బడ్జెట్ 2019: వ్యవసాయానికి లక్షన్నర కోట్లు... రక్షణ రంగానికి మూడు లక్షల కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
ఇది పేరుకు మధ్యంతర బడ్జెట్ అయినా.. పూర్తిస్థాయి బడ్జెట్‌లాగే ధ్వనించింది. ’’ఇది మధ్యంతర బడ్జెట్ కాదు.. భారత్‌ను ప్రగతి పథంలో నడిపించే వాహనం" అని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
ఇది ప్రధానంగా గ్రామీణ, పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా అర్థమవుతోంది.
రైతులకు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెద్దపీట వేశారు. అలాగే, రక్షణ రంగానికి మూడు లక్షల రూపాయలు కేటాయించారు.
రూ.5 లక్షల లోపు వ్యక్తిగత వార్షిక ఆదాయం కలిగిన వారికి ఊరటనిచ్చేలా 'పన్ను రిబేట్' పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు.
మరి, ఈ మధ్యంతర బడ్జెట్‌కు.. గతేడాది ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు మధ్య కేటాయింపుల్లో ఉన్న తేడా ఏమిటి? ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు? దేనికి తగ్గించారు? చూద్దాం.

ఫొటో సోర్స్, indiabudget.gov.in
రైతులకు , అసంఘటిత కార్మికులకు
2018-19 బడ్జెట్‌తో పోల్చితే వ్యవసాయ, అసంఘటిత రంగాలకు ప్రయోజనం కలిగించే పథకాలకు ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న `రైతు బంధు' తరహాలో నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి దాదాపు రూ.75 వేల కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
అయితే, ఈ పథకంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఏడాదికి రూ.6,000 అంటే రోజుకు రూ.17 రూపాయలు మాత్రమే అవుతుందని, అది రైతులను అవమానించడమేనని రాహుల్ అన్నారు.
అసంఘటిత రంగ శ్రామికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు కేటాయింపులు గత బడ్జెట్‌తో పోల్చితే ఈసారి భారీగా పెంచారు. 2018-19 బడ్జెట్‌లో రూ. 86,602 కోట్లు కాగా, ఈసారి రూ.1,49,981 కోట్లకు పెంచారు.
పశుపోషణను ప్రోత్సహించేందుకు కామధేను పథకాన్ని ప్రకటించారు.
ఎరువులపై ఇచ్చే రాయితీల కోసం గతేడాది రూ.70,075 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు రూ.74,986 కోట్లకు పెంచారు.
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు గతేడాది రూ. 1,35,109 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్‌లో రూ.1,38,962 కోట్లకు పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మాణ రంగం
నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని ఎత్తివేయాలన్న నిర్మాణదారులు, గృహ కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. అయితే, పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ, ఆ విషయంపై మంత్రుల బృందం సమాలోచనలు చేస్తోందని చెప్పారు.
'ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన' కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేటాయింపును రూ.15,500 నుంచి రూ. 19,000 కోట్లకు పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్య, ఉపాధి
జాతీయ విద్యా మిషన్‌కు గత బడ్జెట్‌లో రూ. 32,334 కోట్లు కేటాయించారు. ఈప్పుడు రూ.38,572 కోట్లకు పెరిగింది.
జాతీయ జీవనోపాధి మిషన్‌కు రూ. 6,294 కోట్ల నుంచి రూ. 9,524 కోట్లకు పెంచారు.
ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు గత బడ్జెట్‌లో రూ. 6,830 కోట్లు కేటాయించారు. ఈసారి దాన్ని రూ. 7,511 కోట్లకు పెంచారు.
రక్షణ రంగం
రక్షణ బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.2,85,423 కోట్లు కేటాయించారు.
రక్షణ విభాగానికి అవసరమైతే నిధులు ఇంకా పెంచేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
వైద్యం
గతేడాది ప్రధానంగా ప్రకటించిన భారీ పథకాల్లో 'ఆయుష్మాన్ భారత్' జాతీయ వైద్య బీమా పథకం. ఆ పథకం కింద 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పింది.
ఈ సారి ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. కానీ, పెద్దగా ఇతర ప్రకటనలు చేయలేదు.
జాతీయ వైద్య మిషన్‌కు కేటాయింపును రూ. 31,187 కోట్ల నుంచి రూ. 32,251 కోట్లకు పెంచారు.

ఫొటో సోర్స్, AFP
రైతు కూలీలకు
రైతులకు, కార్మికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే పథకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన తీసుకురాలేదు.
నగదు బదిలీ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు కలుగుతుంది. కానీ, వ్యవసాయంపై ఆధారపడి జీవించే భూమి లేని కూలీలకు, ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకునే రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
తెలంగాణలోనూ రైతు బంధు పథకం విషయంలో కౌలు రైతులను విస్మరించారన్న విమర్శలొచ్చాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం కూడా వారి ప్రస్తావన తీసుకురాలేదు.
ఈసారి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించారు. గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 61,084 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ. 60,000 కోట్లకు తగ్గించారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను
గత బడ్జెట్‌లో ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈసారి కూడా శ్లాబుల్లో మార్పు చేయలేదు కానీ, వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి ఊరటనిచ్చేలా 'పన్ను రిబేట్' పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








