2019: వరల్డ్ కప్.. లోక్‌సభ, ఏపీ ఎన్నికలు.. గెలిచేది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాల నుంచి సినిమాల వరకు 2018 సంవత్సరం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లింది.
బ్యాంకు మోసాలు, మూక దాడులు, రఫేల్ ఒప్పందం, సీబీఐలో అవినీతి ఆరోపణలు, తాజాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో 'సోనియా గాంధీ' పేరును మధ్యవర్తి మిషెల్ చెప్పడం వంటి విషయాలు పతాక శీర్షికల్లో నిలిచాయి.
సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తదితర అంశాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ పొత్తుల వ్యవహారం, వైసీపీ అధినేత వైఎస్. జగన్ పాదయాత్ర, ఆయనపై విశాఖ విమానాశ్రయంలో దాడి వంటి విషయాలు వార్తల్లో ప్రధానంగా నిలిచాయి.
ఇప్పుడు కొత్త సంవత్సరం వైపు చూద్దాం. ఈ ఏడాది దేశంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
లోక్సభ ఎన్నికలు
మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్‌సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగనున్నాయి. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? లేక రాహుల్ గాంధీ అవుతారా? అన్నది తేలిపోనుంది.
కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారేలా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అసెంబ్లీ ఎన్నికలు
2018లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పరాజయం పాలైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కమలం గట్టి పట్టు సాధించింది.
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది.
2019లో ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, జమ్ము కశ్మీర్.. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ వరల్డ్ కప్
మే నెలాఖరులో ఐసీసీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. నెలన్నర పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో 10 దేశాల జట్లు పాల్గొంటున్నాయి.
ఇప్పటి వరకు రెండు సార్లు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు మూడోసారి ప్రంపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న కాంక్షతో ఉంది.
జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జరుతుంది. జూన్ 16న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.
వివిధ దేశాల జట్లతో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్:
జూన్ 5: దక్షిణాఫ్రికా
జూన్ 9: ఆస్ట్రేలియా
జూన్ 13: న్యూజిలాండ్
జూన్ 16: పాకిస్తాన్
జూన్ 22: అఫ్గానిస్థాన్
జూన్ 27: వెస్టిండీస్
జూన్ 30: ఇంగ్లండ్
జులై 2: బంగ్లాదేశ్
జులై 6: శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images
రామ మందిరం
ఈ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అంశం బీజేపీకి అత్యంత ముఖ్యమైన విషయం. జనవరి 4న రామ మందిరం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
మందిరం నిర్మాణం కోసం ఈ ఎన్నికల్లోగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలన్న డిమాండ్ ఉంది. దాంతో, ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, THE ACCIDENTAL PRIME MINISTER
బయోపిక్ సినిమాల క్యూ
ఈ ఏడాది పలు రాజకీయ నాయకుల బయోపిక్ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగులో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు నాయుడుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ఈ ఎన్నికల సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.
శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సినిమా కూడా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- భారత్‌లో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం ఇదే
- వడా పావ్: ఇది మెక్ డొనాల్డ్స్కే చుక్కలు చూపించిన 'ఇండియన్ బర్గర్'
- జస్ప్రీత్ బుమ్రా: ఆ కోచ్ కన్ను పడకుంటే ఎక్కడుండేవాడో
- ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ‘మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. భారత్‌లో మాత్రం ఒకే కుటుంబం ఉంది’
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








