స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ: 'దిల్లీలో చక్రం తిప్పుదాం' - ప్రెస్ రివ్యూ

స్టాలిన్‌తో సమావేశమై కేసీఆర్

ఫొటో సోర్స్, kcr/fb

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని.. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తూ సమాఖ్య కూటమివైపు రావాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారని ఈనాడు పేర్కొంది.

ఈ నెల 23న వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, తర్వాత కేంద్రంలో పరిణామాలు, ఇరు పార్టీలకు రాబోయే లోక్‌సభ స్థానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానంగా ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చించినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌, భాజపాయేతర సంకీర్ణ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, ఈ సమయంలో టీఆర్ఎస్, డీఎంకే లాంటి పార్టీలు కలిసి నడిస్తే దిల్లీలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ వివరించారు. ఈ క్రమంలో చేస్తున్న తమ ప్రయత్నానికి మద్దతుపలికి సమాఖ్య కూటమిని బలోపేతం చేయాలని కోరారు.

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం తగ్గి అదే సమయంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరగాలని వివరించారు. అప్పుడే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని, ఫలితంగా రాష్ట్రాల హక్కులను సాధించుకోవచ్చని చెప్పారు.

సమాఖ్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఎంపీలు వినోద్‌, సంతోష్‌కుమార్‌లతో కలిసి చెన్నై చేరుకున్న ఆయన సోమవారం సాయంత్రం 4.25 గంటలకు స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

స్టాలిన్‌తోపాటు పార్టీ కోశాధికారి దురైమురుగన్‌, మరో సీనియర్‌ నేత టీఆర్‌ బాలు వారికి సాదర స్వాగతం పలికారు. దాదాపు గంటా పదిహేను నిమిషాలపాటు సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కేసీఆర్‌కు స్టాలిన్‌ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. జ్ఞాపిక ప్రదానం చేశారని ఈనాడు తెలిపింది.

కమల్ హస్

ఫొటో సోర్స్, kama haasan/fb

స్వతంత్ర భారత్‌లో.. తొలి తీవ్రవాది హిందువే!

నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సేను తొలి తీవ్రవాదిగా అభివర్ణించారు. కమల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. ఆయనపై ఐదురోజుల ప్రచార నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి (ఈసీకి) విజ్ఞప్తిచేసింది.

మరోవైపు కమల్‌హాసన్‌కు కాంగ్రెస్‌పార్టీ, ద్రవిడర్ కజగం సంస్థ మద్దతు పలికాయి. కమల్‌హాసన్ సోమవారం తమిళనాడులోని కరుర్ జిల్లా అరవకురిచి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది ఓ హిందువని, అతడే మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సే అని పేర్కొన్నారు.

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడ్డాను కాబట్టే ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఓ హిందువు. అతడే నాథూరామ్ గాడ్సే. అక్కడి నుంచే తీవ్రవాదం మొదలైంది అని పేర్కొన్నారు. తాను గాంధీజీకి మనుమడి వంటివాడినని, ఆయన హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు కోరేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. నిజమైన భారతీయులు త్రివర్ణ పతాకంలోని రంగులను, వాటి వెనుక ఉన్న విశ్వాసాలను చెక్కుచెదురకుండా కాపాడుకుంటారని చెప్పారు.

కమల్‌హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కమల్ విభజనరాజకీయాలకు పాల్పడుతున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. గాంధీజీ హత్యకు గురైనప్పుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైందని, ప్రతిఒక్కరూ బాధపడ్డారని పేర్కొన్నారు.

గాడ్సే చేసిన క్రూరమైన చర్యకు అప్పడే తగిన శిక్ష పడిందని చెప్పారు. ఇప్పుడు కమల్‌హాసన్ ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతానికి వెళ్లి హిందూ తీవ్రవాదం అంటూ ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకొస్తానని చెప్పిన ఆయన.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విశ్వరూపం విడుదలకు అడ్డంకులు ఎదురైనప్పుడు దేశం వదిలి వెళ్లిపోతానని అన్నారని, ఇప్పుడు దేశం, దేశభక్తి, గాంధీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.

కమల్‌హాసన్ ఐదురోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదుచేసింది. ఆయన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఈసీకి లేఖ రాశారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

హైకోర్టు

ఫొటో సోర్స్, High court website

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ చౌహాన్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసిందని సాక్షి వెల్లడించింది.

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా చౌహాన్‌ వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది.

రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. జస్టిస్‌ చౌహాన్‌ నేపథ్యం... జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు.

2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఇటీవల కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

దీనితో సీనియర్‌ అయిన జస్టిస్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేపథ్యం జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 1958 జూన్‌ 30న జన్మించారు.

మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సీనియర్‌ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్‌.మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్‌ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారని సాక్షి పేర్కొంది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, chandrabau naidu/fb

టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు

'ఈ ఎన్నికల్లో మనం గెలిచేశాం. ఈ నెల 23న జరిగే కౌంటింగ్‌లో మన గెలుపు లాంఛనం మాత్రమే' అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

సోమవారం హ్యాపీ రిసార్ట్స్‌లో నంద్యాల, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 326వ ఆరాధనోత్సవాల సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రానికి చంద్రబాబు పూలమాల వేసి స్మరించుకున్నారు.

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలుగుదేశం నాయకులు నివాళులర్పించారు. అనంతరం సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించడంతో పాటు అనేక రకాల విశ్లేషణలు చేయించామని వెల్లడించారు.

'ఈ సారి జరిగిన సర్వేలు విలక్షణంగా, విశ్లేషణలు వినూత్నంగా జరిగాయి. అన్నిటిలో టీడీపీకే ఆధిక్యం వచ్చింది. 40 ఏళ్లలో జరగని సంక్షేమం, అభివృద్ధి ఈ ఐదేళ్లలో చేశాం. ఒక్క మహిళలకే రూ.లక్ష కోట్ల సంక్షేమం చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు మరరో రూ.లక్ష కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాం.

రైతులకు రూ. 24 వేల కోట్ల రుణమాఫీ, పెట్టుబడి సాయం కింద మరో రూ.14 వేల కోట్లు ఇచ్చాం' అని తెలిపారు. నంద్యాల, కర్నూలు రెండు లోక్‌సభ సీట్లలోనూ టీడీపీ ఘన విజయం సాధిస్తోందని చెప్పారు. సంస్థాగత బలమే ఈ ఎన్నికల్లో టీడీపీకి అక్కరకొచ్చిందన్నారు.

'65 లక్షల మంది కార్యకర్తలు, 4 లక్షల మంది సేవామిత్రలు, 45 వేల మంది బూత్‌ కన్వీనర్లు, 5 వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారు. అందరూ తామే అభ్యర్థులుగా భావించి కష్టపడి పనిచేశారు. ఈ దఫా ఎన్నికల్లో అన్ని స్థాయిల్లో అద్భుత పనితీరు కనబరిచారు. క్షేత్రస్థాయిలో అందరూ చాలా గొప్పగా పనిచేశారు. బూత్‌ కన్వీనర్లు, ఏరియా కన్వీనర్లు పార్టీకి అండగా నిలబడ్డారు. ఏ విధమైన ప్రలోభాలకు లోను కాలేదు. నీతి, నిజాయితీతో పనిచేశారు' అని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)