ఐపీఎల్ 2019: ఫైనల్ చేరినా ధోని అసంతృప్తి, ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ కోసం
విశాఖలో జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో పోరుకు సిద్ధమైంది.
టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్న చెన్నై జట్టు దిల్లీ కేపిటల్స్ జట్టును 147 పరుగులకే కట్టడి చేసింది. 9 వికెట్లు కోల్పోయి దిల్లీ జట్టు ఈ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు డుప్లెసిస్, షేన్ వాట్సన్‌లు అర్ధ శతకాలతో రాణించారు. ఏడేళ్ల తర్వాత ప్లేఆఫ్ దశకు చేరిన దిల్లీ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉండగా నిష్క్రమించింది.

ఫొటో సోర్స్, Getty Images
యువ ప్లేయర్ల ఆటగా భావించే ఐపీఎల్‌లో సీనియర్లతో కూడిన చెన్నై జట్టు.. యువకులతో నిండిన దిల్లీపై విజయం సాధించింది. ఇప్పుడు అందరూ ఆలోచించే ప్రశ్న ఇదే... సీనియర్లతో నిండిన చెన్నై ఐపీఎల్‌లో ఎలా విజయవంతమవుతోంది అని.
దిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దీనికి సమాధానం ఇచ్చాడు. "చెన్నై విజయాలకు ప్రధాన కారణం సరైన భాగస్వామ్యం. ఇన్నింగ్స్‌లో అవసరమైన సందర్భంలో సరైన భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోవడమే మా ఓటమికి కారణం. చెన్నై జట్టులో ఆ సమస్య ఉండదు."

ఫొటో సోర్స్, Getty Images
చెలరేగిన వాట్సన్-డుప్లెసిస్ జోడీ
చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫా డుప్లెసిస్‌లు తమ ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఆటను పూర్తిగా ఏకపక్షం చేసేశారు. ఆరంభం నుంచే దిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి, ఆధిపత్యం చెలాయించారు.
వీరిద్దరూ కలసి 10.2 ఓవర్లలో 81 పరుగులు జోడించారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో రెండో ఓవర్లో లభించిన ఓ అద్భుత అవకాశాన్ని దిల్లీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. బ్యాట్స్‌మన్ ఇద్దరూ ఒకే వైపు పరుగు తీసినా, దిల్లీ ఫీల్డర్లు రనౌట్ చేసే అవకాశాన్ని అందుకోలేకపోయింది. దీనికి ఆ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక ఆ తర్వాత వీరిద్దరూ దిల్లీ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. డుప్లెసిస్ 39 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. మరోవైపు షేన్ వాట్సన్ కూడా తన అద్భుత బ్యాటింగ్ నైపుణ్యంతో 32 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు.
వీరిద్దరూ చాలా తెలివిగా బ్యాటింగ్ చేశారు. గతి తప్పిన బంతుల కోసం ఓపిగ్గా ఎదురుచూశారు. ఐదో ఓవర్ నుంచి వీరి ప్రతాపం మొదలైంది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్లోనే దిల్లీ జట్టు ఆశలను షేన్ వాట్సన్ ఆవిరి చేశాడు. కీమో పాల్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సులు, ఓ ఫోర్‌తో సహా మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు.
కానీ ఆ తర్వాత అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ట్రెంట్ బోల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వాట్సన్ పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే చెన్నై జట్టు సురక్షిత స్థితికి చేరింది.
మరో ఎండ్ నుంచి డుప్లెసిస్ తనకు ఎంతో సహకారమందించాడని మ్యాచ్ అనంతరం వాట్సన్ వ్యాఖ్యానించాడు. వాట్సన్ ఔటయ్యే సమయానికి చెన్నై స్కోరు 109/2. అప్పటికే చెన్నై విజయం దాదాపు ఖరారైపోయినట్లే అనిపించింది.
కానీ ఆ తర్వాత వెంటవెంటనే సురేశ్ రైనా, ధోనీ ఔట్ కావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగింది. రైనా 11 పరుగులు, ధోనీ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో చెన్నై జట్టుకు విజయం అందించి, ఫైనల్లో చోటు ఖాయం చేశారు. రాయుడు 20 పరుగులతో, బ్రావో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
దిల్లీ బౌలర్లు ట్రెంట్ బోల్ట్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఫొటో సోర్స్, TWITTER/RISHABH PANT
దిల్లీని కట్టడి చేసిన చెన్నై బౌలర్లు
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఒక్కడే చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 25 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 38 పరుగులు చేశాడు.
కొలిన్ మున్రో 27, శిఖర్ ధవన్ 18 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఒత్తిడి పెంచారో దీన్ని బట్టే అర్థమవుతుంది.
12.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేసిన దిల్లీ కేపిటల్స్ కష్టాల్లో పడింది.
చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
ధోనీ అసంతృప్తి
తమ ఆటగాళ్లు క్యాచ్‌ను వదిలేయడం, ఫీల్డింగ్ తప్పిదాల పట్ల చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ అసహనం వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు ముందు ఇలాంటి పొరపాట్లు ఏమాత్రం మంచిది కాదన్నాడు. ఫైనల్‌కు చేరడంలో తమ బౌలర్ల కృషిని ప్రశంసించాడు.
గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్‌లో ఓడించి చెన్నై జట్టు ఫైనల్ చేరింది. ఫైనల్లోమళ్లీ హైదరాబాద్ జట్టునే ఓడించి టైటిల్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ 117 పరుగులతో అజేయంగా నిలిచి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో కూడా వాట్సన్ 16 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు.
ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఆదివారం నాడు హైదరాబాద్‌లో ముంబయి, చెన్నై జట్ల మధ్య ఫైనల్ పోరు మీదే.
ఈ సీజన్‌లో లీగ్ దశలో తలపడిన రెండుసార్లు, క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓసారి ముంబయి జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది.
ఈ మూడు విజయాలకు చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందో, లేక ముంబయి తమ విజయ పరంపరను కొనసాగిస్తూ టైటిల్ ఎగరేసుకుపోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి.
- ఐపీఎల్ 2019: చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు సక్సెస్ సీక్రెట్ చెప్పిన ధోనీ
- ఐపీఎల్ 2019: కేఎల్ రాహుల్‌కు చెడ్డపేరు రాకుండా అశ్విన్ కాపాడాడా
- రసెల్: మూడు పరుగులు తప్ప మిగతావన్నీ సిక్సర్లు, ఫోర్లే
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
- రవి ప్రకాశ్‌పై కేసేంటి? టీవీ9లో ఏం జరిగింది?
- ‘ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత టాక్సీలా ఉపయోగించింది’: నరేంద్ర మోదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








