టీఆర్ఎస్‌కు అవినీతే అజెండా -రాహుల్ గాంధీ; ఆయన పరిణతి సాధించాలి -కేసీఆర్

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన మొదటి రోజు సోమవారం శేరిలింగంపల్లిలో బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ఒకే విధంగా.. అవినీతే అజెండాగా పనిచేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం విడిపోయినపుడు చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.
అంతకుముందు రాజేందర్ నగర్‌లోని కన్వెన్షన్ సెంటర్లో స్వయం సహాయక మహిళా బృందాలను రాహుల్ కలుసుకున్నారు.

అక్కడ మహిళల నుంచి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఒక మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, "మహిళ లేనిది అభివృద్ధి సాధ్యం కాదు. ఇది కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది" అని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఈ మహిళల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని రాహుల్ అన్నారు. మహిళలకు రుణాలు ఇప్పించి.. వాటికి అయ్యే వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ- 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు.
ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారిని కేసీఆర్ భయభ్రాంతులకు గురిచేశారని ఉత్తమ్ ఆరోపించారు. "కాంగ్రెస్ ఆంధ్ర సెటిలర్లకు ఒక సందేశం ఇవ్వదలచుకుంది. ఆంధ్ర సెటిలర్లందరు ఇక్కడకు రావచ్చు. మేం అధికారంలోకి వచ్చాక వారికి సరైన స్థలం కూడా ఇస్తాం" అని తెలిపారు.
వాస్తవానికి రాహుల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సందర్శించాల్సి ఉంది. కానీ యూనివర్సిటీ యాజమాన్యం అనుమతివ్వలేదు. టీఆర్‌ఎస్ ఆదేశాలతో కొందరు విద్యార్థులు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

రాహుల్ పాత విషయాలను రెచ్చగొడుతున్నారు: టీఆర్‌ఎస్
రాహుల్ పాత విషయాలను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ అంటోంది. కుటుంబ పాలన గురించి రాహుల్ చెప్పడం విడ్డూరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో విలేఖర్ల సమావేశంలో అన్నారు. ‘‘కాంగ్రెస్ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన మంచిది’’ అని ఆయన అన్నారు.
''రాహుల్ ఎదగాలని కోరుకుంటున్నా. అతను పరిణతి సాధించాలి. రాహుల్ అధికార పక్షానికి ఒక ఆస్తిలా మారారు. రాహుల్ అంటే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ 101 శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది'' అని కేసీఆర్ చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ- "కాంగ్రెస్ పాత విషయాలను మళ్లీ తెరపైకి తెస్తోంది. ప్రజా తీర్పు స్పష్టం. కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా, కాంగ్రెస్ అయినా మరో జాతీయ పార్టీ అయినా ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ ప్రజలకు తామెంతో చేయగలమని టీఆర్ఎస్ నిరూపించుకుంది" అన్నారు.
'రాహుల్ ప్రజల నాడిపట్టే వ్యూహంలో ఉన్నారు'
రాహుల్ పర్యటనపై విశ్లేషకుడు తెలకపల్లి రవి స్పందిస్తూ- "ప్రస్తుతానికి రాహుల్ ప్రజల నాడిని పసిగట్టే వ్యూహంలో ఉన్నారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమం జరుగుతోంది'' అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు వాళ్లు ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి తామే కారణమని కాంగ్రెస్ చెప్పుకుంటోందని రవి గుర్తు చేశారు. "రాహుల్ తెలంగాణ అమరుల స్తూపాన్ని సందర్శించనుండటం ఈ క్రమంలోదే'' అని రవి అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








