ఇండియా నీ అయ్య జాగీరా.. మోదీపై కేసీఆర్ ఫైర్: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, TRS Party/Facebook
ఇండియా నీ అయ్య జాగీరా అని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడినట్లు వెలుగు ఒక కథనాన్ని ప్రచురించింది.
అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా ప్రధాని మోదీ ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లను తొక్కి పట్టారని, ఇండియా ఆయన అయ్య జాగీరు కాదంటూ కేసీఆర్ ఫైరయ్యారు.
మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ఓ దిక్కుమాలిన పథకమని విమర్శించారు. ఆరోగ్యశ్రీ అద్భుతంగా అమలు చేస్తున్నామని, తమ పథకం మంచిగా ఉంటే కేంద్ర పథకంలో ఎందుకు చేరతామని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం కూడా బాగా లేదని కేసీఆర్ విమర్శించారు.
అడ్డంపొడుపు మాట్లాడుతున్న మోదీ.. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో అయినా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నారేమో చెప్పాలని సవాలు చేశారు. అబద్ధాలు మాట్లాడకుండా, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
పీసీసీ ప్రెసిడెంట్ వట్టి దద్దమ్మ అని కేసీఆర్ విమర్శించారు. నీళ్ల మీద చర్చ జరుగుతున్నపుడు మాట్లాడదామంటే ప్రిపేరయి రాలేదంటారు అని ఆరోపించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు పెడితే కాంగ్రెస్ పారిపోయిందని కేసీఆర్ అన్నట్లు వెలుగు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Harish Rao Thanneeru/Facebook
హరీశ్ రావుపై చర్యలకు ఈసీ ఆదేశాలు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో మంత్రి హరీష్‌రావుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించినట్లు ఈనాడు కథనం పేర్కొంది. హరీష్‌రావుపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఆ సెక్షన్ కింద ఎన్నికలతో సంబంధం ఉన్న వర్గాల మధ్య ఎవరూ శత్రుత్వాన్ని ప్రోత్సహించకూడదు. మతం, జాతి, సామాజిక వర్గం, భాషాపరమైన భావాలను రెచ్చగొట్టకూడదు. ఈ సెక్షన్ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించొచ్చు.
ఐటీ, పోలీసు బృందాలు నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటివరకు రూ.87.98 కోట్ల నగదు, రూ.8.86 కోట్ల మేర మద్యం, రూ.7.57 కోట్ల విలువగల ఇతర సామగ్రి పట్టుబడిందని రజత్ కుమార్ తెలిపారు. పట్టుబడిన డబ్బు ఏ పార్టీకి చెందిందో తెలుసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించినట్లు ఈనాడు కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, chandramukhi muvvala/Facebook
వీడిన మిస్టరీ
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం మిస్టరీ వీడిందని నవతెలంగాణ కథనం తెలిపింది.
మంగళవారం ఉదయం అదృశ్యమైన ఆమె బుధవారం రాత్రి ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రముఖి అదృశ్యంపై ఆమె తల్లి అనిత హైకోర్టును ఆశ్రయించగా.. గురువారం ఉదయం పదిగంటలకు చంద్రముఖిని హాజరుపర్చాలని పోలీసులకు న్యాయస్థానం గడువు పెట్టింది.
హైకోర్టు ఆదేశాలిచ్చిన గంటలోనే ఆమె తన లాయర్‌తో పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు.
చంద్రముఖి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటివద్ద నుంచి అదృశ్యమయ్యారు. ఒకపక్క టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మరోపక్క పోలీసులు ఆమె కోసం ఆరా తీస్తుండగానే రాత్రి 11 గంటల తర్వాత చంద్రముఖి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
అయితే తాను అదృశ్యమైన ఘటనకు సంబంధించి వివరాలు చెప్పటం లేదని, ఏదో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్టుగా కనిపిస్తున్నారని పోలీసులు తెలిపారు. చంద్రముఖి స్వయంగా ఆ మిస్టరీ వివరాలు చెబితేనే... దీని వెనుక ఉన్న వారెవరో తెలుస్తుందని నవతెలంగాణ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Hindustan Times
రీచార్జ్ చేయకపోతే నో సర్వీస్
జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు లైఫ్‌టైమ్ వాలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్ చేసుకోవాల్సిందేనని.. లేకుంటే సర్వీసులు డిస్‌కనెక్ట్ చేస్తామని ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలలో భాగంగా టెల్కో కంపెనీలు రీచార్జ్‌ల కోసం 28 రోజుల వేలిడిటీతో కనీస ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకోకపోతే 30 రోజుల్లోగా అవుట్ గోయింగ్ కాల్స్, 45 రోజుల్లోగా ఇన్‌కమింగ్ కాల్స్ నిల్చిపోతాయి.
ఈ కొత్త నిబంధన కారణంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్ గడువు ముగియడంతో ఇప్పటికే పలువురు ప్రీపెయిడ్ యూజర్లకు అవుట్‌గోయింగ్ కాల్స్‌ను నిలిపివేస్తున్నారు. కనీస రీచార్జ్‌పరమైన కొత్త మార్పుల వల్ల అకస్మాత్తుగా కాల్స్ ఆగిపోతుండటంతో యూజర్లు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్‌కమింగ్ కాల్స్ కోసం మాత్రమే ఎక్కువగా మొబైల్ ఫోన్స్‌ను ఉపయోగించే గ్రామీణ ప్రాంతాల వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే కనీస రీచార్జ్ చేసుకోవాలంటూ యూజర్లకు టెల్కోలు మెసేజీలు పంపిస్తుండటంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆపరేటర్లకు ట్రాయ్ అక్షింతలు వేసింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా సర్వీసులు ఎలా డిస్కనెక్ట్ చేస్తారంటూ ప్రశ్నించింది. ప్రీ-పెయిడ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు సర్వీసులను తక్షణమే డిస్కనెక్ట్ చేయొద్దంటూ టెల్కోలను ఆదేశించినట్లు సాక్షి కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








