్యాణ్‌ను ఓడించింది ఎవరు?
- 'చౌకీదార్'కు వీడ్కోలు చెప్పిన మోదీ.. అసలు దాని వెనక కథేంటి
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- కాకినాడలో బయటపడిన బ్రిటిష్ కాలంనాటి తుపాకులు...
- వైఎస్ జగన్ ప్రెస్ మీట్: నేను ఉన్నా.. నేను విన్నా.. అని మరోసారి హామీ ఇస్తున్నా
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమూ కోల్పోయిన పవన్ కల్యాణ్
- నరేంద్ర మోదీ: ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త నుంచి ‘అసాధారణ బ్రాండ్’గా ఎలా మారారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








