'అరబ్బు షేక్‌లకు అసిస్టెంట్‌ అన్నారు.. 300 గొర్రెలకు కాపలా పెట్టారు' - ప్రెస్ రివ్యూ

యువకుడు, సౌదీ బాధితుడు, సమీర్

ఫొటో సోర్స్, Twitter/kumar_marupaka

సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న తనను రక్షించాలంటూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు కేటీఆర్‌కు మొరపెట్టుకోవడంపై సాక్షి ఒక కథనం ప్రచురించింది.

గల్ఫ్‌ దేశంలో తాను అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ తీసిన వీడియోను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ సమీర్‌ (21) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తనను విడిపించాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

తనను స్వదేశానికి రప్పించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావును వేడుకున్నారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఏజెంట్‌ వాహిద్‌ సౌదీ అరేబియాలోని సిటీలో ఫామ్‌హౌస్‌లో పని అని, నెలకు రూ.1,200 రియాళ్లు (రూ.22 వేలు) జీతం అని సమీర్‌కు చెప్పారు.

అరబ్బు షేక్‌లకు అసిస్టెంట్‌గా పనిచేయాలని, ఫామ్‌ హౌస్‌ పని సులభంగా ఉంటుందని వివరించారు. అతడి మాటలు నమ్మిన సమీర్‌.. రూ.83 వేలు చెల్లించి వీసా తీసుకున్నారు. 2019 ఏప్రిల్‌ 15 సమీర్‌ సౌదీ అరేబియా వెళ్లారు. విమానాశ్రమంలో రిసీవ్‌ చేసుకున్న కఫిల్‌ (వీసా ఇచ్చిన యజమాని) నేరుగా సిటీకి 1,200 కిలోమీటర్ల దూరంలోని గొర్రె షెడ్డు వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. 300 గొర్రెలకు కాపలా ఉండాలని చెప్పడంతో సమీర్‌ కంగుతిన్నారు.

'కేటీఆర్‌ అన్నా నీ కాల్మొక్త.. జెర ఇంటికి పంపించుండ్రి అన్నా..'అంటూ కన్నీరు పెట్టాడు. 'బండిలో ఎక్కడికో తీసుకపోయి టార్చర్‌ చేస్తుండు. బెదిరిస్తుండు' అంటూ సమీర్‌ వాపోయారు. ఇక్కడుంటే తనకు చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సమీర్‌ను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.

పల్లె వెలుగు బస్సు, టీఎస్ ఆర్టీసీ

ఫొటో సోర్స్, fb/TSRTCHQ

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గుట్కా కోసం స్టీరింగ్ వదిలేసిన డ్రైవర్.. బస్సు బోల్తా

గుట్కా తినేందుకు డ్రైవర్ స్టీరింగ్‌ వదిలేయడంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం పీవీనగర్‌ సమీపంలో బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడిందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం, బస్సులో 63 మంది ప్రయాణిస్తుండగా 30 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ స్టీరింగ్‌ను వదిలేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ఓ ప్రయాణికురాలు తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు బుధవారం ఉదయం 9.50 గంటలకు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. 11.45 గంటల సమయంలో మల్హర్‌ మండలంలోని మానేరు వంతెన దాటగానే బస్సు ఎడమవైపు బోల్తా పడింది. ప్రారంభం నుంచీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి వాహనాన్ని వేగంగా నడపసాగాడు. వాహనం వంతెన దాటగానే స్టీరింగ్‌పై చేతులు తీసేసి గుట్కా తినసాగాడు. అదేసమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో హఠాత్తుగా బ్రేక్‌ వేయడంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల గోతిలో పడింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది.

పలుమార్లు బస్సులో ఉన్నవారు నెమ్మదిగా వాహనాన్ని నడపాలని హెచ్చరించినా డ్రైవర్‌ పెడచెవిన పెట్టాడని ప్రయాణికులు ఆరోపించారు.

తాను డ్రైవర్‌ సమీపంలో ఉన్న సీట్లో కూర్చున్నానని, డ్రైవర్‌ రెండు చేతులు వదిలి గుట్కా ప్యాకెట్‌ నోట్లో వేసుకుంటున్నాడని, ఆ సమయంలో ఎదురుగా లారీ రావడంతో బ్రేకులు వేయగా బస్సు అదుపు తప్పి గోతిలో పడిపోయిందని ఒక ప్రయాణికురాలు తెలిపారని ఈనాడు పేర్కొంది.

కర్నూలు రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు

15 రోజుల్లో 300 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఏటా 8 వేల మందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని చర్యలూ చేపడతామన్నారు. బుధవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అదుపు చేసేందుకు పోలీసు, రవాణా ఇత ర ప్రభుత్వ శాఖలతో కలిసి గతేడాది ఉమ్మడి చర్యలు చేపట్టామన్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య తగ్గి, మరణాల శాతం తొమ్మిదికి పైగా తగ్గిందని స్పష్టం చే శారు. అయితే ఈ ఏడాది ఎన్నికల నిర్వహణకు ఎక్కు వ ప్రాధాన్యమివ్వడంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంపై దృష్టి సారించలేక పోయామన్నారు. దీంతో గడిచిన 4 నెలల్లో ప్రమాదాలు పెరిగాయన్నారు.

ప్రజల్లో అవగాహనలోపం, నిర్లక్ష్యం కూడా కొంత కారణమని, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని డీజీపీ అన్నా రు. రాయలసీమతోపాటు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు 20 పాయింట్లు సిద్ధం చేశామన్నారు.

అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌ రూట్లో వెళ్లడం, సిగ్నళ్లు పాటించకపోవడం, ఇంజనీరింగ్‌ లోపాలు ప్రమాదాలకు కారణాలని చెప్పారు.

bbc

ఫొటో సోర్స్, Getty Images

పల్లెల్లో ఓటు చైతన్యం

ఓటు హక్కును వినియోగించుకోవడంలో పల్లె ప్రాంతాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు తాజాగా ముగిసిన పరిషత్ పోరులోనూ గ్రామాల ఓటర్లు అగ్రభాగాన నిలిచారని నమస్తే తెలంగాణ రాసింది.

తెలంగాణలో మూడు విడుతల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 77.46% ఓటింగ్ నమోదైంది.

మొత్తం 1,56,02,845 మంది ఓటర్లకుగాను 1,20,86,385 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

మహిళలు, పురుషులవారీగా చూసినప్పుడు.. 61,18,745 మంది మహిళలు (77.68%), 59,67,616 మంది పురుషులు (77.24%) ఓటేశారు. ఇతరుల ఓట్లు 24 పోలయ్యాయి.

అత్యధికంగా పోలింగ్‌శాతం రికార్డును మళ్లీ యాదాద్రి భువనగిరి జిల్లానే దక్కించుకున్నది. పంచాయతీతోపాటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లోనూ ముందంజలో నిలిచింది.

పరిషత్ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా 87.02% సగటుతో మొదటిస్థానంలో నిలువగా.. 70.40 శాతంతో వికారాబాద్ జిల్లా ఆఖరుస్థానంలో ఉన్నది. పరిషత్ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో సగటున 80 నుంచి 90 శాతం మధ్య ఓట్లేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ 87.30% ఓటింగ్ జరిగింది. ఇందులో మహిళలు ఎక్కువగా 87.97%, పురుషులు 86.62%, ఇతరులు 8.57% ఓట్లేశారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.60%, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 77.04% ఓటింగ్ జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)