చిగురుపాటి జయరాంను ఎలా చంపేశారంటే

ఫొటో సోర్స్, facebook/JayaramChigurupati
గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య సంచలనంగా మారింది. ఫార్మా, మీడియా, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వ్యాపారాలు నిర్వహించే జయరాం మృతదేహాన్ని జనవరి 31 అర్ధరాత్రి పోలీసులు కనుగొన్నారు. తర్వాత ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు.
ఎవరీ జయరాం?
జయరాం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. ఫార్మా రంగంలో అడుగుపెట్టి, అనంతరం మీడియా, బ్యాంకింగ్ వ్యాపారాల్లోనూ ప్రవేశించారు. సొంతంగా ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ టీవీ నష్టాలతో మూతపడింది. కోస్టల్ బ్యాంక్ అనే సంస్థనూ ప్రారంభించారు.
వ్యాపారంలో ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నంలో ఉన్నట్టు బంధువులు చెబుతున్నారు.
జయరాం ప్రస్తుతం కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్నారు. హెమారస్ ఫార్మా కంపెనీ ఎండీగా పనిచేస్తున్నారు. ఔషధాలు, కళ్లద్దాల తయారీ సంస్థలూ ఆయనకు ఉన్నాయి.
జయరాం భార్య, పిల్లలు ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. ఆయన తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటారు.

చిగురుపాటి జయరాం మృతి వెనుక మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐడీ అధికారులు, కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి కూడా రంగంలోకి దిగారు.
రాత్రి 11.30 ప్రాంతంలో తాము ఘటనా స్థలానికి వచ్చి చూసినట్టు డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
తొలుత ప్రమాదంగా భావించినప్పటికీ ఘటన తీరు అందుకు విరుద్ధంగా ఉండడంతో అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మృతదేహాన్ని కారులో చూసిన వెంటనే అక్కడ దొరికిన మొబైల్ ఫోన్, ఇతర కార్డుల్లోని వివరాల ఆధారంగా జయరాం సంస్థల్లోని ఒక మేనేజర్‌ను సంప్రదించామని, ఆయనకు వాట్సాప్‌లో ఫొటో పంపించగా జయరాం మృతదేహమేనని నిర్ధారించారని డీఎస్పీ చెప్పారు.

ఎవరా తెల్లచొక్కా వ్యక్తి?
మరణానికి రెండు రోజుల ముందు నుంచి జయరాం ఇంట్లో లేరని.. వ్యక్తిగత సెక్యూరిటీని, డ్రైవర్‌ను కూడా వెంట తీసుకెళ్లకుండా ఒక్కరే బయటకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
దర్యాప్తులో భాగా పోలీసులు హైదరాబాద్-విజయవాడ మార్గంలోని టోల్‌గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌లను సేకరించారు. జనవరి 31న మధ్యాహ్నం విజయవాడలో వసతి ఏర్పాటు చేయాలంటూ తన సంస్థలో ఉద్యోగి ఒకరికి జయరాం మెసేజ్ పంపించారని పోలీసులు నిర్ధరించారు.
పంతంగి, సూర్యాపేట టోల్‌గేట్లలో సీసీ ఫుటేజ్ సేకరించామని.. పంతంగి వద్ద లభించిన ఫుటేజ్ ఆధారంగా జయరాం వెళ్తున్న కారును తెల్లచొక్కా వేసుకున్న వ్యక్తి నడుపుతున్నట్లు గుర్తించామని డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ఈ తెల్లచొక్క వేసుకుని, కారు నడిపిన వ్యక్తి కోసం ఆరా తీసిన పోలీసులకు.. జయరాంది హత్యే అనడానికి తగిన ఆధారాలు దొరికాయి.
విష ప్రయోగం?
జయరాం కారులో రెండు బీర్ సీసాలను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. మృతదేహం లభించిన సమయానికి 24 గంటల ముందే విషం ఇచ్చి చంపినట్లు మొదట్లో పోలీసులు భావించారు. కానీ భౌతిక దాడి, గుండె సంబంధ సమస్యలతోనే జయరాం చనిపోయి ఉండవచ్చని ప్రస్తుతం ఓ నిర్థారణకు వచ్చారు.
హత్యకు ఆర్థిక వ్యవహారాలతో పాటు వివాహేతర సంబంధాలు కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు విచారించిన వారిలో కొందరు కుటుంబ సభ్యులు, బ్యాంకు అధికారులు, కారు డ్రైవర్, ఇతర సిబ్బంది ఉన్నారు.
జయరాం కాల్ డాటా ప్రకారం ఆయన ఫోన్ నుంచి చివరి కాల్ భార్య పద్మజకు వెళ్లింది.
మరోవైపు ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీసులు ప్రశ్నించారు.

హత్య ఎలా జరిగింది?
జయరాం హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు, ఈరోజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
"జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్‌లను అరెస్టు చేశాం. రాకేశ్ రెడ్డి నుంచి ఓసారి రూ.2.5 కోట్లు, మరోసారి రూ.కోటిన్నర రూపాయలను జయరాం అప్పుగా తీసుకున్నారు. ఒకవేళ ఈ అప్పును తీర్చలేకపోతే తన ఇంటిని ఇస్తానని జయరాం హామీ ఇచ్చారు.
కానీ ఆ ఇంటిపై అప్పటికే లోన్ ఉందని రాకేశ్‌కు ఆ తర్వాత తెలిసింది. తన డబ్బును ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా జయరాం నుంచి రాకేశ్ రెడ్డికి ఎలాంటి స్పందనా రాలేదు" అని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి వెల్లడించారు.
అమెరికా వెళ్లిపోయిన జయరాం... 2018 మొదట్లో మా కంపెనీలో సమస్య ఉందని, మీతో శిఖా చౌదరి మాట్లాడుతుందని రాకేశ్‌తో చెప్పారు. అప్పటి నుంచే రాకేష్ కు శిఖాతో పరిచయం ఏర్పడింది.
జయరాం డబ్బుకోసం చాలా ప్రయత్నించారు. శిఖాను కూడా అడిగారు.
చివరికి ఈనెల 31న జయరాంను ఆయన ఇంట్లోనే రాకేశ్ కొట్టడంతో జయరాం చనిపోయారు.
తర్వాత ఈ హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించాలని ఆ మృతదేహాన్ని కారులో తీసుకుని విజయవాడ హైవే పై వదిలేసి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.
జయరాం హత్య కేసులో పోలీసుల పాత్ర
జయరాం హత్యోదంతం అటు తెలంగాణ, ఇటు ఏపీ పోలీసులకు కూడా చుట్టుకుంది. తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీసుల పాత్ర ఉందని ఎస్పీ త్రిపాఠీ వెల్లడించారు. అంతేకాకుండా నిందితుడు రాకేశ్ రెడ్డితో మాట్లాడినట్టు నిర్ధారణ జరగడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై కూడా వేటు పడింది.
అమెరికన్ ఎంబసీకి జయరాం పాస్‌పోర్ట్
చిగురుపాటి జయరాంకు అమెరికా పౌరసత్వం ఉంది. దాంతో ఆయన పాస్‌పోర్ట్‌ని అమెరికన్ ఎంబసీలో అప్పగించబోతున్నట్టు ఆయన భార్య పద్మశ్రీ తెలిపారు. పక్షపాతం లేకుండా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శిఖా చౌదరి ప్రమేయం లేకుండా ఈ హత్య జరిగే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అక్క వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని జయరాం చాలామార్లు చెప్పినట్టు ఆమె వెల్లడించారు. శిఖా పాత్ర మీద పూర్తిగా దర్యాప్తు చేయాలని ఏపీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె కోరారు.
ఇవి కూడా చదవండి.
- అమెరికాలో తెలుగు విద్యార్థులు మోసపోతున్నారా, మోసం చేస్తున్నారా...
- Fact Check: ప్రియాంక గాంధీ మద్యం మత్తులోనే అలా చేశారా...
- జార్జి ఫెర్నాండెజ్: 'ఎమర్జెన్సీ టైమ్‌లో ఆయనను కచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారనిపించింది'
- 32 ఏళ్ల వయసులో పడుకుంటే, ‘15 ఏళ్ల వయసులో’ మెలకువ వచ్చింది
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడండి ఇలా..
- #10YearChallenge: ఈ సోషల్ మీడియా చాలెంజ్‌లో ఫొటోలు పెడుతున్నారా... జాగ్రత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








