హైదరాబాద్‌లోని డి.మార్ట్‌లో బాంబుపెట్టిన మిలిటెంట్ అరెస్ట్.. ఈ వైరల్ వీడియో వెనుక అసలు నిజం?: FactCheck

ఫొటో సోర్స్, facebook/HanifPatel/MidDay/LokMat
- రచయిత, బీబీసీ
- హోదా, తెలుగు డెస్క్
ఫేక్‌న్యూస్ ఎంత త్వరగా వ్యాపిస్తుంది.. ఎలాంటి సందర్భాల్లో వ్యాపిస్తుందో అర్థం చేసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని చాటిచెప్పే ఘటన తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉన్న 'డిమార్ట్' షాపింగ్ మాల్‌లో మిలిటెంట్‌ను పట్టుకున్నారంటూ ఒక వీడియో ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లతో పాటు వాట్సాప్‌లోనూ విపరీతంగా షేర్ అవుతోంది.

ఫొటో సోర్స్, UGC/Whatsapp
కశ్మీర్‌లోని పుల్వామాలో మిలిటెంట్లు దాడిచేసి పెద్దసంఖ్యలో భారతీయ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘటనతో దేశమంతా ఒకరమైన గంభీరమైన వాతావరణం నెలకొన్న వేళ... హైదరాబాద్‌లో ఒక మిలిటెంట్‌ను పోలీసులు పట్టుకున్నారంటూ తెరపైకి వచ్చిన ఈ వీడియో తెగ షేరవుతోంది.

ఫొటో సోర్స్, Youtube
సైనికులపై మిలిటెంట్ల దాడితో దేశ ప్రజలంతా ఆవేశంగా ఉన్న సమయం కావడంతో ఈ వీడియోను ఎవరు చూసినా వాస్తవాన్ని తెలుసుకోకుండా వెంటనే షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇందులో నిజమెంత? అన్నది పరిశీలిస్తే అసలు ఈ వీడియోకు హైదరాబాద్‌కు సంబంధమే లేదని తేలింది.
అంతేకాదు.. ఈ వీడియోలో చూపిన దృశ్యమంతా వాస్తవ ఘటనా కాదు.
అందులో ఉన్నది పోలీసులే అయినా వారి ఆపరేషన్ మాత్రం నిజం కాదు. అది ఒక మాక్ డ్రిల్.

ఫొటో సోర్స్, facebook/HanifPatel/MidDay/LokMat
ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా?
ఈ వీడియోలో ఉన్నది అసలైన పోలీసులే. జరిగింది డి.మార్ట్‌లోనే. కానీ, ఆ డి.మార్ట్ హైదరాబాద్‌లోనిది కాదు, వారు హైదరాబాద్ పోలీసులూ కారు. ముంబయిలోని విరార్ ప్రాంతంలో ఉన్న డి.మార్ట్ అది.
ఫిబ్రవరి 14న సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా పోలీసులు.. రియట్ కంట్రోల్ పోలీస్(ఆర్సీపీ), క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ)తో కలిసి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా అదేరోజు, 'మిడ్ డే' ఆ మరుసటి రోజు రిపోర్ట్ చేసిన కథనాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
పోలీసులు హఠాత్తుగా అక్కడకు వచ్చి డి.మార్ట్‌ను తమ అధీనంలోకి తీసుకుని అరగంట పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ బాంబ్ పెట్టిన ఒక మిలిటెంట్‌ను పట్టుకున్నారని.. 30 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌తో వినియోగదారులు, దుకాణంలో పనిచేసేవారు అంతా షాకయ్యారని.. అయితే, ఇదంతా మాక్ డ్రిల్ అని పోలీసులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారని ఇతర పత్రికలు, వెబ్‌సైట్లూ ప్రచురించాయి.
ఒక వేళ నిజంగా ఇలాంటి సందర్భం వస్తే ఎలా స్పందించాలనేది పరీక్షించి చూసుకునేందుకు వారిలా చేశారు. పోలీస్ శాఖలో ఇలాంటి మాక్ డ్రిల్స్ సహజం.
కానీ, ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడున్న కొందరు దీన్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ రోజు ముంబయిలోనూ ఇది వైరల్‌గా మారింది. ఆ తరువాత హైదరాబాద్‌లో జరిగిన ఘటనగా రూపం మార్చుకుని సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ వ్యాపించింది.
నిజానికి ఈ ఘటనను తన కెమేరాలో బంధించిన 'లోక్‌మత్' ఫొటోగ్రాఫర్ హనీఫ్ పటేల్ ఈ దృశ్యాలతో ఉన్న 'హెచ్‌పీ లైవ్' యూట్యూబ్ వీడియోను ఫేస్‌బుక్‌లో అదే రోజు పెట్టారు. ఆయన అక్కడ మాక్‌డ్రిల్‌గానే పేర్కొన్నారు.
మాక్ డ్రిల్ మాత్రమే: ‘బీబీసీ తెలుగు’కి చెప్పిన మహారాష్ట్ర పోలీసులు
ఈ విషయాన్ని 'బీబీసీ తెలుగు' పాల్ఘార్ జిల్లా పోలీసుల నుంచి ధ్రువీకరించుకుంది. సోషల్ మీడియాలో కనిపించిన ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా ఇది కేవలం మాక్ డ్రిల్ అని వారు స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో దీనిపై ప్రచారమవుతున్న ఫేక్‌న్యూస్‌ను ఎవరూ నమ్మొద్దని, ఇంకెవరికీ ఫార్వర్డ్ చేయరాదని సూచించారు.

ఫొటో సోర్స్, Youtube
జాగ్రత్తగా పరిశీలించాలి
ఇలాంటి కంటెంట్ ఎవరికైనా వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో చూసినప్పుడు నిజానిజాలు పరిశీలించుకోకుండా షేర్‌చేయరాదు.
అత్తాపూర్‌లో డి.మార్ట్‌లో మిలిటెంట్‌ను పట్టుకున్నట్లుగా చెబుతున్న ఈ వీడియోని చూస్తే ప్రాథమిక పరిశీలనలోనే 3 అంశాలు ఇది హైదరాబాద్‌కు చెందినది కాదని చెబుతున్నాయి.
1. ఈ వీడియోలో కనిపిస్తున్న రకం వాహనాలు ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల వద్ద పెద్దగా వినియోగంలో లేవు.
2. పోలీస్ వాహనంపై 'సురక్షా పథక్' అని హిందీలో రాసి ఉంది. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై ఇలా ఉండదు.
3. అలాగే, లోగో కూడా స్పష్టంగా కనిపించనప్పటికీ తెలంగాణ పోలీసుల లోగో కాదని మాత్రం అర్థమవుతోంది.
వీటి ఆధారంగానే ఇది హైదరాబాద్ ఘటన కాదని తెలిసిపోయింది.
ఇక ఈ దృశ్యం వాస్తవమా కాదా? ఎక్కడ జరిగిందన్నది తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో ప్రాథమికంగా చేసిన శోధనలోనే వివరాలు తెలిశాయి.
ఈ చిత్రాలు, వీడియోలతో ఉన్న అనేక పోస్టింగులు సోషల్ మీడియా, ఆన్‌లైన్లో ఉండగా అందులో దీనిపై జరిగిన ఫేక్‌న్యూస్ ప్రచారంతో పాటు ఘటన జరిగిన రోజునే ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తా కథనాలూ ఉన్నాయి.
వాటి ఆధారంగా ముంబయిలో పాల్ఘార్ జిల్లా పోలీసులు ఈ మాక్‌డ్రిల్ చేపట్టినట్లు ప్రాథమికంగా తెలుసుకున్న ‘బీబీసీ తెలుగు’ నేరుగా వారినే సంప్రదించింది. ఇది ముంబయిలోని విరార్ డి.మార్ట్ వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్ మాత్రమే అని, నిజంగా మిలిటెంట్‌ను పట్టుకోలేదని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మాక్ డ్రిల్ కాదని కూడా స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, CyberabadPolice
తప్పుగా ప్రచారం అవుతున్న ఈ వీడియో విషయంలో హైదరాబాద్ పోలీసులూ స్పందించారు. శనివారం వారు దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ డిప్యూట కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్.ప్రకాశరెడ్డి జారీ చేసిన ప్రకటనలో.. ఇది పూర్తిగా అవాస్తవ వీడియో అని, హైదరాబాద్‌లో జరిగింది కాదని తెలిపారు.
ముంబయిలోని విరార్ ప్రాంతంలో మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ అని చెబుతూ.. ఈ వీడియోను హైదరాబాద్‌లో జరిగినట్లుగా ఎవరూ షేర్ చేయొద్దని కోరారు. అలా చేస్తే చట్టప్రకారం శిక్హార్హులవుతారని తెలిపారు.
కశ్మీర్ దాడి నేపథ్యంలో హైదరాబాద్‌లో గట్టి భద్రతా చర్యలు చేపట్టామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల వేళ జోరుగా ‘జంపింగ్స్’
- ఆ ఊరిలో ఏ ఇంట్లో చూసినా మిసైళ్ళే...
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








