ప్రెస్‌రివ్యూ: అక్రమ సంబంధాల్లో పురుషుడికి శిక్ష విధించే.. ‘సెక్షన్ 497 సమానత్వ హక్కుకు విరుద్ధం’

అక్రమ సంబంధాల్లో పురుషుడికి శిక్ష విధించే.. ‘సెక్షన్ 497 సమానత్వ హక్కుకు విరుద్ధం’
పరాయి పురుషుడి భార్యతో వివాహేతర సంబంధాల విషయంలో సెక్షన్-497 ఏకపక్షంగా ఉందనీ, సమానత్వ హక్కుకు ఇది విరుద్ధమనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.
వివాహితులైన స్త్రీని, పురుషుడిని ఈ చట్టం భిన్నంగా చూస్తోందనీ, ఇది విస్పష్టంగా కనిపిస్తోందనీ సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
పరాయి వివాహిత పురుషుడితో సంబంధం పెట్టుకునే విషయం ఆమె భర్త 'సమ్మతి లేదా అర్ధాంగీకారం'పై ఆధారపడి ఉంటుందని చెప్పడం... వివాహిత మహిళను ఒక సొంత ఆస్తి/ గృహోపకరణంగా చూడడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.
రాజ్యాంగపరంగా సెక్షన్-497 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం మొదలైన ధర్మాసనం విచారణ గురువారమూ కొనసాగింది. 158 ఏళ్ల క్రితం రూపొందిన ఈ సెక్షన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. భర్త సమ్మతి ఉంటే వివాహేతర సంబంధం నేరం కాదనే అంశాన్ని సూక్ష్మంగా విశ్లేషించింది.
'వేరొకరి భార్య అని తెలిసినప్పుడు, లేదా అలా విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నప్పుడు, అతని అనుమతి లేకుండా ఆమెతో పరాయి వివాహితుడు లైంగిక చర్యలో పాల్గొనడం వ్యభిచార నేరమే' అని ఈ సెక్షన్ చెబుతోంది. 'ఇక్కడ వివాహ వ్యవస్థ పవిత్రత కచ్చితంగా ఉంది. నిబంధన రూపొందించిన తీరు మాత్రం సమానత్వ హక్కుకు భిన్నంగా ఉంది. దీనిని ఆ కోణంలో పరిశీలిస్తాం' అని తెలిపింది.
వివాహేతర సంబంధాల్లో పురుషుడినే అపరాధిగా పరిగణించి, స్త్రీని విడిచిపెట్టేయడం తగదని పిటిషనర్ తరఫు న్యాయవాది కలీశ్వరం రాజ్ వాదించారు.
ఏమిటీ సెక్షన్ 497
మరో పురుషుడి భార్య అని తెలిసీ.. ఆ పురుషుడి సమ్మతి లేకుండా సదరు స్త్రీతో లైంగిక చర్యలో పాల్గొంటే.. అది అత్యాచారం కాకపోతే.. దాన్ని వ్యభిచార నేరంగా పరిగణించాల్సి వస్తుంది. దీనికి పాల్పడిన పురుషుడికి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించొచ్చు. అయితే ఈ కేసులో స్త్రీని మాత్రం సహాయకారిగా శిక్షించటానికి లేదు.
సెక్షన్-497 ప్రకారం వివాహేతర సంబంధాల్లో పురుషుడికి 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించొచ్చు. స్త్రీని మాత్రం శిక్షించటానికి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
రాయలసీమతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో దుర్భర కరవు పరిస్థితులు నెలకొన్నాయంటూ 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.
కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. కడప జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఈ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. కడప జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది.
ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి. వేరుశనగ విత్తనం వేసే సీజన్ దాటిపోయింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది.
వర్షాల జాడ లేకపోవడంతో అధిక ధరలు పెట్టి కొనుక్కొచ్చిన వేరుశనగ విత్తనాలను రైతులు తక్కువ ధరకే కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు.
ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, NAlle sivakumar
పోలవరంపై ఆ లెక్కలు చెప్పండి
పోలవరం కోసం సేకరించాల్సిన భూమి విస్తీర్ణం ఎందుకు పెరిగిందో వివరించాలంటూ కేంద్ర మంత్రి గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించారంటూ 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం రాసింది.
'2013కి ముందు సేకరించాల్సిన భూమి కంటే ఎందుకు ఎక్కువ సేకరించాల్సి వచ్చింది? నిర్వాసితుల సంఖ్య 44 వేల నుంచి 96 వేలకు ఎందుకు పెరిగింది? ముంపు గ్రామాల సంఖ్య ఎందుకంత పెరిగింది? నిర్వాసితుల పేర్లు, అవార్డుల వివరాలను సర్వే నంబర్లు సహా సోమవారం (6వ తేదీ) లోగా ఇవ్వండి' అని రాష్ట్ర అధికారులను గడ్కరీ ఆదేశించారు.
2013-14 అంచనాల్లో స్పష్టత ఉంటే.. కేంద్ర జల సంఘం వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తే సత్వరమే అంచనాలను ఆమోదిస్తామని తెలిపారు. అంచనాల్లో స్పష్టత ఉన్నంత వరకూ ఆ మొత్తాన్ని 'క్లియర్' చేస్తామని అన్నారు. తద్వారా ప్రధాన పనుల వరకు మాత్రమే నిధులు అందిస్తామని సంకేతప్రాయంగా తెలియజేశారని ఆంధ్రజ్యోతి రాసింది.
గురువారం దిల్లీలోని తన కార్యాలయంలో కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్, కేంద్ర జల సంఘం ఇన్‌చార్జి చైర్మన్ మసూద్ అహ్మద్, చీఫ్ ఇంజనీర్ సీకేఎల్ దాస్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, రాష్ట్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ నాగిరెడ్డిలతో కేంద్రమంత్రి గడ్కరీ సమీక్ష నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారానికి తగ్గుతున్న డిమాండ్
కొన్ని నెలలుగా బంగారం ధరలు పెరిగిపోవడంతో కొనుగోళ్లకు సామాన్యులు దూరంగా ఉంటున్నారు. దాంతో బంగారానికి డిమాండ్ పడిపోతోందంటూ 'నవతెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 8 శాతం మేర తగ్గి 187.2 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో తెలిపింది. 2017 రెండో త్రైమాసికంలో 202.6 టన్నుల పసిడికి డిమాండ్ ఏర్పడిందని వెల్లడించింది.
విలువ పరంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో రూ.52,692 కోట్ల విలువ చేసే బంగారం అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ కొనుగోళ్ల విలువ రూ.52,750 కోట్లగా నమోదు అయింది. స్థానికంగా పసిడి ధర పెరగడమే ఇందుకు కారణమని ఈ నివేదిక పేర్కొంది.
తాత్కాలికంగా పసిడి డిమాండ్‌లో తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ.. 2018 ద్వితీయార్థంలో డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. ప్రస్తుత ఏడాదిలో మొత్తంగా బంగారానికి 700-800 టన్నుల మేర డిమాండ్ లభించే అవకాశాలున్నాయని సోమసుందరం తెలిపారు.
ఇవి కూడా చదవండి
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- ‘అడల్టరీ చట్టం’లో మార్పులతో వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయా?
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- 34 ఏళ్లు వెదికితే కానీ భారత మొదటి ఒలింపియన్ కుటుంబం ఆచూకీ దొరకలేదు
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- 5,300 ఏళ్ల కిందటి మంచుమనిషి చివరిగా ఏం తిన్నాడు?
- స్వలింగ సంపర్కం నేరస్మృతి నుంచి బయట పడగలుగుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








